వైరల్ తుఫాన్ సృష్టించిన సీజేపీ.. 10 గంటల్లో 12 కోట్ల వ్యూస్ షాక్!
ఇంతటి ఆదరణ పొందుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతుందా అనే ప్రశ్నపై సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా ఆసక్తికరంగా స్పందించారు.
By: Madhu Reddy | 26 July 2026 2:51 PM ISTనీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పోరాటం చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉద్యమానికి సంబంధించిన ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన కేవలం 10 గంటల్లోనే ఏకంగా 12 కోట్ల (120 మిలియన్లు) వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆ వీడియోలో ఏముంది? వైరల్ అయింది ఎలా?:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే వార్త సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఫోన్‌లో అందిన క్షణాలను ఈ వీడియోలో చిత్రీకరించారు. ఇక ఆ నిమిషంలో వారి స్పందన, ఎమోషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆలోచనలో పడేసిన ఈ ఉద్యమం క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత రేంజ్‌లో ఉందో ఈ వ్యూస్ సునామీ నిరూపించింది.
2.2 కోట్ల ఫాలోవర్లు.. యువతలో విపరీతమైన ఆదరణ:
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా మొదలైన ఈ విద్యార్థి ఉద్యమం చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా వ్యాపించింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి ఇప్పటికే దాదాపు 2.2 కోట్ల (22 మిలియన్లు) మంది ఫాలోవర్లు రావడం విశేషం. ఇక ముఖ్యంగా యువత, విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రధాన వేదికగా మార్చుకున్నారు.
సోషల్ మీడియా పవర్.. విశ్లేషకుల అభిప్రాయం:
ఈ రేంజ్ వ్యూస్, లైక్స్ చూస్తుంటే భారత రాజకీయాల్లో, ప్రజా ఉద్యమాల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, డిజిటల్ మీడియాలో వచ్చే వ్యూస్ ప్రతిసారీ ఓట్లుగా లేదా పూర్తిస్థాయి రాజకీయ మద్దతుగా మారకపోవచ్చు, కానీ ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఆలోచన రేకెత్తించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని విశ్లేషిస్తున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?:
ఇంతటి ఆదరణ పొందుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతుందా అనే ప్రశ్నపై సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా ఆసక్తికరంగా స్పందించారు. ఇక "భారత్‌లో దేనికీ 'నో' అని చెప్పలేం.. అయితే ప్రస్తుతం మా ఫోకస్ అంతా ఈ విద్యార్థి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి బాధితులకు న్యాయం జరిపించడంపైనే ఉంది" అని ఆయన స్పష్టం చేశారు.
డిజిటల్ యుగంలో విద్యార్థి శక్తి:
ఈ ఘటన సోషల్ మీడియా శక్తీ ఏంటో మరోసారి నిరూపించింది. సరైన విషయం మీద యువత కలిసివస్తే, పెద్ద రికార్డుల్నైనా సులభంగా మార్చగలరని సీజేపీ వ్యూస్ గ్రాఫ్ చెబుతోంది. రాబోయే రోజుల్లో ఈ సీజేపీ ఉద్యమం ఎలా మారుతుందో, డిజిటల్‌గా మొదలైన ఈ పోరాటం ఏ ఫలితాలు ఇస్తుందో చూడాలి.
