Begin typing your search above and press return to search.

సీఎం కుర్చీ అవుట్ ఆఫ్ స్టాక్... 'నవంబర్ విప్లవం' పై బీజేపీ ఏఐ సెటైర్లు!

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ పోరు నడుస్తుందనే చర్చ రాజకీయా వర్గాల్లో విపరీతంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   26 Nov 2025 9:33 AM IST
సీఎం కుర్చీ అవుట్  ఆఫ్  స్టాక్... నవంబర్  విప్లవం పై బీజేపీ ఏఐ సెటైర్లు!
X

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ పోరు నడుస్తుందనే చర్చ రాజకీయా వర్గాల్లో విపరీతంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉప ముఖమంత్రి డీకే శివకుమార్ పై బీజేపీ కొత్త విమర్శలకు దిగింది. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వాడుకుంటూ మరీ సెటైర్లు వేస్తోంది. ఆయన ఆన్ లైన్ లో సీఎం కుర్చీ కొనడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. వీడియో వైరల్ గా మారింది.

అవును... సీఎం సిద్ధరామయ్యతో అధికార భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని.. ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు అంగీకారం తెలిపారని పుకార్లు షికార్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో సీఎం సీటు కోసం శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. ఆయన ఆన్ లైన్ లో సీఎం కుర్చీ కొనుగోలు చేస్తుండగా.. స్టాక్ అయిపోయినట్లు చూపించే ఏఐ క్లిప్ ను బీజేపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే! ఆ తర్వాత అధిష్టాణం.. శివకుమార్ ను ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పంచింది. ఆ సమయంలో... సిద్ధరామయ్యతో శివకుమార్ కు అధికార భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని, ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు సీఎం కుర్చీలో కూర్చునేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరిగింది.

కట్ చేస్తే... ఈ నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తి చేసుకొంది. దీంతో.. నాయకత్వంలో మార్పు వస్తుందనే ప్రచారం విపరీతంగా జరిగింది. ఈ పరిణామాన్నే కొంతమంది "నవంబర్ విప్లవం"గా పిలుస్తారు. ఈ ప్రచారంపై ఇటీవల స్పందించిన సిద్ధరామయ్య... కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయానికి లోబడి తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలిపారు. ఇది డీకే వర్గానికి ఏమాత్రం సహించలేదని చెబుతారు.

ఈ నేపథ్యంలోనే కర్ణాటక బీజేపీ డీకే శివకుమార్ ను టార్గెట్ చేస్తూ ర్యాగింగ్ చేస్తోంది. ఇదే సమయంలో సిద్దరామయ్యపైనా దాడిని ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన సెటైర్ల కోసం ఏఐ టెక్నాలజీని వాడుతూ మరీ క్రియేటివిటీకి పని చెబుతోంది! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది!

స్పందించిన శివకుమార్!:

ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. ఇందులో భాగంగా... తనను ముఖ్యమంత్రి చేయమని తాను అడగలేదని.. ఇది తమలో ఐదారుగురు వ్యక్తుల మధ్య జరిగిన రహస్య ఒప్పందం అని.. దీనిపై తాను బహిరంగంగా మాట్లాడాలనుకోవడం లేదని అన్నారు. ఇదే సమయంలో తాను మనస్సాక్షిని నమ్ముతానని.. పార్టీకి ఏ విధంగానూ ఇబ్బంది కలిగించాలని, బలహీన పరచాలని తాను కోరుకోనని.. పార్టీ ఉంటేనే తాము ఉంటామని తెలిపారు.