లేడీ డాన్స్.. తోకలు కత్తిరిస్తాం: చంద్రబాబు
తాజాగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. లేడీ డాన్ల వ్యవహారంపై స్పందించారు. వైసీపీ హయాంలోనే లేడీ డాన్లు.. పుట్టుకొచ్చారని, విచ్చలవిడిగా.. కొందరు రాజకీయాలు చేశారని, ఇలాంటి వారిని పెంచి పోషించారని అన్నారు.
By: Garuda Media | 6 Dec 2025 10:30 PM ISTరాష్ట్రంలో మహిళలకు ఏ ప్రభుత్వమూ ఇవ్వనంత గౌరవం ఇస్తున్నామని.. సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే.. కొందరు మహిళల కారణంగా మిగిలిన వారు సమాజంలో తలెత్తుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. `లేడీ డాన్` అంటూ.. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను చూశానని.. దీనిపై వెంటనే పోలీసులతోనూ మాట్లాడినట్టు చంద్రబాబు తెలిపారు. అయితే.. తాను ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఎవరైనా పద్ధతిగా ఉండాల్సిందేనని.. తేడా వస్తే.. తోకలు కత్తిరిస్తానని హెచ్చరించారు.
ఇటీవల నెల్లూరుకు చెందిన లేడీ డాన్ కామాక్షి ఇంట్లో 25 కిలోలకు పైగా గంజాయి పట్టుబడడం.. ఓ పార్టీ నాయకుడి హత్యకు పురిగొల్పడం.. వంటివి సంచలనం సృష్టించాయి. ఈ అంశాలపై స్పందించిన చంద్రబాబు వెంటనే చర్యలకు ఆదేశించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే కోర్టుకు.. అటు నుంచి జైలుకు కూడా తరలించారు. ఈమెతో పాటు.. విజయవాడ, తెనాలిలోనూ ఇద్దరు మహిళలు ఇదే తరహాలో దందాలు చేస్తూ.. ప్రజలను ఇబ్బంది పెట్టడంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కొందరికి డ్రగ్స్‌తోనూ సంబంధాలు ఉండడంతో వారిపైనా కేసులు పెట్టారు.
తాజాగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. లేడీ డాన్ల వ్యవహారంపై స్పందించారు. వైసీపీ హయాంలోనే లేడీ డాన్లు.. పుట్టుకొచ్చారని, విచ్చలవిడిగా.. కొందరు రాజకీయాలు చేశారని, ఇలాంటి వారిని పెంచి పోషించారని అన్నారు. నెల్లూరు జిల్లా ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేదని.. వైసీపీ వచ్చిన తర్వాత.. ఇక్కడ అరాచకాలు పెరిగాయని తెలిపారు. ``లేడీడాన్స్ తయారవటం చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ప్రసక్తే లేదు`` అని చెప్పారు. మహిళలకు తమ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇస్తుందని తెలిపారు. కానీ.. తప్పులు చేస్తే.. ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. వీరి వెనుక ఎవరు ఉన్నా.. వారిని కూడా వదిలి పెట్టబోమని.. పరోక్షంగా వైసీపీ నాయకులను కూడా చంద్రబాబు హెచ్చరించారు.
