సుప్రీం సీజేఐపై దాడియత్నం.. జస్టిస్ గవాయ్ తొలి స్పందన ఇదే...
సుప్రీంకోర్టులో ఈ నెల 6వ తేదీన చోటుచేసుకున్న ఘటనపై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు.
By: Tupaki Political Desk | 9 Oct 2025 8:36 PM ISTసుప్రీంకోర్టులో ఈ నెల 6వ తేదీన చోటుచేసుకున్న ఘటనపై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐపై న్యాయవాది రాకేశ్ కిశోర్ (71) బూటు విసరడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీన్ని దేశంలో ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటన తర్వాత సీజేఐ ఇప్పటివరకు ఆ విషయమై ఎక్కడా మాట్లాడలేదు. ఘటన చోటుచేసుకున్న అనంతరం కేసు విచారణ కొనసాగించారు. అయితే ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సీజేఐ ఈ విషయమై తొలిసారిగా స్పందించారు.
గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా సోమవారం నాటి ఘటన ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సీజేఐ గవాయ్ మాట్లాడుతూ ‘‘సోమవారం నాటి ఘటనతో నేను, సహచర జడ్జి షాక్ అయ్యాం. అయితే మా వరకు అది ఒక మరచిపోయిన అధ్యాయం’’ అని వ్యాఖ్యానించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పందిస్తూ, ‘‘సీజేఐపై దాడికి యత్నించడాన్ని జోకుగా తీసుకోవద్దు. ఇది సుప్రీంకోర్టును అవమానించడమే. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అంటూ మండిపడ్డారు.
ఈ సందర్బంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ ఘటన క్షమార్హం కాదన్నారు. దీన్ని మరచిపోయిన అధ్యాయం అనడం సీజేఐ గొప్పతనమని కొనియాడారు. సోమవారం అక్టోబరు 6వ తేదీన కోర్టు నం.1లో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం విచారణ జరుగుతుండగా, రాకేశ్ కిశోర్ (71) అనే న్యాయవాది వేదిక వద్దకు వచ్చారు. వెంటనే తన కాలికున్న బూటును తీసి విసరబోతుండగా, భద్రతా సిబ్బంది అడ్డుకుని అతడిని బయటకు తరలించారు.
ఈ సమయంలో న్యాయవాది రాకేశ్ కిశోర్ పెద్దగా నినాదాలు చేశారు. ‘‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు’’ అంటూ కేకలు వేశారు. కాగా, దాడి సమయంలో జస్టిస్ గవాయ్ మనోనిబ్బరంతో కనిపించారు. ‘ఇలాంటి బెదిరింపులు నా ద్రుష్టిని మళ్లించలేవు. పనితీరును ప్రభావితం చేయలేవు’ అని కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులతో ఆయన అన్నారు.
