వీడియోలు చూపిస్తూ ప్రశ్నలు.. ఏడో రోజు విచారణలో సునీల్ మౌనం?
వైసీపీ ఎంపీగా ఉన్న రెబల్ రఘరామ క్రిష్ణరాజును అప్పట్లో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురైన వైనంపై ఇప్పుడు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Garuda Media | 12 March 2026 10:34 AM ISTవైసీపీ ఎంపీగా ఉన్న రెబల్ రఘరామ క్రిష్ణరాజును అప్పట్లో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురైన వైనంపై ఇప్పుడు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు సీసీఎస్ లో బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారిస్తున్నారు. ఏడో రోజు విచారణలో భాగంగా ఆయనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఇబ్బందులు పడినట్లుగా తెలుస్తోంది. వీడియోలు చూపించి అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సీఐడీ కస్టడీలో రఘురామ క్రిష్ణరాజుకు ఎదురైన చిత్రహింసలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఏడో రోజు పోలీసుల విచారణలో ఆయనకు కొన్ని వీడియోలు చూపించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి గాయాలు కాలేదంటూ తప్పుడు నివేదిక ఇవ్వాలని గుంటూరు జీజీహెచ్ వైద్యులపై ఎవరి ఆదేశాలతో ఒత్తిడి తీసుకొచ్చారు? ఆ రోజు మీరు జీజీహెచ్ కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఎవరెవరిని కలిశారు? ఏమేం మాట్లాడారంటూ పలు ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం.
రఘురామ నడవలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆయనకు గాయాలు అయిన సంగతి అర్థమవుతున్నా.. తప్పుడు నివేదిక ఇవ్వాలని ఎందుకు ఒత్తిడి తెచ్చారన్న ప్రశ్నలకు సునీల్ నాయక్ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడో రోజు విచారణలో భాగంగా యాభైకు పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజుకు సంబంధించిన పలు వీడియోలను చూపించి.. వివరాలు అడగ్గా మౌనంగా ఉన్నారే తప్పించి సమాధానాలు చెప్పలేదంటున్నారు.‘ఉన్నత స్థాయి నుంచి మీకు ఏమైనా ఆదేశాలు అందాయా?’ లాంటి ప్రశ్నలకు మాత్రం కొంత స్పందించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో రఘురామను అరెస్టు చేసిన సందర్భంలో ఆయన అప్పటికే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారన్న విషయం మీకు తెలుసా?సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం మీద ఆరా తీశారా? కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలకు మాత్రం.. పొంతన లేని రీతిలో సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏడో రోజు విచారణ సందర్భంగా మాత్రం ఆయన కొంత ఇబ్బందికి గురైనట్లుగా చెబుతున్నారు.
