Begin typing your search above and press return to search.

అప్ఘన్ లొల్లి : పాక్‌ ఆర్మీ-ప్రభుత్వ విభేదాలు తారాస్థాయికి..

పాకిస్తాన్‌లో అధికార వ్యవస్థపై సైన్యాధిపత్యం ఎప్పటినుంచో ఉన్నదే. కానీ ప్రస్తుత సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ హయాంలో ఈ ఆధిపత్యం మరింతగా బయటపడుతోంది.

By:  A.N.Kumar   |   3 Nov 2025 9:23 PM IST
అప్ఘన్ లొల్లి : పాక్‌ ఆర్మీ-ప్రభుత్వ విభేదాలు తారాస్థాయికి..
X

పాకిస్తాన్‌లో అధికార వ్యవస్థపై సైన్యాధిపత్యం ఎప్పటినుంచో ఉన్నదే. కానీ ప్రస్తుత సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ హయాంలో ఈ ఆధిపత్యం మరింతగా బయటపడుతోంది. ఇటీవల ఆఫ్ఘానిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ విభేదాలకు కొత్త రూపం ఇచ్చాయి.

ఆర్మీ-ప్రభుత్వం మధ్య విభేదాలు

షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం దౌత్యపరంగా ఆఫ్ఘాన్‌తో సంబంధాలను సర్దుబాటు చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, పాక్‌ ఆర్మీ మాత్రం ప్రభుత్వాన్ని పక్కనపెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఆఫ్ఘాన్‌ భూభాగంపై పాక్‌ డ్రోన్‌ దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలు ఈ విభేదాల తీవ్రతను చూపిస్తున్నాయి.

అమెరికా–పాక్‌–ఆఫ్ఘాన్‌ త్రికోణం

అమెరికా మరోసారి ఆఫ్ఘాన్‌లో సైనిక పాదం మోపాలని చూస్తోందన్న ఆరోపణలు కొత్తగా వినిపిస్తున్నాయి. ట్రంప్‌ ప్రభుత్వం మళ్లీ బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌ను ఆక్రమించాలన్న ప్రయత్నంలో ఉందని, ఆ దిశగా పాక్‌ ఆర్మీ సహకరిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆసిమ్‌ మునీర్‌ అమెరికాతో గట్టి సైనిక ఒప్పందాలు కుదుర్చుకుంటూ, ప్రభుత్వాన్ని అవమానించే స్థాయికి వెళ్లారని విశ్లేషకులు అంటున్నారు.

తాలిబాన్‌ ప్రతిస్పందన

తాలిబాన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ చేసిన వ్యాఖ్యలు పాక్‌ రాజకీయ సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. “ఇస్లామాబాద్‌–కాబూల్‌ సంబంధాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో పాక్‌లోని కొన్ని సైనిక వర్గాలకు ప్రపంచ శక్తులు మద్దతు ఇస్తున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. అంటే, పాక్‌ ఆర్మీ స్వయంగా ఆఫ్ఘాన్‌తో ఘర్షణలను పెంచుతూ, అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం నిలుపుకోవాలని చూస్తోందన్న అర్థం వస్తోంది.

అంతర్గత రాజకీయ వ్యూహం

పాక్‌లో ప్రజాస్వామ్యం రూపంలో ఉన్నా, అసలైన అధికారం సైన్యమే నడిపిస్తుందనేది ఎవరికి డౌట్ లేదు. ఇమ్రాన్‌ ఖాన్‌ హయాంలో తాలిబాన్‌తో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని తాలిబాన్‌ చెబుతుంది. ఆయనను పదవి నుంచి తొలగించడం, కేసులు పెట్టి జైలుకు పంపడం వెనుక కూడా సైన్యమే ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇప్పుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై కూడా అదే ఒత్తిడి కొనసాగుతోంది.

భవిష్యత్‌ ప్రభావం

ఈ పరిణామాలు పాక్‌ అంతర్గత స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వానికి దౌత్య నియంత్రణ లేకుండా సైన్యం స్వతంత్రంగా ప్రవర్తిస్తే, దేశం అంతర్జాతీయంగా మరింత ఒంటరిగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు ఆఫ్ఘాన్‌ సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రవాదం పెరగడం కూడా ఖాయం.

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఒక ముసుగు మాత్రమే. అసలు శక్తి కేంద్రం GHQ (జనరల్‌ హెడ్‌క్వార్టర్స్‌), అంటే ఆర్మీ చేతుల్లోనే ఉంది. ఆసిమ్‌ మునీర్‌ వ్యవహారం ఆ నియంత్రణను మరింత బహిర్గతం చేసింది. ప్రభుత్వం బలహీనంగా మారిన ప్రతి సారి, పాక్‌ సైన్యం విదేశీ ఘర్షణల ద్వారా దేశీయ అసంతృప్తిని దాచే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఆఫ్ఘాన్‌పై జరుగుతున్న ఘర్షణలు కూడా అదే రాజకీయ–సైనిక ఆటలో భాగం.