మూడు గంటల్లో మూడు జిల్లాలు: చంద్రబాబు సుడిగాలి పర్యటన
అటు నుంచినేరుగా కోనసీమ జిల్లాకు వెళ్లారు. అయితే.. ఇక్కడ ఏరియల్ సర్వే అనంతరం.. కలెక్టర్ ఆఫీసుకు వెళ్లేందుకు కాన్వాయ్ రెడీ అయినా.. కొంత ఇబ్బంది ఏర్పడింది.
By: Garuda Media | 29 Oct 2025 7:05 PM ISTఏపీని వణికించిన మొంథా తుఫాను విషయంలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు.. ఈ తుఫాను తీరం దాటిన వెంటనే ఆయన ఆయా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మూడు గంటల్లో మూడు జిల్లాలను ఆయన చుట్టి వచ్చారు. దీనికి గాను.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సేవల కోసం పంపించిన చేతక్ హెలికాప్టర్‌ను వినియోగించుకున్నారు. విపత్తుల సమయంలోనూ ఈ హెలికాప్టర్ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు.. కొంత మేరకు ప్రతికూల వాతావరణం ఉన్నా.. ఈ హెలికాప్టర్ సహకరిస్తుంది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. తుఫాను మిగిల్సిన నష్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. సహాయక చర్యలకు కూడా ఆదేశించారు. తొలుత ఉండవల్లి నుంచి బాపట్లకు చేరుకున్న ఆయన.. దెబ్బతిన్న పంటపొలాలు, ఇళ్లు, గ్రామాలను పరిశీలించారు. అనంతరం.. కలెక్టర్ ఆఫీసులో నిర్వహించిన సమీక్షలోనూ పాల్గొన్నారు. బాధితులను ఆదుకుంటామనిభరోసా ఇచ్చారు. ఇక, అక్కడి నుంచి కృష్ణా జిల్లాకు వచ్చారు. ఇక్కడ కూడా దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
అటు నుంచినేరుగా కోనసీమ జిల్లాకు వెళ్లారు. అయితే.. ఇక్కడ ఏరియల్ సర్వే అనంతరం.. కలెక్టర్ ఆఫీసుకు వెళ్లేందుకు కాన్వాయ్ రెడీ అయినా.. కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆయన ఓ కార్యకర్తకు చెందిన ఇన్నోవా కారులో ప్రయాణించి.. బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వారితో నేరుగా మాట్లాడారు. బాధలు సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా మత్య్సకారుల సమస్యలు విన్నారు. వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇలా.. మూడు గంటల్లో ఏరియల్ సర్వేతో పాటు.. కలెక్టర్ల కార్యాలయాల్లో సమీక్షలు.. చేయడం పునరావాస కేంద్రాల్లో ని బాధితులకు ఓదార్పు ఇవ్వడం గమనార్హం.
సీఎం ప్రకటించిన సాయం ఇదే..
+ పునరావాస కేంద్రాల్లోని బాధితులకు రూ.1000 నుంచి రూ.3000 వరకు గరిష్ఠంగా సాయం.
+ ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, గోధుమలు 3 కిలోలు.. నిత్యావసరాలు పంపిణీ.
+ దెబ్బతిన్న రహదారులను 48 గంటల్లో పునరుద్ధరించడం.
+ పంటల నష్టం అంచనాకు మూడు రోజుల సమయం
+ వెంటనే కేంద్రానికి లేఖ.. సాయం రాగానే.. రైతులకు అందజేత.
