మెడికల్ కాలేజీకి మీనింగ్ తెలుసా?: జగన్‌పై చంద్రబాబు ఫైర్
ఏపీ మాజీ సీఎం జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారం చేస్తూ.. ఫేక్ రాజ కీయాలకు తెరదీశారని వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 10 Sept 2025 4:41 PM ISTఏపీ మాజీ సీఎం జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారం చేస్తూ.. ఫేక్ రాజ కీయాలకు తెరదీశారని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ అంటే మీనింగ్ తెలియని, స్పెల్లింగ్ తెలియని జగన్.. తామేదో రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు.. తానేదో ఉద్ధరించినట్టు కబుర్లు చెబుతున్నాడని మండి పడ్డారు. మెడికల్ కాలేజీ అంటే.. కేవలం భూములు ఇచ్చి చేతులు ముడుచుకుని కూర్చోవడమా? అని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. అక్కడ చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాజాగా అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలకు నిధులులేకపోయినా.. అనేక ఇబ్బందులు పడైనా వాటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు.. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామన్నారు. ఉచితంగా వంటగ్యాస్ ఇస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద రైతులను ఆదుకుంటున్నామన్నారు.
అదేసమయంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గత పాలకుడు ఏనాడైనా.. అభివృద్ది గురించి ఎవరితోనైనా చర్చించాడా? అని ప్రశ్నించారు. సంక్షేమం అంటే.. కేవలం డబ్బులు ఇచ్చి వదిలేయడం కాదని.. ప్రజలకు అన్ని వేళలా అండగా ఉండడం కూడా సంక్షేమమేనని చెప్పారు. అందుకే.. ప్రస్తుతం నేపాల్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు.. ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
ఈ బాధ్యతలను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించామని సీఎం తెలిపారు. ప్రజలకు ఏకష్టం వచ్చినా.. ముందుండే వాడే నాయకుడని గుర్తు చేశారు. వరదలు వచ్చినప్పుడు తాను స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సంక్షేమం అంటే.. ఓట్ల కోసం చేసే రాజకీయం కాదని పేర్కొంటూ.. గత వైసీపీ పాలనను ఎద్దేవా చేశారు. తమకు 164 సీట్లు 57 శాతం ఓట్లు ఇచ్చిన ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పారు.
