ఒకాయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు....బాబు మార్క్ వెటకారం
మాజీ సీఎం వైఎస్ జగన్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు వెటకారం రంగరించి మరీ చేసిన కామెంట్స్ జనాల్లో నవ్వులు పుట్టించాయి.
By: Satya P | 30 March 2026 11:06 PM ISTమాజీ సీఎం వైఎస్ జగన్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు వెటకారం రంగరించి మరీ చేసిన కామెంట్స్ జనాల్లో నవ్వులు పుట్టించాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో చంద్రబాబు టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు గృహ ప్రవేశం చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బాబు మాట్లాడుతూ జగన్ మీద పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి జనాలకు వివరించే క్రమంలో ఆయన వేసిన సెటైర్లు సభలో నవ్వులు పూయించాయి.
ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలే :
ఏపీలో ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అన్నది నిర్ణయించేది ప్రజలే అని చంద్రబాబు అన్నారు. మీరంతా ఓటేసి మాకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలే కానీ తాను కాదని బాబు చెప్పారు. కానీ ఒకాయన ప్రతిపక్ష హోదా ఇమ్మని నన్ను అడుగుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అయితే విషయం ఏమిటన్నది ఆయనకు అర్థం కావటం లేదని బాబు అన్నారు. నిజానికి ప్రజలు ఓటు వేయకపోతే ఎవరూ ఎమ్మెల్యే కూడా కాలేరన్నది తెలుసుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు.
ప్రజలకు మేలు చేయాలి :
ఇక రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు వీలైనంత వరకూ ప్రజలకు మేలు చేయాలని బాబు సూచించారు. అంతే తప్ప రాష్ట్రాన్ని విధ్వంసం చేయకూడదని అన్నారు. అలాంటి వారిని ప్రజలు కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక 2028 నాటికి తన రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తి అవుతున్నాయని బాబు చెప్పారు. ఇప్పటిదాకా తన మీద ఎలాంటి ఆరోపణలు లేవని అన్నారు. అయితే తన లాంటి వారి మీద అనేక విధాలుగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని బాబు చెప్పారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్నది కూడా అంతా ఆలోచన చేయాలని అన్నారు. అంతే కాదు సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టి ఆడబిడ్డలను రోడ్లపైకి లాగుతున్నారని బాబు ఫైర్ అయ్యారు.
సీఎం పనితీరుతో :
ఎక్కడైనా సీఎం బాగా పనిచేస్తేనే రాష్ట్రం బాగుంటుందని బాబు అన్నారు. కానీ గత వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా ఏపీ మారిందని బాబు విమర్శించారు. అలాగే ఇప్పటి వరకూ గత పాలకులు మూడు ముక్కలాటతో రాజధానిని ముక్కలు చేశారని బాబు నిందించారు. అందుకే అమరావతికి చట్టబద్దత కల్పించేలా కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో పాటు సమర్ధవంతమైన పాలన ఇవ్వాలనే అనునిత్యం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు వచ్చేలా వ్యవస్థను గాడిలో పెట్టామని అన్నారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పాలనను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
సంక్షేమంతో బెస్ట్ :
దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్ తో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. పధకాల అమలులో ఉద్యోగులు ఎలా వ్యవహరిస్తున్నారో కూడా ఎప్పటికపుడు తనిఖీ చేస్తున్నామని చెప్పారు. అలాగే 2029 నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని బాబు చెప్పారు. అలాగే, రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు పైపు ద్వారా నీళ్లు వచ్చినట్టే గ్యాస్ కూడా వస్తుందని, అలా పైప్డ్ గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని బాబు తెలిపారు. అలాగే ప్రతీ ఇంటికి సౌర ఫలకాలు పెట్టుకుంటే ఉచిత విద్యుత్ వస్తుందని, దానిని పంపుసెట్ కు కూడా బిగించుకుంటే విద్యుత్ అంతా ఉచితంగా వస్తుందని బాబు చెప్పారు.
సంపద సృష్టి తో :
ఇక గత వైసీపీ పాలన కారణంగా ఆర్దిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయిందని బాబు జనాలకు వివరించారు. ఆఖరుకి ప్రభుత్వ ఆస్తులు సైతం తాకట్టు పెట్టారని అన్నారు. ఫలితంగా ఏపీకి అప్పుల భారం ఎక్కువ అవుతున్నా వాటిని తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు అంతే కాకుండా అనునిత్యం సంపద సృష్టి కోసమే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సమర్థవంతమైన నిర్వహణతో సంక్షేమం అభివృద్ధిని సమతూకంగా చేపడుతున్నామని అన్నారు.
