అరుదైన పోలీస్.. వైరల్ అవుతున్న నున్న సీఐ అలీ వీడియోలు
సాధారణంగా పోలీసు శాఖలో సిబ్బంది, అధికారులతో ప్రశంసలు అందుకునే అధికారులు బహు అరుదుగా ఉంటారని చెబుతారు.
By: Tupaki Political Desk | 28 Sept 2026 4:39 PM ISTస్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనల సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తూ కుప్పకూలిన సీఐ షేక్ అహ్మద్ ఆలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విధి నిర్వహణలో ఆయన మరణించగా, ఆందోళనల సందర్భంగా తోపులాట జరిగిందని, ఆ సమయంలో ఒత్తిడికి గురైన సీఐ అస్వస్థతకు గురయ్యారని కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మరోవైపు సీఐ అలీ చివరి క్షణాలలో గడిపిన వీడియోలతోపాటు ఆయన గతంలో విధి నిర్వహణలో ఉండగా ఎలా పనిచేసేవారనే విషయాన్ని కళ్లకు కడుతూ మరికొన్ని వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన అహ్మద్ అలీ 1996లో సబ్ ఇనస్పెక్టరుగా పోలీసు విధుల్లో చేరారు. సర్వీసులో ఎక్కువ కాలం తూర్పు గోదావరి జిల్లాలోనే పనిచేశారని చెబుతున్నారు. సీఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత విజయవాడ కమిషనరేటుకు వచ్చిన ఆయన నగరంలోని పలు పోలీసుస్టేషన్లలో సేవలు అందించారని అంటున్నారు. త్వరలో ఏసీపీగా ప్రమోషన్ వస్తుందని అనుకుంటుండగా, ఇలా జరిగిందని సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విధి నిర్వహణలో సీఐ అహ్మద్ ఆలీ పనితీరును మెచ్చిన పలువురు అధికారులు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సాధారణంగా పోలీసు శాఖలో సిబ్బంది, అధికారులతో ప్రశంసలు అందుకునే అధికారులు బహు అరుదుగా ఉంటారని చెబుతారు. పోలీస్ అంటేనే ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, సీఐ అహ్మద్ ఆలీ విషయంలో ఇటువంటి కామెంట్లు ఏవీ కనిపించడం లేదని అంటున్నారు. అంతేకాకుండా ఆయన మరణించారని తెలిసిన వెంటనే గతంలో సీఐ ఆలీ బదిలీ అయినప్పుడు తోటి సిబ్బంది సత్కరించడమే కాకుండా, తమ భుజాలపై కూర్చోబెట్టుకుని వాహనంపై ఎక్కించి వీడ్కోలు పలికిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ ఆకర్షిస్తున్నాయి.
నున్న సీఐగా పనిచేస్తు మరణించిన అహ్మద్ ఆలీ ఇంతకుముందు నగరంలో కృష్ణలంక, గన్నవరం వంటి స్టేషన్లలో పనిచేశారని చెబుతున్నారు. ఆయా పోలీసుస్టేషన్లలో విధులు నిర్వహించడమంటేనే కత్తిమీద సవాల్ గా చెబుతున్నారు. ఇటీవల కృష్ణలంకలో చోటుచేసుకున్న ఒక ఉదంతంతోపాటు గన్నవరం సీఐపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు చేసిన ఆరోపణలు ఆయా స్టేషన్లలో విధి నిర్వహణ సీఐలకు ఎంత సమస్యాత్మకమో చెబుతాయని అంటున్నారు. కానీ, సీఐ అహ్మద్ ఆలీ ఆ రెండు చోట్ల ప్రజలు, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకునేలా పనిచేశారని సిబ్బంది చెబుతున్నారు.
సీఐ ఆలీ మరణించారని తెలిసిన వెంటనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. ఆలీ ఒక పోలీసుగా ఎంతటి సమర్థతతో పనిచేశారో వివరిస్తూ నివాళులర్పించారు. ఇక విజయవాడ నగరంలో ఒక పోలీసుస్టేషన్ నుంచి బదిలీపై వెళుతున్న సమయంలో సహచర సిబ్బంది పూలు జల్లుతూ వీడ్కోలు పలకడమే కాకుండా, సీఐ ఆలీని తమ భుజాలపై మోసి జేజేలు కొట్టడం, రాత్రిపూట విధి నిర్వహణలో ఉండగా శాంతిభద్రతల విషయంలో ఎంతటి అప్రమత్తంగా వ్యవహరించేవారో తెలియజేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
