ఆ ముగ్గురు తలచుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్నివిధాలుగా నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
By: Tupaki Political Desk | 3 Dec 2025 1:40 PM ISTతన కేబినెట్లో ముగ్గురు మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తమ్మల నాగేశ్వరరావు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ముగ్గురు మంత్రులు తలచుకుంటే జరగని పని అంటూ ఏదీ ఉండదని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్నివిధాలుగా నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన ఉమ్మడి జిల్లావాసులకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీని గెలిపించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రుణం తీర్చుకునేలా అభివృద్ది చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం తరఫున ఏ పథకం ప్రారంభించినా, ఖమ్మం నుంచే ప్రారంభిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ క్రమంలో తన కేబినెట్ సహచరులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్దికి ఏం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి భట్టి, రెవెన్యూ మంత్రి పొంగులేటి, వ్యవసాయ మంత్రి తమ్మల సహకారంతో జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓటును ఆయుధంగా ఉపయోగించి మంచి వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవాలని సూచించారు. డబ్బు, మందు కోసం ఎవరికి ఓటు వేయొద్దని హితవు పలికారు.
ఇక సీఎం వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లాకు లేని విధంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉమ్మడి ఖమ్మం నుంచి ముగ్గురు సీనియర్ నాయకులకు చోటు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ఈ ముగ్గురు కృషిని కూడా సీఎం ప్రత్యేకంగా గుర్తించుకున్నట్లు ఆయన వ్యాఖ్యల బట్టి అర్థం అవుతోందని అంటున్నారు. ఆదిలాబాద్ నుంచి మధిర వరకు భట్టి అప్పట్లో పాదయాత్ర చేయగా, ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ సర్కారును చెమటలు పట్టించి పొంగులేటి, తమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఈ ముగ్గురు నేతల ప్రభావం కాంగ్రెస్ గెలుపునకు కొంతవరకు పనికొచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ కారణంగానే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కీలక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తామంతా కలిసి పనిచేస్తున్నామని, ప్రజల ఆలోచనలకు తగ్గ విధంగా నడుచుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారని భావిస్తున్నారు.
