Begin typing your search above and press return to search.

కేంద్రానికి బొద్దింకల తలనొప్పి..! దీప్కేను అడ్డుకోవడం ఎలా?

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   5 Oct 2026 12:50 PM IST
కేంద్రానికి బొద్దింకల తలనొప్పి..! దీప్కేను అడ్డుకోవడం ఎలా?
X

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 10వ తేదీలోగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ కార్యకర్తలు ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా ముంబైలో భారీ ధర్నా చేశారు. తాము విధించిన డెడ్ లైనులోగా సీఈసీ రాజీనామా చేయకుంటే, తమ నిరసనలు మరింత ఉధృతం చేస్తామని, జంతర్ మంతర్ 2.0 చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. విపక్షాలతో గొంతు కలిపిన సీజేపీ కూడా సీఈసీపై విమర్శల దాడికి దిగింది. సీఈసీ రాజీనామా ఒక్కటే కాకుండా సర్ ప్రక్రియను కూడా నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ పూర్తవగా, తాజాగా ఎన్నికల సంఘంలో విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలతో వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. ఇక విపక్షాలతో సీజేపీ కూడా గొంతు కలిపి ఉద్యమిస్తుండటంతో దేశవ్యాప్తంగా యువతలో ఎన్నికల సంఘంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అంటున్నారు.

దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రభుత్వం కొన్నాళ్లుగా ఇబ్బందికరంగా మారుతున్న సీజేపీ నేతల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గత జులై నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు అనుమతి ఇచ్చి పెద్ద తప్పు చేశామని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు జంతర్ మంతర్ 2.0ను ముందుగానే కట్టడి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా సీజేపీ వ్యవస్థాప అధ్యక్షుడు అభిజిత్ దీప్కేతోపాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విపక్షాల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు రాజకీయంగా తీసిపారేస్తున్నప్పటికీ, సీజేపీ కార్యకర్తలు నిర్వహిస్తున్న ప్రదర్శనలు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం అవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా యువతలో అనుమానాలు రేకెత్తించేలా ఈ ఉద్యమాలు సాగుతున్నాయని, వీటిని తేలిగ్గా తీసుకుంటే భారీ నష్టం చవిచూడాల్సివస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అంటున్నారు. దీంతో నిరసన కార్యక్రమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలంటే, ముందుకు సీజేపీ ముఖ్యనేతలను బయటకు రాకుండా అడ్డుకోవాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ముంబై వేదికగా ఆందోళనలు చేస్తున్న సీజేపీ కార్యకర్తలు, మరో ఐదు రోజుల్లో తమ ఆందోళనల కార్యక్రమాలను ఢిల్లీకి మార్చాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అదే జరిగితే మరోసారి దేశవ్యాప్తంగా కలకలం చెలరేగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో 10వ తేదీలోగా అభిజిత్ దీప్కేతోపాటు సీజేపీ బృందంలోని ఇతర కీలక నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేయాలని కేంద్రం పోలీసులను ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే ముందుగా అరెస్టు చేస్తే సీజేపీ నేతలు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి సీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని కేంద్రం ఆదేశించినట్లు చెబుతున్నారు.