Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రోడ్ల విషయంలో సీఎం వార్నింగ్.. వారిని తొలగిస్తామని ఫైర్..

మున్సిపల్ శాఖ సక్రమంగా పనిచేయాలంటే ఉన్నతాధికారులు, ఫీల్డ్ స్థాయి కార్యనిర్వాహకుల మధ్య సమన్వయం కీలకమని సీఎం పేర్కొన్నారు.

By:  Tupaki Political Desk   |   18 Feb 2026 10:44 AM IST
హైదరాబాద్ రోడ్ల విషయంలో సీఎం వార్నింగ్.. వారిని తొలగిస్తామని ఫైర్..
X

హైదరాబాద్ రహదారుల నాణ్యతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘పారిశుధ్య లోపం కనిపిస్తే అధికారులపై అక్కడికక్కడే యాక్షన్ తీసుకుంటాం’ అని సీఎం చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. నగర మౌలిక సదుపాయాలపై రాజీ పడబోమనే సంకేతాన్ని ఆయన స్పష్టంగా ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో రహదారుల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందనే అభిప్రాయం ఉంది. అయితే ప్రమాదాలు, గుంతలు, వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై, అత్యుత్తమ నాణ్యత గల రహదారుల అమలుపై సమగ్ర ప్రణాళికను కోరినట్లు తెలుస్తోంది.

మొదటి సారి సమావేశం..

సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ ప్రాంతాలుగా విభజన తర్వాత కార్పొరేషన్ అధికారులు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి తన వైఖరిలో చాలా స్పష్టంగా వ్యవహరించినట్లు సమాచారం. నగరంలో ఎక్కడైనా రోడ్లు అపరిశుభ్రంగా లేదా మరమ్మతులు అవసరమైన స్థితిలో ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘జవాబుదారీతనం తప్పనిసరి’ అనే సందేశాన్ని ఆయన అధికారులకు ఇచ్చారు.

మున్సిపల్ శాఖ సక్రమంగా పనిచేయాలంటే ఉన్నతాధికారులు, ఫీల్డ్ స్థాయి కార్యనిర్వాహకుల మధ్య సమన్వయం కీలకమని సీఎం పేర్కొన్నారు. పనులు కేవలం ఫైళ్లలో కాకుండా కనుల ముందు కనిపించాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యత నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

అధికారులకు వార్నింగ్..

నగరంలో అనేక ప్రాంతాల్లో పారిశుధ్యం, గుంతల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, ఫొటోలు వెంటనే పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కఠినంగా వినిపించినా, ఉద్దేశం నగర మౌలిక సదుపాయాల మెరుగుదలకే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ రహదారులు నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకుంటాయా? ప్రజలు మాత్రం ఫలితాలనే చూస్తున్నారు.

రాబోయే రోజుల్లో స్పెషల్ డ్రైవ్..

ఇక రాబోయే రోజుల్లో నగర రహదారులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాన రహదారులే కాకుండా కాలనీల్లోని అంతర్గత వీధులు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఔటర్ ప్రాంతాల్లోని లింక్ రోడ్లపై కూడా సమగ్ర సమీక్ష చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. గుంతల పూడిక, డ్రైనేజీ లీకేజీలు, పనులు పూర్తికాక వదిలేసిన కాంట్రాక్టర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పనితీరు ఆధారంగా అధికారులపై అంచనాలు వేస్తామని, బాధ్యత నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేసినట్లు తెలిసింది.

అయితే ప్రజలు ఆశిస్తున్నది హెచ్చరికలు కాదు, ఫలితాలు. ప్రతి వర్షాకాలంలో గుంతలమయం అవుతున్ రోడ్లు, ప్రమాదాల భయం మళ్లీ మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కావాలి. మాటల్లో కఠినత్వం కంటే అమల్లో క్రమశిక్షణ ముఖ్యం. సీఎం ఇచ్చిన గట్టి సందేశం అధికార యంత్రాంగాన్ని చురుకుగా మార్చితే, హైదరాబాద్ నిజంగా దేశంలోనే అత్యుత్తమ రహదారులతో నిలిచే నగరంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు బంతి అధికారుల మైదానంలో ఉంది.