Begin typing your search above and press return to search.

సిబిల్ స్కోరే పెళ్లిని నిర్ణయిస్తుందా..? అవును అంటున్న అమ్మాయి తల్లిదండ్రులు..

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్న అతడిని చూసి పెళ్లిచూపులకు వచ్చిన అమ్మాయి కుటుంబం మొదట చాలా సంతృప్తి చెందింది. కానీ చివరగా సిబిల్‌ స్కోరు అడిగారు.

By:  Tupaki Political Desk   |   17 Dec 2025 2:00 PM IST
సిబిల్ స్కోరే పెళ్లిని నిర్ణయిస్తుందా..? అవును అంటున్న అమ్మాయి తల్లిదండ్రులు..
X

ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదరాలంటే అబ్బాయికి ఉద్యోగముందా? అబ్బాయి గుణగణాలు ఏంటి? ఉండేందుక సొంత ఇల్లు ఉందా? కుటుంబం మంచిదా? అన్న నాలుగు మాటలు అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో మరో ప్రశ్న చేరింది. సిబిల్‌ స్కోరు ఎంత? ఈ ప్రశ్న వినగానే కొందరు యువకులు షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే మంచి జీతం, మంచి ఉద్యోగం ఉన్నా.. ఆర్థిక క్రమశిక్షణ లేదని తేలితే పిల్లను ఇవ్వమనేవారు. ఇటీవల రేపల్లెకు చెందిన ఓ యువకుడి ఘటన మారుతున్న సామాజిక వాస్తవానికి అద్దం పడుతోంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్న అతడిని చూసి పెళ్లిచూపులకు వచ్చిన అమ్మాయి కుటుంబం మొదట చాలా సంతృప్తి చెందింది. కానీ చివరగా సిబిల్‌ స్కోరు అడిగారు. వివరాలు తెలుసుకున్న తర్వాత.. ఒక్క మాటలో సంబంధం వద్దని వెళ్లిపోయారు. కారణం క్రెడిట్‌ కార్డు ఓవర్‌ డ్యూస్‌, గతంలో సెటిల్‌మెంట్‌ కేసులు.

పెరుగుతున్న ఈ తరహా ధోరణి..

ఇది ఒకే ఘటన కాదు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉదంతాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, ఐటీ ఉద్యోగాలు, మధ్య తరగతి కుటుంబాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. సంపాదన ఎంత ఉందన్నది కాదు, ఆ సంపాదనను ఎలా నిర్వహిస్తున్నాడన్నదే కీలకం అనే భావన బలపడుతోంది. సిబిల్‌ స్కోరు అంటే కేవలం ఒక సంఖ్య కాదు. అది ఒక వ్యక్తి ఆర్థిక జీవితానికి సంబంధించిన పూర్తి చరిత్ర. ఎన్ని లోన్లు తీసుకున్నాడు, వాటిని సమయానికి చెల్లిస్తున్నాడా, క్రెడిట్‌ కార్డులు ఎలా వాడుతున్నాడు, ఎక్కడైనా చెక్‌బౌన్స్‌ కేసులున్నాయా.. అన్నీ అందులో కనిపిస్తాయి. 750కి పైగా స్కోరు ఉంటే ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా భావిస్తారు. అంతకంటే తక్కువగా ఉంటే సందేహాలు మొదలవుతాయి.

మారిన అమ్మాయి తల్లిదండ్రుల ఆలోచన..

ఇప్పటి తల్లిదండ్రుల ఆలోచన కూడా అక్కడే మారింది. ‘మంచి జీతం ఉన్నా అప్పుల బారిన పడే అలవాటు ఉంటే, భవిష్యత్తులో మా అమ్మాయికి సమస్యలే’ అనే భయం వాళ్లలో పెరుగుతోంది. ఒకప్పుడు కుటుంబ నేపథ్యం, స్వభావం ముఖ్యమైతే.. ఇప్పుడు ఆర్థిక ప్రవర్తన కూడా వ్యక్తిత్వంలో భాగమే అన్న భావన బలపడింది. ఇది తప్పా? అని అడిగితే సమాధానం అంత సులభం కాదు. పెళ్లి అంటే కేవలం ఇద్దరి అనుబంధం కాదు, రెండు జీవితాల కలయిక. ఆర్థిక అస్థిరత ఉంటే దాని ప్రభావం నేరుగా కుటుంబ జీవితంపై పడుతుంది. అప్పులు, ఈఎంఐల ఒత్తిడి, బ్యాంకుల కాల్స్‌.. ఇవన్నీ దాంపత్యంలో అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఈ అనుభవాలు చూసిన తల్లిదండ్రులు ముందే జాగ్రత్త పడడం సహజమే. కానీ మరో కోణం కూడా ఉంది. సిబిల్‌ స్కోరు జీవితాంతం ఒకేలా ఉండదు. ఒక దశలో చేసిన తప్పులు, అవగాహన లేమి కారణంగా పడిపోయిన స్కోరు.. తర్వాత క్రమశిక్షణతో మెరుగవుతుంది. అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా, పూర్తిగా వ్యక్తిని కొలిచే ప్రమాణంగా సిబిల్‌ను మార్చడం కూడా అన్యాయమేనని కొందరు అంటున్నారు.

పెళ్లి కావాలంటే ఆర్థిక క్రమ శిక్షణ తప్పనిసరి

అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తరం యువతకు ఆర్థిక అవగాహన తప్పనిసరి గా మారింది. ఉద్యోగం వచ్చిందంటే క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం, అవసరం లేకున్నా లోన్లు చేయడం, వాయిదాలు ఆలస్యం చేయడం.. ఇవన్నీ ‘నాకు జీతం ఉంది కదా’ అన్న నిర్లక్ష్యంతో జరిగిపోతున్నాయి. అదే నిర్లక్ష్యం ఇప్పుడు పెళ్లి దశలో అడ్డంకిగా మారుతోంది. అందుకే పెళ్లికాని యువకులకు ఇది ఒక హెచ్చరిక కూడా. సంపాదన పెంచుకోవడమే కాదు, దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సిబిల్‌ స్కోరు బ్యాంకు లోన్‌కే కాదు, జీవిత భాగస్వామి ఎంపికకూ ప్రమాణంగా మారుతున్న రోజుల్లో.. ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం తప్పనిసరి.

చివరికి ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. పెళ్లి వ్యవస్థ మారుతోంది. ప్రేమ, ఉద్యోగం, కుటుంబం తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్‌ ట్రాక్‌ రికార్డు కూడా పరీక్షకు వస్తోంది. ఇది కఠినంగా అనిపించినా… భవిష్యత్తు భద్రత కోసం సమాజం తీసుకుంటున్న కొత్త నిర్ణయంగా చూడాల్సిన అవసరం ఉంది.