Begin typing your search above and press return to search.

ఏపీకి నెంబర్ వన్.... అదొక డిఫరెంట్ స్టోరీ

అదేంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ రోజూ ఏపీ అగ్రగామిగా అన్ని రంగాలలో ఉండాలని కోరుతారు కదా.

By:  Satya P   |   23 Sept 2025 7:13 PM IST
ఏపీకి నెంబర్ వన్.... అదొక డిఫరెంట్ స్టోరీ
X

అదేంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ రోజూ ఏపీ అగ్రగామిగా అన్ని రంగాలలో ఉండాలని కోరుతారు కదా. దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని చెబుతారు కదా ఏపీ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉండాలని కూడా గట్టిగా కోరుతూంటారు కదా మరి అదేంటి ఏపీ నంబర్ వన్ అంటే నో చెప్పేస్తున్నారు అనుకోవచ్చు, పొర పడవచ్చు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడూ ఏపీ నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించే నాయకుడే. అయితే అదే సమయంలో ఆయన ఏపీని ఇబ్బంది పెట్టే అంశాలలో రాష్ట్రం జీరో ర్యాంక్ లోనే ఉండాలని కోరుకుంటారు. ప్రజా కోణం లో నుంచి చూసి ఆలోచించే నాయకుల తీరు అలాగే ఉంటుంది. అందుకే నిండు సభలో బాబు ఏపీకి నెంబర్ వన్ ప్లేసా వద్దే వద్దు అని అంటున్నారు. ఇంతకీ ఏపీకి దేంటో నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది, ఏమిటి ఆ కధ అంటే అదొక డిఫరెంట్ స్టోరీ. తెలుసుకోవాల్సిందే :

హెల్త్ ఏపీ టార్గెట్ :

ఏపీ అసెంబ్లీలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మీద జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం మీద పెడుతున్న శ్రద్ధ గురించి సర్కార్ తీసుకుంటున్న చర్యల గురించి సవివరంగా తెలియచేశారు. అదే సమయంలో ఆయన కొన్ని విషయాలలోమాత్రం ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. వాటి తీరు మారాలన్నది ఆయన ఆలోచనా విధానంగా అదే సర్కార్ లక్ష్యంగా కూడా చెప్పుకొచ్చారు.

మెరుగైన తీరులోనే :

ఇక ఏపీ ఆరోగ్య సంరక్షణ కానీ ప్రమాణాలు కానీ చూసుకుంతే కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే మెరుగ్గా ఏపీలో ఆరోగ్య మౌలిక వసతుల కల్పన ఉందని బాబు వివరించారు. ఇక ఏపీలో మొత్తంగా ఒక లక్షా 15 వేల ,499 మంది డాక్టర్లు అలాగే, 70 వేల 43 మంది నర్సులు ఉన్నారని తెలిపారు. ఇక దేశంలో చూస్తే కనుక పౌరుల సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉందని బాబు చెప్పారు. అదే విధంగా ఏపీ వ్యాప్తంగా 78 శాతం డిజిటల్ హెల్త్ రికార్డులు చేశామని, త్వరలో హెల్త్ రికార్డులను 100 శాతం డిజిటలైజ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు.

సీజేరియన్ కాన్పులలో నెంబర్ వన్ :

అదన్న మాట మ్యాటర్. బాబు వద్దు అన్నది కూడా ఇదే. దేశంలో చూసుకుంటే కనుక ఏపీ సిజేరియన్ కాన్పులలో నంబర్ వన్ గా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. ఇది చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఏపీలో చూసుకుంటే ఇటీవల కాలంలో డాక్టర్లు సిజేరియన్ కాన్పులు ఎక్కువగా చేస్తున్నారని బాబు అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో పది శాతం జరుగుతూంటే తొంబై శాతం పైగా సిజేరియన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని ఆయన డేటా చెప్పారు.

అనవసరంగా ఆపరేషన్లు ఏమిటి :

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిండు సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఆయన ఆవేదన మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కూడా వ్యక్తం అయింది. భగవంతుడు ఇచ్చిన శరీరానికి అనవసరంగా ఆపరేషన్లు చేయడం సరికాదని బాబు స్పష్టం చేశారు. తేదీలు చెప్పి మరీ సిజేరియన్లు చేస్తున్నారని బాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ముహుర్తాలు పెట్టుకుని సీజేరియన్ ఆపరేషన్లు చేసే పరిస్థితి వచ్చిందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఏపీ వ్యాప్తంగా సీజేరియన్ ఆపరేషన్లను తగ్గించేలా చూడాలని వైద్యారోగ్య శాఖ మంత్రిని ఆయన కోరారు.

అంతే కాదు సీజేరియన్ ఆపరేషన్ల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులతో మాట్లాడతామని, అవసరమైతేనే ఆపరేషన్లు చేయాలని స్పష్టంగా చెబుతామని కూడా బాబు చెప్పడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ నుంచి ముఖ్యమంత్రి ఒక కీలకమైన కచ్చితమైన సందేశాన్ని కూడా ఏపీలోని వైద్యులకు పంపించారు. సాధారణ కాన్పులు జరిగేలా డాక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఇక మీదట అదే అందరి విధానం కావాలని పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలను విని ప్రభుత్వం ఆవేదనను అర్ధం చేసుకుని ఏపీలో సిజేరియన్ కాన్పుల విషయంలో అంతా వెనకడుగు వేయాలని కోరుతున్నారు. ఈ తరహా ఆపరేషన్లను జీరో నెంబర్ కి తీసుకుని వస్తే సంతోషం, లేదా పరిమితం చేసినా మంచిదే అని అంటున్నారు.