Begin typing your search above and press return to search.

పరకామణి చోరీ.. సీఐడీ షాకింగ్ నిజాలు

ఆయన ఆధ్వర్యంలో 20 మందితో కూడిన టీం తిరుపతిలో దర్యాప్తు చేస్తోంది. అప్పట్లో కేసు విచారించిన సీఐ జగన్ మోహన్ రెడ్డి.. కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మీరెడ్డి.. అప్పటికే టీటీడీ సెక్యూరిటీ అధికారి గిరిధర్ లను తాజాగా విచారించారు.

By:  Garuda Media   |   11 Nov 2025 11:31 AM IST
పరకామణి చోరీ.. సీఐడీ షాకింగ్ నిజాలు
X

సంచలనంగా మారిన తిరుమల పరకామణి చోరీకి సంబంధించిన కేసును సీఐడీ టేకప్ చేయటం.. విచారణలో భాగంగా పలు సంచలన అంశాలు వెలుగు చూశాయి. శ్రీవారి భక్తులు సమర్పించిన కానుకల్ని కాజేసి ఈ ఉదంతం విషయంలో నిందితుల విషయంలో పోలీసులు వ్యవహరించిన వైఖరి చూస్తే.. మరీ ఇంత ఉదాసీనతా? అనుకోకుండా ఉండలేం. సాధారణంగా ఇళ్ల దొంగతనాల నిందితుల విషయంలో నమోదు చేసే సెక్షన్లను పరకామణి సొమ్ము చోరీ నిందితుల విషయంలోనూ అమలు చేయటం విస్మయానికి గురి చేస్తోంది. ఇలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది.

మరింత ఆసక్తికర అంశం ఏమంటే.. ఛార్జ్ షీట్ వేసిన తర్వాతి రోజే లోక్ అదాలత్ లో కేసును రాజీ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఈ అంశాన్ని గుర్తించిన సీఐడీ అధికారులు.. పరకామణి చోరీ కేసును విచారిస్తున్న అధికారుల బ్రందాన్ని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరకామణి చోరీ కేసును సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ టేకప చేసిన సంగతి తెలిసిందే.

ఆయన ఆధ్వర్యంలో 20 మందితో కూడిన టీం తిరుపతిలో దర్యాప్తు చేస్తోంది. అప్పట్లో కేసు విచారించిన సీఐ జగన్ మోహన్ రెడ్డి.. కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మీరెడ్డి.. అప్పటికే టీటీడీ సెక్యూరిటీ అధికారి గిరిధర్ లను తాజాగా విచారించారు. వేర్వేరుగా వారిని విచారించిన క్రమంలో కేసు నమోదు.. రాజీ వ్యవహారాలకు సంబంధించిన వివరాల గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

లోక్ అదాలత్ లో చోరీ కేసు రాజీ గురించి ఎవరి ఆదేశాల మేరకు చేశారు? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిన నేపథ్యంలో పెట్టాల్సిన సెక్షన్లకు బదులుగా సాధారణ చోరీ కేసుల విషయంలో పెట్టే సెక్షన్లు నమోదు చేయటం వెనుకు ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సున్నితమైన కేసు రాజీ విషయానికి సంబంధించి అప్పటి ఎస్పీకి సమాచారం ఇచ్చారా? అంటూ సీఐ జగన్ మోహన్ రెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల విచారణలో కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పినట్లుగా సమాచారం. మొత్తంగా పరకామణి చోరీ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఇప్పుడు షాకింగ్ గా మారింది.