Begin typing your search above and press return to search.

తెలంగాణ భాషా ప్ర‌యుక్త రాష్ట్రం కాదు: రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ ఏర్పాటు.. విభ‌జ‌న అంశాల‌పై రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్య‌వ‌హారంపై ప‌రోక్షంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

By:  Garuda Media   |   20 Jun 2026 12:19 AM IST
తెలంగాణ భాషా ప్ర‌యుక్త రాష్ట్రం కాదు: రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు
X

తెలంగాణ ఏర్పాటు.. విభ‌జ‌న అంశాల‌పై రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్య‌వ‌హారంపై ప‌రోక్షంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ భాషా ప్ర‌యుక్త రాష్ట్రంగా .. కేవ‌లం భాష ల ప్రాతిప‌దికన ఏర్ప‌డిన రాష్ట్రం కాద‌ని తెలిపారు. ఎంతో మంది త్యాగాలు చేసి.. బ‌లిదానాలు చేసిన త‌ర్వాత‌.. ఏర్పడిన రాష్ట్రంగా ఆయ‌న పేర్కొన్నారు. ``తెలంగాణ భాషా ప్ర‌యుక్త రాష్ట్రంగా ఆవిర్భ‌వించ‌లేదు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం.. వేలాది మంది ఆత్మ‌బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన రాష్ట్రం.`` అని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో కోసం వేలాది మంది విద్యార్థులు పోరాటాలు చేసి.. లాఠీ దెబ్బ‌లు తిన్నార‌న్న సీఎం.. అనేక మంది ప్రాణాల‌ను కూడా అర్పించార‌ని తెలిపారు. విద్య ద్వారానే జీవితాలు.. రాష్ట్రాలు పురోభివృద్ధిలో న‌డుస్తాయ‌ని.. ఆ విద్య కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతైనా ఖ‌ర్చుచేస్తుంద‌ని తెలిపారు. ఉన్న‌త విద్య‌వర‌కు ఉచితంగా అందిస్తున్నామ‌న్నారు. తెలంగాణ మోడ‌ల్ స్కూల్స్ ఏర్పాటు రాష్ట్ర విద్యావ్య‌వ‌స్థ‌కే త‌ల‌మానికంగా మారింద‌ని పేర్కొన్నారు. శుక్ర‌వారం సాయంత్రం.. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ స‌మ‌క్షంలో యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్‌ను సీఎం పంపిణీ చేశారు.

గ‌తంలో..

గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం.. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించింద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీటిలో ప్ర‌ధానంగా విద్యా వ్య‌వ‌స్థ అని పేర్కొన్నారు. ఫ‌లితంగా విద్యాల‌యాలు భ్ర‌ష్టుప‌ట్టాయ‌ని ఆరోపించారు. విద్యావ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేసిన వారు బాగానే ఉన్నార‌ని.. కానీ, విద్యార్థుల జీవితాలే నాశ‌నం అయ్యాయ‌ని ఆరోపించారు. ఇప్పుడు తాము.. విద్యా వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు బ‌డ్జెట్‌లో దాదాపు 9 శాతం నిధుల‌ను కేటాయించామ‌న్నారు. యంగ్ ఇండియా కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ఆరుట్ల‌లో తెలంగాణ మోడ‌ల్ స్కూల్‌కు నో అడ్మిష‌న్ బోర్డు పెట్ట‌డం.. త‌న‌కు ఎంతో సంతోషం క‌లిగించింద‌న్నారు.

ఉజ్వ‌ల భ‌విత‌..

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోచ‌దువుకునే వారికి ఉజ్వ‌ల భ‌విత ఉంటుంద‌ని సీఎం పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో కూడా ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో చ‌దువుకున్న వారికి అవ‌కాశాలు మెరుగు ప‌డేలా చేస్తామ‌న్నారు. స‌క‌ల స‌దుపాయాల‌తో తెలంగాణ మోడ‌ల్ స్కూళ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. తెలంగాణ విష‌యంలో ఎవ‌రూ రాజీ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఇది తెలంగాణ బిడ్డ‌ల ఆత్మ బ‌లిదానాల‌తోనే ఏర్పాటైన రాష్ట్ర‌మ‌ని.. ప‌రోక్షంగా ఇత‌ర పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వం.. డ‌బ్బులోనో.. గౌర‌వంలోనో లేద‌ని.. చ‌దువులోనే ఉంద‌ని పేర్కొన్నారు.