పీకల్లోతు అప్పుల్లో తమిళనాడు...విజయ్ కి పెను సవాల్ !
తమిళనాడుకి కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు రాజకీయ పాలనాపరమైన అనుభవం అయితే లేదు. సినీ నటుడిగా మూడు దశాబ్దాల పాటు తమిళ ప్రజల మన్ననలు అందుకున్నారు.
By: Satya P | 21 Jun 2026 1:00 PM ISTతమిళనాడుకి కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు రాజకీయ పాలనాపరమైన అనుభవం అయితే లేదు. సినీ నటుడిగా మూడు దశాబ్దాల పాటు తమిళ ప్రజల మన్ననలు అందుకున్నారు. యువత మహిళ మధ్యతరగతి వర్గాల ఆశలకు ప్రతిరూపంగా మారి తమిళ పీఠం ఎక్కారు. ఇక ఎన్నికల్లో గెలిచేందుకు విజయ్ అనేక హామీలను ఇచ్చారు. అవన్నీ కూడా చూస్తే వేల కోట్ల రూపాయలు ఖజానా నుంచి తీసి ఖర్చు చేయాల్సినవే అని చెప్పాల్సి ఉంది. మరి విజయ్ తమిళనాడు ఖజానా పరిస్థితి చూసుకున్నారా అంటే ఆయన సీఎం అయ్యాకనే ఆర్ధిక భారం ఏమిటి అన్నది తెలిసింది. అందుకే ఆయన తొలి రోజునే అప్పులను తమ నెత్తిన పెట్టారు అని వ్యాఖ్యానించారు. తాజాగా విజయ్ ప్రభుత్వం తమిళనాడు ఆర్ధిక పరిస్థితి మీద ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసింది. ఇది చూసిన వారికి గుండె బేజారవడం ఖాయం. తమిళనాడులో అప్పులు చూస్తే రాష్ట్రం పీకల్లోతుల్లో ఉందని అర్ధం అవుతోంది.
నికరంగా 13 లక్షల కోట్లు :
విజయ్ ప్రభుత్వం తేల్చింది ఏంటి అంటే తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని. నికరంగా చూస్తే 13 లక్షల కోట్ల పెను భారంతో ఉందని. అందులో 10 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్ష రుణాలు అయితే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు మరో మూడు లక్షల కోట్లుగా ఉన్నాయని. అంతే కాదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రెవిన్యూ లోటు ఉందని టీవీకే ప్రభుత్వం చెబుతోంది. అది 78,324 కోట్ల రూపాయలకు చేరుకోవడం అంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే అని అంటున్నారు. ఈ శ్వేత పత్రాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ విడుదల చేశారు.
డీఎంకే అధిక వాటా :
ఈ అప్పుల కుప్పలో నిన్నటిదాకా తమిళనాడుని ఏలిన డీఎంకేది అధిక వాటా అని కూడా టీవీకే ప్రభుత్వం లెక్క తేల్చింది. గత ఐదేళ్లలోనే చేసిన అప్పు రూ. 4.87 లక్షల కోట్లు పెరిగిందని గుర్తు చేసింది. ఇది తమిళనాడు రాష్ట్రం ఏర్పడిన తొలి ఆరు దశాబ్దాలలో పేరుకుపోయిన మొత్తం అప్పు కంటే ఎక్కువని కూడా స్పష్టం చేసింది. మూలధన వ్యయం కంటే అప్పు చాలా వేగంగా పెరుగుతోందని అంటే ఉత్పాదక ఆస్తుల సృష్టికి కాకుండా రోజువారీ ఖర్చుల కోసం అప్పులను ఎక్కువగా వినియోగించారని టీవీకే గత ప్రభుత్వం తీరుని దుయ్యబెట్టింది.
ఖజానా నడ్డి విరిచే వడ్డీలు :
తెచ్చిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు చూస్తే కనుక ఖజానా నడ్డి విరుగుతోందని కూడా టీవీకే ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక పత్రం చెబుతోంది. ఉదాహరణకు 2025-26లో మూలధన వ్యయం 50,911 కోట్లుగా అంచనా వేయగా వడ్డీ చెల్లింపులు 67,050 కోట్లుగా ఉంటాయని అంచనా వేశారు. ఇక ఆస్తుల సృష్టికి ఖర్చు చేసే ప్రతి రూపాయికి తమిళనాడు ఇప్పుడు వడ్డీ చెల్లింపుల కోసం 1.32 ఖర్చు చేస్తోందని ఈ ఆర్ధిక నివేదిక పేర్కొంది. మొత్తం రెవెన్యూ రాబడిలో 22.8 శాతం అలాగే రాష్ట్ర సొంత పన్ను రాబడిలో దాదాపు 35 శాతం కేవలం వడ్డీ చెల్లింపులకే వెచ్చిస్తున్నారు అంటే తమిళనాడు ఖజానా ఎంత భారం మోస్తోంది అన్నది అర్ధమవుతోంది.
పెను సవాల్ అంటూనే :
ఈ ఆర్ధిక నివేదికను విడుదల చేసిన టీవీకే ప్రభుత్వం ఇది తమిళనాడుకు పెను సవాల్ అని చెబుతూనే కష్టపడాల్సిన అవసరం ఉందని అంటోంది. మరి విజయ్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతి ఏమిటి అన్న చర్చ వస్తోంది. ఏకంగా బంగారం కూడా ప్రతీ ఇంటికీ ఇస్తామని హామీలు ఎన్నికల వేళ మహిళలకు నెలకు 2,500 భృతి, సహకార వ్యవసాయ రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు. ఆర్థికంగా వెనుకబడిన వధువులకు వివాహ సందర్భంగా ఎనిమిది గ్రాముల బంగారం ఇలా ఎన్నో హామీలు ఇచ్చింది. అలాగే ప్రభుత్వం కూడా నడపాలి. మరి ఈ అప్పులో ఊబిలో పడిన రాష్ట్రం విజయ్ సమర్ధతకు ఒక సవాల్ గా మారుతోంది అని అంటున్నారు.
