Begin typing your search above and press return to search.

సీజేపీకి బలమైన పునాదిగా సోనమ్ వాంగ్‌చుక్ !

ఇక పోతే ఇప్పటికి 15 ఏళ్ళ క్రితం 2011లో ఢిల్లీలో సామాజిక కార్యకర్త అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఆయన కూడా అమరణ దీక్షనే తన అస్త్రంగా ఎంచుకున్నారు.

By:  Satya P   |   17 July 2026 4:23 AM IST
సీజేపీకి బలమైన పునాదిగా సోనమ్ వాంగ్‌చుక్ !
X

సోషల్ మీడియాలో మే 16న పుట్టిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. రెండు నెలలు తిరగకుండానే అదిపుడు దేశంలో చర్చకు తావిస్తోంది. ఈ మధ్యలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అనేక ఆందోళనలు దేశంలో చేపట్టారు. నీట్ పరీక్షలలో లీకేజ్ మీద మండిపడిన సీజేపీ తన ఆందోళనలను కొనసాగిస్తూ వస్తోంది. అంతే కాదు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. సీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఇపుడు అమరణ దీఖ చేపట్టారు. ఆయన దీక్షా సమరంతో జాతీయ స్థాయిలో సీజేపీ కూడా చర్చకు వస్తోంది. విపక్షాలు సైతం ఈ దీక్షకు సపోర్టు ఇస్తున్నారు.

దీక్షలో సోనమ్ వాంగ్‌చుక్ :

ఇక ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జూన్ 28న ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. కేంద్ర మంత్రి రాజీనామా తో పాటు లడఖ్ ప్రాంతానికి రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించాలని, కూడా మరో డిమాండ్ పెట్టి మరీ ఆయన దీక్ష చేపట్టారు. ఇక చూస్తే గడచిన 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన కిలోలకు పైగా బరువు తగ్గారని రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడంతో పాటు తీవ్రమైన బలహీనత కండరాల క్షీణత ఏర్పడిందని ఆయనను పరీక్షించిన వైద్యులు తెలిపారు.

వెనక్కి తగ్గేది లేదంటూ :

ఇదిలా ఉంటే సోనమ్ వాంగ్‌చుక్ తన ఆరోగ్యం విషమిస్తున్నప్పటికీ తన డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను దీక్ష విరమించాలని రాజకీయ నాయకులు, మద్దతుదారులు కోరినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. తనను దీక్ష విరమించాలని కోరే బదులు ప్రభుత్వాన్ని తన డిమాండ్లు పరిష్కరించాలని కోరాలని ఆయన సూచించారు. అంతే కాదు తాను మధ్యలో దీక్ష విరమిస్తే ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం పోతుందని అన్నారు. దీక్ష విరమణ ఏ రకమైన సందేశాన్ని పంపిస్తుందని కూడా ఆయన ప్రశ్నించారు.

అనాటి హజారే మాదిరిగా :

ఇక పోతే ఇప్పటికి 15 ఏళ్ళ క్రితం 2011లో ఢిల్లీలో సామాజిక కార్యకర్త అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఆయన కూడా అమరణ దీక్షనే తన అస్త్రంగా ఎంచుకున్నారు. అవినీతి మీద ఆయన సమర శంఖం పూరించారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి అన్నా హజారే దీక్ష వల్ల ఏర్పడిన వ్యతిరేకత ఎన్డీయేకు తరువాత కాలంలో కలసి వచ్చింది. మరి ఇపుడు సోనమ్ వాంగ్‌చుక్ కూడా అదే బాట ఎంచుకున్నారు. అంతే కాదు ఆయన కేంద్రానికి కొన్ని డిమాండ్లు పెట్టి మరీ సాధించాలని చూస్తున్నారు. దాంతో సోనమ్ వాంగ్‌చుక్ ని దీక్షా శిబిరంలో పరామర్శించిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కేంద్రం ఇప్పటికైనా సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్లు ఆమోదించాలని కోరారు. లేకపోతే 2014 నాటి పరిస్థితులే ఎన్డీయేకు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ జోస్యం చూస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలు అవుతుందని ఆయన చెప్పారని అంటున్నారు.

సీజేపీకి కొండంత అండ :

నిజానికి సీజేపీ అన్నది గాలివాటుగా ఏర్పడిన ఒక వాట్సప్ పార్టీ అని అంతా అనుకున్నారు. అయితే మొదటి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ సేజేపీకి మద్దతుగా నిలిచారు. ఇపుడు ఆయన తన దీక్షతో కొండంత అండగా మారుతున్నారు. అంతే కాదు సీజేపీకి సిద్ధాంతపరంగా ఒక బలమైన పునాదిని కూడా వేస్తున్నారు. మరి సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఏ మలుపు తిరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది అతి పెద్ద అంశంగా మారి పార్లమెంట్ ని కుదిపేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.