Begin typing your search above and press return to search.

పాపులారిటీ ఉందని తొందరపడితే... సీజేపీ నేతలకు ఝలక్! సోషల్ మీడియాతో వచ్చిన తంటా..

దీనికి సోషల్ మీడియా సంచలనంగా గుర్తింపు సాధించిన కాక్రోచ్ పార్టీ నేతలు కూడా అతీతులేం కాదని తాజా సంఘటన నిరూపిస్తోంది.

By:  Tupaki Political Desk   |   10 Sept 2026 1:12 PM IST
పాపులారిటీ ఉందని తొందరపడితే... సీజేపీ నేతలకు ఝలక్! సోషల్ మీడియాతో వచ్చిన తంటా..
X

ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఆఫీసులో ఉన్నా.. ప్రయాణాలు చేస్తున్నా.. ఇంట్లో ఉన్నప్పుడు.. చివరికి బెడ్ రూపంలో పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత ఇలా రోజులో సగం కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. చాలా మందికి ఇదో వ్యసనంలా మారిపోయింది. రోజూ ఏదో ఒక పోస్టు పెట్టాలని కొందరు.. పెట్టిన పోస్టుకు లైకులు వచ్చాయా? రాలేదా? అని మరికొందరు నిత్యం అదేపనిగా సోషల్ మీడియాను ఫాలో అవుతుంటారు. ఇలా కొందరు పాపులర్ అవుతుంటే.. మరికొందరు ఆ పాపులారిటీని కొనసాగించడానికి తప్పులు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. దీనికి సోషల్ మీడియా సంచలనంగా గుర్తింపు సాధించిన కాక్రోచ్ పార్టీ నేతలు కూడా అతీతులేం కాదని తాజా సంఘటన నిరూపిస్తోంది.

విద్యార్థి ఉద్యమంతో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి విస్తృత గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఎక్స్ లో మొదలైన ఈ వ్యంగ్య పేజీ తర్వాత జెనీ జీ యువత మద్దతుతో క్షేత్రస్థాయి పోరాటంతో విద్యామంత్రి ఊస్టింగ్ కు కారణమైంది. ఈ క్రమంలో సీజేపీ నాయకులుగా ఎదిగిన అభిజిత్ దీప్కే, ఆశుతోష్, సౌరవ్ రాంకా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత మరిన్ని పోరాటాలకు సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో వారి సోషల్ మీడియా అకౌంట్లకు ఫాలోవర్లు విపరీతంగా పెరిగారని అంటున్నారు. జంతర్ మంతర్ ఉద్యమంతో సోషల్ మీడియా సెలబ్రెటీలుగా మారిన ఈ ముగ్గురికి బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది గౌరవ్ భాటియా షాక్ ఇచ్చారు.

స్వతంత్ర జర్నలిస్టు భరద్వాజ్ ను గౌరవ్ భాటియా విమర్శించినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిని సీజేపీ నేతలు ముందుగా పార్టీ అకౌంట్లో పోస్టు చేశారని అంటున్నారు. అయితే తాను అనని మాటలను అన్నట్లుగా ఫేక్ కంటెంట్ ను ఏఐ ద్వారా సృష్టించారని, సీజేపీ అకౌంట్లలో ఆ వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీజీపీ నేతలు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సీజేపీ నేత సౌరవ్ దాస్ ఆ వీడియోలను ఎక్స్ నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అయితే మళ్లీ ఏమనుకున్నారో ఏమో గౌరవ్ భాటియా అభ్యంతరం చెప్పిన వీడియోను సీజేపీ నేతలు అభిజిత్, సౌరవ్, ఆశుతోష్ తమ వ్యక్తిగత అకౌంట్లలో పోస్టు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముందుగా ఏఐ జనరేటిడ్ వీడియో అని చెబుతూనే సౌరవ్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో షేర్ చేయడమే కాకుండా, మరికొందరికి ఫార్వర్డ్ చేశారని న్యాయవాది భాటియా ఆరోపిస్తున్నారు. సౌరవ్ పోస్టు చేసిన వీడియోలను మిగిలిన ఇద్దరు రీ పోస్టు చేశారని చెబుతున్నారు.

దీంతో వివాదం కోర్టుకు వెళ్లింది. తన పరువుకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ న్యాయవాది, బీజేపీ నేత భాటియా సీజేపీ నేతలపై రెండు కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. భాటియా అభ్యంతరంతో ముందుగా ఎక్స్ నుంచి తొలగించిన సౌరవ్ మళ్లీ తన ఎక్స్ ఖాతాలో ఎందుకు పోస్టు చేశారనేది తెలియాల్సివుందని అంటున్నారు. అయితే సోషల్ మీడియా కంటెంట్ కోసమే సీజేపీ నేతలు తొలగించిన వీడియోను మళ్లీ పోస్టు చేశారని అనుమానిస్తున్నారు. ఎక్స్ లో ముందుగా తొలగించడమే కాకుండా, భాటియా అభ్యంతరం చెప్పిన వీడియోను ఏఐ జెనరేటెడ్ అంటూ నిర్ధిరిస్తూ మళ్లీ ట్వీట్ చేయడమే విమర్శలకు దారితీస్తోందని చెబుతున్నారు. దీంతో సీజేపీ నేతలు తొలిసారిగా చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోందని అంటున్నారు.