2029 ఎన్నికలకు చంద్రబాబు టార్గెట్ ఫిక్స్.. పక్కాగా పొలిటికల్ గవర్నెన్స్!!
పొలిటికల్ గవర్నెన్స్ లో పార్లమెంటు కమిటీలు కీలకమని ఆ నియోజకవర్గం పరిధిలో చేపట్టే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా కమిటీల అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
By: Tupaki Political Desk | 28 Jan 2026 3:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ రియల్ టైమ్ గవర్నెన్స్.. ఈ-గవర్నెన్స్ అంటూ టెక్నాలజీ మాటలు చెప్పే సీఎం చంద్రబాబు తొలిసారిగా వినూత్నంగా మాట్లాడారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ పక్కాగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా మాట్లాడటం చూసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీని భాగస్వామ్యం చేయడంలో చంద్రబాబు ఇందుకు పూర్తి భిన్నవైఖరిని ప్రదర్శించేవారని అంటున్నారు. ఎక్కువగా బ్యూరోక్రాట్లపై ఆధారపడే చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో మాత్రం 2029 ఎన్నికల టార్గెట్ గా రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ పక్కాగా అమలు కావాలని సూచించారు.
డబ్బులతోనే రాజకీయం చేయలేమని చెప్పిన చంద్రబాబు.. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ‘‘డబ్బుతోనే అన్నీ నడుస్తాయనుకుంటే ధనవంతులే రాజకీయం చేస్తారు. మనలాంటి వాళ్లు చేయలేరు’’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పసుపు జెండా కోసం రక్తం చిందించారు. అనేక త్యాగాలు చేశారు. అందుకే పార్టీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. సమర్థ నాయకులు తయారు కావడానికి టీడీపీ ఒక వేదిక అంటూ సీఎం చెప్పారు.
ఈ సందర్భంగా పొలిటికల్ గవర్నెన్స్ పై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ లో పార్లమెంటు కమిటీలు కీలకమని ఆ నియోజకవర్గం పరిధిలో చేపట్టే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా కమిటీల అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈ కమిటీలు మిత్రపక్షాలు జనసేన, బీజేపీతోనూ సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షుడు ఆ జిల్లా ఇంచార్జి మంత్రితో సమానమని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి పనిచేయాలని ఆదేశించారు. అప్పుడే పొలిటికల్ గవర్నెన్స్ లక్ష్యం సిద్ధిస్తుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు కమిటీల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటానని సీఎం స్పష్టం చేశారు. పదవులు తీసుకున్న వారు సరిగా పనిచేయకపోతే పక్కన పెడతాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి అధ్యయనం చేస్తాం. మరింత సమర్థంగా పనిచేసేలా రోజురోజుకు మెరుగుపడాలి. అందుకే యువతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చామంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో 80 శాతం మంది కొత్తవారు, చదువుకున్న వారికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని వివరించారు. దేశంలో యంగ్ పార్లమెంటరీ పార్టీగా టీడీపీ ఉందని గుర్తు చేశారు.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికలపై సీఎం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో, 2029లో అంతకు 10 ఓట్లు అదనంగా రావాలని లక్ష్యం నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 ఎన్నికల కంటే కూటమి మరింత బలపడిందని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగినప్పుడే ప్రజల వద్దకు వెళతామంటే సరికాదు, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు వారితో మమేకం అవ్వాలంటూ సూచించారు. వచ్చిన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత నాయకత్వం, శ్రేణులపై ఉంది. నాయకులు ఎవరూ కేడర్ ను విస్మరించకూడదు. ఎవరికి కేటాయించిన పదవుల్లో వారే పనిచేయాలి. కావాలని ఎక్కడైనా వివాదాలు సృష్టిస్తే పక్కనపెడతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
