రూములు లేవు...షేర్ చేసుకోవడమే...పండుగ బ్యూటీ !
సంక్రాంతి పండుగకు క్రమం తప్పకుండా అంతా సొంత ఊళ్ళకు వెళ్ళాలని కోరారు మూలాలు మరచిపోరాదు అని హితవు పలికారు, మన వూరిలో మనతో పాటే ఎంతో మంది ఉన్నారు.
By: Satya P | 15 Jan 2026 10:21 PM ISTపండుగ అంటే ఏమిటో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్రాంతి పండుగకు క్రమం తప్పకుండా అంతా సొంత ఊళ్ళకు వెళ్ళాలని కోరారు మూలాలు మరచిపోరాదు అని హితవు పలికారు, మన వూరిలో మనతో పాటే ఎంతో మంది ఉన్నారు. అయితే అందరూ పైకి రాలేకపోవచ్చు, చాలా మంది ఇబ్బంది పడవచ్చు. అలాంటి వారికి మనం ఏడాదికి ఒకసారి అయినా ఊరికి వెళ్తే మనల్ని చూస్తే ఒక భరోసాగా ఉంటుంది, వీలైతే సాయం చేస్తే వారిని కూడా ముందుకు తీసుకుని వస్తే అది ఇంకా మంచిది అంటూ బాబు చెప్పారు.
నారావారి పల్లెలో సందడి :
ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఏళ్ళుగా తన సొంత ఊరు నారావారి పల్లెకు వెళ్తున్నారు. ఆయన అక్కడ తన వారిని బంధువులను స్నేహితులను పలకరిస్తూ వారి మంచి చెడ్డలు తెలుసుకుంటూ వీలైనంత మేరకు అధికార హోదాలో వ్యక్తిగత హోదాలో మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా తమ పెద్దలకు నివాళి అర్పించిన అనంతరం చంద్రబాబు నారావారిపల్లెలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టత గురించి చెప్పారు.
హాయిగా ఆనందంగా :
సొంతూరికి వస్తే ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రూములు సరిపోవు, అంతా కలసి ఉండాలి. షేర్ చేసుకోవాలి, అందులోనే ఆనందం ఉంది అని బాబు చెప్పుకొచ్చారు. నిరంతరం పని ఒత్తిడితో ఉన్న వారికి అవసరమైన ఎనెర్జీ సొంత ఊరిలోనే దొరుకుతుంది అని అన్నారు. కావాల్సినంత ఫన్ కూడా దొరుకుతుందని అన్నారు. పండుగ అంటే అంతా కలసి మెలసి ఉండడమే అని చెబుతూ ఆ ఆనందం వేరు అని చెప్పారు.
మన సంస్కృతి లో భాగం :
ఇక భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలను తప్పనిసరిగా జరుపుకుని భావితరాలకు పండుగల గొప్పతనాన్ని తెలియజేయాలని చంద్రబాబు అన్నారు. తాను మూడు రోజుల పాటు సంక్రాంతి, భోగి పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడుపుతున్నట్లుగా ఆయన చెప్పడం విశేషం.
వెల్తీ హెల్తీ సొసైటీ :
సమాజంలో అంతా సంపదతో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలన్నదే తన నినాదం అన్నారు. దాని కోసమే ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పీ 4 కూడా అందుకో భాగం అని అన్నారు. పేదలను సాటి వారు ఆదుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు 10 లక్షల కుటుంబాలను పి4 విధానంతో దత్తత తీసుకున్నట్లు తెలిపారు. వారి జీవితాలలో కొత్త వెలుగుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
భూ సమస్యలు లేకుండా :
ఇదిలా ఉంటే 2027 సంవత్సరానికి రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పారు. అదే విధంగా విశాఖ, విజయవాడ, తిరుపతిలను మెగాసిటీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. 2026 సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వ ఆసుపత్రులలో సంజీవిని ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని బాబు చెప్పారు. 2047 సంవత్సరానికి దేశాన్ని వికసిత్ భారత్ వైపు రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని ఈ విషయంలో అందరి భాగస్వామ్యం తీసుకుంటున్నామని అన్నారు.
