సీఎం రమేష్ పలుకుబడి తగ్గిందా ?
సీఎం రమేష్. ఇంటి పేరులోనే సీఎం ఉంది. ఇక ఆయన ఎంపీగా మూడు టెర్ములుగా పార్లమెంట్ లో కొనసాగుతున్నారు.
By: Satya P | 5 Oct 2026 8:50 AM ISTసీఎం రమేష్. ఇంటి పేరులోనే సీఎం ఉంది. ఇక ఆయన ఎంపీగా మూడు టెర్ములుగా పార్లమెంట్ లో కొనసాగుతున్నారు. రాజ్యసభ మెంబర్ గా రెండు సార్లు పన్నెండేళ్ల పాటు పనిచేసిన ఆయన అనకాపల్లి నుంచి తొలిసారి లోక్ సభకు 2024 ఎన్నికల్లో గెలిచారు. అనూహ్యంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రాకు రాజకీయ బదిలీగా వచ్చినా అక్కడ కూడా తన సత్తా చాటుకున్నారు. అతి తక్కువ సమయంలో ఎన్నికలలో పాల్గొని బంపర్ మెజారిటీతో గెలిచి ఎంపీ అవడమే కాదు బీజేపీకి రూరల్ ఏరియాలో ఎంపీ సీటు ఎలా గెలవాలో కూడా అమలు చేసి చూపించారు.
బీజేపీకి సన్నిహితం :
ఇక సీఎం రమేష్ అంటే టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబుకు కుడి భుజం లాంటి నాయకుడు అని అంతటా ప్రచారం సాగేది. ఆయన పార్టీలో తెర వెనక కీలక పాత్ర పోషించేవారు అని కూడా చెప్పుకునే వారు, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆయన ప్రభావం పార్టీలో ఉండేదని కూడా అనేవారు. ఆయన బీజేపీలోకి చేరినా ఇప్పటికీ టీడీపీ అధినాయకత్వం వద్ద ఆయన పలుకుబడి అలాగే ఉందని కూడా చెబుతారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్ర పెద్దలతో సీఎం రమేష్ సాన్నిహిత్యాన్ని వివిధ రకాలుగా ప్రచారం చేసేవారు చెప్పుకునే వారు ఉన్నారు. ఆయనకు కేంద్ర నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయని కూడా అంటారు. అనడమే కాదు దానికి రుజువులుగా జరిగిన కొన్ని ఉదంతాలను గుర్తు చేసుకుంటారు.
కీలక కమిటీలలో :
సీఎం రమేష్ నిజానికి కేంద్ర మంత్రి మండలిలో ఉండాల్సిన వారు అని కూడా అంటారు. అయితే ప్రాంతీయ సామాజిక సమీకరణలు పొత్తుల వల్ల ఆయనకు చాన్స్ దక్కలేదని కూడా విశ్లేషిస్తారు. అయితే మాత్రమేమి ఆయనకు కేంద్ర పార్లమెంటరీ కమిటీలలో గత రెండేళ్లలో కీలకమైన స్థానమే దక్కిందని గుర్తు చేస్తారు. కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా రమేష్ ఒకసారి కాదు రెండు సార్లు పనిచేశారు. ఏడాది కాల పరిమితితో కూడిన ఈ పదవిని రెన్యూవల్ చేయడం అంటే సీఎం రమేష్ పరపతి ఏమిటో తెలిసింది కదా అనే వారూ ఉన్నారు. అంతే కాదు అదే సమయంలో మరికొన్ని కమిటీలలోనూ ఆయన ఉండేవారు. కానీ తాజాగా పార్లమెంటరీ కమిటీల పునర్వ్యవస్థీకరణలో మాత్రం రమేష్ కి చోటు దక్కలేదు, ఇదేమిటి అని అంతా అక్కడే ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకలా జరిగింది :
రమేష్ అంటేనే బీజేపీ పెద్దలు ఎంతగానో గౌరవించి సమాదరిస్తారు కదా. అలాంటిది ఆయనకి ఎన్నో పార్లమెంటరీ కమిటీలు ఉంటే ఒక్క దానిలో అయినా చైర్మన్ గా చాన్స్ ఇవ్వలేకపోయారా అని కూడా చర్చించుకుంటున్నారు. రమేష్ కొన్ని కమిటీలలో మెంబర్ గానే ఉన్నారు తప్పించి చైర్మన్ గా ఆయనకు ఎక్కడా చోటు దక్కలేదు. నిజానికి పార్లమెంటరీ వ్యవహారాలలో పదిహేనేళ్ల అనుభవం ఉన్న రమేష్ కి ఏదో కమిటీలో చైర్మన్ హోదాతో ఎందుకు అవకాశం ఈమారు ఇవ్వలేదు అన్నది కీలకమైన ప్రశ్న. అయితే ఇక్కడే ప్రత్యర్ధులు అంటున్నది ఏంటి అంటే రమేష్ కి పలుకుబడి తగ్గింది అని. అందుకే ఆయన్ని ఈసారి పరిగణనలోకి తీసుకోలేదని.
ఇదీ మ్యాటర్ అంటూ :
అయితే దీనిని రమేష్ వర్గీయులు అయితే తోసి పుచ్చుతున్నారు. పార్లమెంటరీ కమిటీలలో అందరు ఎంపీలకూ చాన్స్ ఇస్తారు. ఒక్కరికే పదే పదే ఇవ్వాలంటే మిగిలిన వారి సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అక్కడికీ రమేష్ కి వరసగా రెండేళ్ళ పాటు చైర్మన్ గా చాన్స్ ఇచ్చారు కదా అని గుర్తు చేస్తున్నారు. ఈ తడవ ఇవ్వకపోతే పలుకుబడి లేనట్లేనా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో రమేష్ పరపతి కానీ హవా కానీ అలాగే కొనసాగుతోంది అని అంటున్నారు. అయితే ప్రత్యర్ధులు మాత్రం రమేష్ విషయంలో కమలనాధులు కాస్తా ఆలోచించే ఇలా చేశారు అని అంటున్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్రమ మైనింగుల వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడం కూడా ప్రభావం చూపించింది అని అంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలే రమేష్ వంటి బిగ్ షాట్ ని బీజేపీ వంటి పార్టీ ఎందుకు దూరం పెడుతుందని కూడా అంటున్నారు. ఆయనకు ఈ పదవి రాకపోవచ్చు ఫ్యూచర్ లో మరిన్ని పదవులు రెడీగా ఉన్నాయని మద్దతుదారులు అంటున్నారు. చూడాలి మరి.
