Begin typing your search above and press return to search.

విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక సమ్మిట్‌

విశాఖ ఏపీలో పెద్ద నగరంగా ఉంది. జాతీయ అంతర్జాతీయ సదస్సులు అన్నీ విశాఖ వేదికగా జరుగుతున్నాయి.

By:  Satya P   |   29 Sept 2026 10:35 PM IST
విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక సమ్మిట్‌
X

విశాఖ ఏపీలో పెద్ద నగరంగా ఉంది. జాతీయ అంతర్జాతీయ సదస్సులు అన్నీ విశాఖ వేదికగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మరో ప్రతిష్టాత్మకమైన సదస్సుకు విశాఖ ముస్తాబు అవుతోంది. విశాఖపట్నంలో నవంబర్‌ 12, 13 తేదీలలో నిర్వహించనున్న 31వ సీఐఐ పార్టనర్ షిప్‌ సమ్మిట్‌-2026కు ఏర్పాట్లు చురుకుగా సాగుతునాయి. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఈ పార్టనర్ షిప్‌ సమ్మిట్‌-2026 నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే 2025లో పార్టనర్ షిప్‌ సమ్మిట్‌-2026 విశాఖలో జరిగింది.

బాబు సమీక్ష :

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షను తాజాగా నిర్వహించారు. సదసస్సుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పెట్టుబడిదారులు, గ్లోబల్ సీఈఓలు అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. ఇప్పటికే 21 దేశాల ప్రతినిధులతో పాటు పదకొండు మంది దాకా అంతర్జాతీయ మంత్రులు 26 మంది ప్రముఖ స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొనేందుకు తమ అంగీకారం తెలిపారని చెబుతున్నారు. ఇక ఈ సదస్సు కేవలం పెట్టుబడి ఒప్పందాల వరకే పరిమితం కాకుండా ఏపీలో యువతలో సరి కొత్త ఆవిష్కరణలు నవ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వేదికగా మారాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గతంలో పెట్టుబడులు :

ఇక 2025 లో నవంబర్ 14, 15 తేదీలలో 30వ సీఐఐ సదస్సు విశాఖలో జరిగింది. ఈ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల సాధన జరిగిందని కూటమి ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఇందులో నాలుగు వేల కోట్ల రూపాయలతో కాకినాడలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. అలాగే క్లీన్ ఎనర్జీ ఆధారిత 3 గిగావాట్ల డేటా సెంటర్ సహా 12 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. అధునాతన ప్రాసెసర్లతో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు ఓర్వకల్లులో 300 ఎకరాల డ్రోన్ సిటీ, తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్పేస్ సిటీలకు శంకుస్థాపనలు జరిగాయి. ఈసారి కూడా అంతకు మించి పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు.

రీజ‌న‌ల్ పార్టనర్ షిప్ స‌మ్మిట్ :

నవంబర్ 12, 13 తేదీలలో విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సుకు ముందస్తు సన్నాహాలలో భాగంగా రీజ‌న‌ల్ పార్టనర్ షిప్ స‌మ్మిట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అక్టోబర్‌ 7న విశాఖ నగరం సమీపంలోని గంభీరం ఐఐఎంలో నిర్వహించనున్న ప్రాంతీయ పార్టనర్ షిప్‌ సమ్మిట్‌కు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రీజనల్ సమ్మిట్ కి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు విద్యార్థులు సుమారు 500 మంది వరకు పాల్గొంటారు అని చెబుతున్నారు. ఇదే తీరున రాష్ట్రంలో మిగిలిన రీజియన్లలో కూడా సమ్మిట్లు వరసగా జరుగుతాయి. నవంబర్ లో రెండు రోజుల పాటు విశాఖ అంతర్జాతీయ సదస్సుతో ప్రపంచాన్ని పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తుందని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. ఈసారి ఎంత మేరకు పెట్టుబడులు వస్తాయి ఏ ఏ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటాయన్నది చూడాల్సి ఉంది.