మేయర్ రేసులో ఎంపీ సతీమణి ?
విశాఖ మేయర్ సీటు కోసం పోటీ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో బిగ్ షాట్స్ ఈ పీఠం మీద గురి పెడుతున్నారు.
By: Satya P | 26 Sept 2026 9:01 AM ISTవిశాఖ మేయర్ సీటు కోసం పోటీ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో బిగ్ షాట్స్ ఈ పీఠం మీద గురి పెడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీల వారసులే నేరుగా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఏపీలోనే అతి పెద్ద కార్పోరేషన్ గా ఉనన్ జీవీఎంసీ మేయర్ కావడమే లక్ష్యంగా భారీ ఎత్తున ఆశావహులు పావులు కదుపుతున్నారు. ఇపుడు అనూహ్యంగా రేసులోకి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సతీమణి వస్తున్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం రమేష్ అంటే అన్ని విధాలుగా ధీటైన నాయకుడు అన్నది తెలిసిందే. రాయలసీమ నుంచి చివరి నిముషంలో విశాఖకు షిఫ్ట్ అయి పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న చోట కమలం పార్టీ గుర్తు కూడా తెలియని చోట అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించి తానేంటో అందరికీ చాటి చెప్పారు.
ఆమెను మేయరుగా :
ఇపుడు చూస్తే సీఎం రమేష్ తన సతీమణి శ్రీదేవిని విశాఖ మేయర్ పీఠానికి పోటీగా నిలుపుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఆయన బీజేపీ ఎంపీ. ఆయనకు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి విధితమే. అనేక పార్లమెంటరీ కమిటీలలో ఆయన ఉన్నారు. ఆయనకు బీజేపీ పెద్దలు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మరో వైపు చూస్తే ఆయన పూర్వాశ్రమంలో రెండు సార్లు టీడీపీ తరఫున రాజ్యసభ మెంబర్ గా పనిచేశారు. ఆయనకు టీడీపీతో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. దాంతో ఆయన తలచుకుంటే ఆయన సతీమణికి టికెట్ దక్కడం పెద్ద విశేషం కాదని అంటున్నారు.
మహిళా కోటాలో :
ఏపీలో 17 మేయర్ పీఠాలు ఉన్నాయి. అందులో కొన్ని మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్లు కూడా చూసుకుని అన్ని చోట్లా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విశాఖ మేయర్ పీఠాన్ని మహిళలకు రిజర్వ్ చేస్తే మరో చోట ఓపెన్ కేటగిరి అవుతుందని లెక్కలు ఉన్నాయి. అంతే కాదు మహిళలకు విశాఖ వంటి మేయర్ పీఠాన్ని అందించామని చెప్పుకోవడానికి కూటమి పార్టీలకు వీలు అవుతుందని అంటున్నారు. ఇక సీఎం రమేష్ కుటుంబానికి టికెట్ అంటే కూటమిలో అన్ని పార్టీలకు సర్వామోదం ఉంటుందని అంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా విశాఖ మేయర్ తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ విధంగా న్యాయం చేసినట్లుగా మిత్ర పక్షానికి ఇచ్చామని చెప్పుకోవడానికి ఈ సీటు కోసం సాగుతున్న పెద్ద పోటీని నివారించినట్లు అవుతుందని కూడా అంటున్నారు.
విపక్షం లోకల్ కార్డు :
అయితే అన్నీ బాగానే ఉన్నా విపక్షం లోకల్ కార్డుతో ముందుకు వెళ్తే ఎలా అన్నదే కొంత వరకూ చర్చకు వస్తోంది. అయితే విశాఖ విశ్వ నగరం అని దాని విషయంలో ప్రాంతీయత స్థానికత వంటి అంశాలు అసలు పనిచేయవని అంటున్నారు. పైగా కూటమి తరఫున పోటీకి దిగడమే లాంచనం అని గెలుపు కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సీఎం రమేష్ సతీమణికి కనుక రేసులోకి వస్తే కచ్చితంగా ఆశావహులు ఎందరు ఉన్నా వెనక్కి తగ్గాల్సిందేనా అన్న చర్చ వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
