నీట్ సరే.. పంజాబ్ సంగతేంటి? సీజేపీ ప్రతినిధులకు షాక్ ఇచ్చిన మీడియా
పంజాబ్ లీకులపై ఎదురైన ప్రశ్నకు సీజేపీ నేతల నుంచి సరైన సమాధానం లభించకపోవడంపై నెట్టింట హాట్ డిబేట్ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 26 July 2026 12:27 PM ISTనీట్ పేపరు లీక్ ఘటనపై ఉద్యమించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన పేపరు లీక్ ఘటనలను కూడా పట్టించుకుంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీట్ పేపరు లీకు విషయంలో బాధ్యత వహిస్తూ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టి, ఆయన రాజీనామా చేసేవరకు విశ్రమించకుండా పోరాడిన సీజేపీ ప్రతినిధులు ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ఇదే ప్రశ్న ఎదుర్కొంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకులపై ఆందోళనలు చేస్తారా? దీనిపై సీజేపీ ప్రణాళికలు ఏంటి అంటూ మీడియా ప్రశ్నిస్తోంది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్‌లను పలువురు జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే దీనిపై ఎలాంటి సమాధానం చెప్పని సీజేపీ నేతలు కారు అద్దాలు మూసేసి వెళ్లిపోవడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దేశ రాజధానిలో చేపట్టిన ఆందోళనతో టాక్ ఆఫ్ ద నేషన్ గా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న పేపర్ లీక్‌ల పైనా ఇదే రీతిలో నిరసనలు చేపడతారా? ముఖ్యంగా పంజాబ్‌లో పేపర్ లీక్ ఉదంతాలపై ఆందోళన చేస్తారా? అనే ప్రశ్న విస్తృత చర్చకు దారితీస్తోంది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఉండటం, కాక్రోచ్ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ సలహాదారు అభిజిత్ దీప్కే నేతృత్వం వహించడంతో పంజాబ్ రాష్ట్రంలోని పేపరు లీకు సంఘటనపై ఎందుకు ప్రశ్నించడం లేదన్న చర్చకు ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు.
పంజాబ్ లీకులపై ఎదురైన ప్రశ్నకు సీజేపీ నేతల నుంచి సరైన సమాధానం లభించకపోవడంపై నెట్టింట హాట్ డిబేట్ జరుగుతోంది. "ఢిల్లీలో ఒక న్యాయం.. ఇతర రాష్ట్రాల్లో మరో న్యాయమా? పంజాబ్ యువత సమస్యలపై వీరు ఎందుకు నోరు మెదపడం లేదు?" అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురుకావడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 30 ఏళ్లలోపు వయసు ఉన్న ఈ ఇద్దరు ఎంతో సమయస్పూర్తితో కేంద్రంతో చర్చలు సాగించి విజయం సాధించారు.
అయితే, జాతీయ స్థాయిలో విద్యారంగంలో సంస్కరణలే లక్ష్యంగా తాము పోరాడుతున్నామని చెబుతున్న ఈ నేతలు, ప్రాంతీయంగా వెలుగుచూస్తున్న పేపర్ లీక్ అంశాలపై మాత్రం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కొన్ని ప్రాంతాలకే సీజేపీ పోరాటాలను పరిమితం చేస్తున్నారా లేక ఇతర రాష్ట్రాల అంశాలపై స్పష్టత లేదా అనే కోణంలో విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై సీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సివుందని అంటున్నారు.
