ఫ్యాక్ట్ చెక్: ఒక్క సిగరెట్ ధర రూ.72 అవుతుందా? వైరల్ వార్తల్లో నిజమెంత?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా సామాన్యులను.. ముఖ్యంగా పొగాకు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్న ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
By: A.N.Kumar | 1 Jan 2026 10:37 PM ISTగత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా సామాన్యులను.. ముఖ్యంగా పొగాకు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్న ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 మధ్య లభిస్తున్న ఒక్కో సిగరెట్ ధర ఏకంగా రూ.72కు చేరుతుందన్నదే ఆ వార్త సారాంశం. దాదాపు 400 శాతం ధరల పెరుగుదల ఉంటుందన్న ఈ ప్రచారంపై వాస్తవాలేంటో తెలుసుకుందాం.
అసలు విషయం ఏమిటి?
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 1, 2026 నుంచి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రాథమిక ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేస్తూ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందింది. కొత్త నిబంధనల ప్రకారం.. సిగరెట్ పరిణామం, రకాన్ని బట్టి ప్రతి వెయ్యి సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీని రూ.2050 నుంచి రూ.8500 వరకూ పెంచారు. ఇది ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనం.
రూ.72 ధర నిజమేనా?
సిగరెట్ ధర రూ.72 అవుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అతిశయోక్తి మాత్రమే.. ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థల సమాచారం ప్రకారం.. ఈ పన్ను వల్ల సిగరెట్ల ధరలు సగటున 20 నుంచి 30 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.20కి దొరికే ఒక ప్రీమియం సిగరెట్ ధర కొత్త పన్నుల తర్వాత రూ.24 నుంచి రూ.26 మధ్య ఉండవచ్చు. ఏ లెక్కన చూసినా ఒక్క సిగరెట్ ధర రూ.72 అయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది. తయారీ కంపెనీలు ఇంకా అధికారిక ధరలను ప్రకటించాల్సి ఉంది.
మార్కెట్ పై ప్రభావం.. సవాళ్లు..
ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో పొగాకు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. గోల్డ్ ఫ్లేక్ వంటి బ్రాండ్లను తయారు చేసే ఈ సంస్థ షేరు సుమారు 9.5శాతం పడిపోయింది. మార్ల్ బరో పంపిణీదారులైన గాడ్ ఫ్రే ఫిలిప్స్ కంపెనీ షేరు ఏకంగా 16.86 శాతం క్షీణించింది.
భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద అక్రమ సిగరెట్ మార్కెట్‌గా ఉంది. ధరలు విపరీతంగా పెంచితే, వినియోగదారులు చట్టబద్ధమైన బ్రాండ్ల నుండి పన్ను పరిధిలోకి రాని, నాణ్యత లేని అక్రమ సిగరెట్ల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయన్నది నిజం. కానీ ఒక్కో సిగరెట్ రూ. 72 అవుతుందనే వార్తలో ఏమాత్రం వాస్తవం లేదు. సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని.. అధికారిక ప్రకటలను గమనించాలని కోరుతున్నాము.
