Begin typing your search above and press return to search.

ఇంటి అమ్మకానికి లాటరీ పెట్టేసిన పెద్దమనిషి.. ఎక్కడంటే?

చౌటుప్పల్ కు చెందిన తన 66గజాల ఇంటి స్థలాన్ని (ఇందులో రేకుల గది కూడా ఉంది) అమ్మకానికి లక్కీ డ్రా పద్దతిని ఎంచుకున్నాడు.

By:  Garuda Media   |   30 Sept 2025 1:16 PM IST
ఇంటి అమ్మకానికి లాటరీ పెట్టేసిన పెద్దమనిషి.. ఎక్కడంటే?
X

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని ఉత్తినే అనలేదు. ఇప్పుడు చెప్పే ఉదంతం చట్టబద్ధం కానప్పటికి.. రోటీన్ కు భిన్నంగా ఆలోచించిన ఒక వ్యక్తి చేపట్టిన ఈ వ్యవహారం ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. పోతే పోయింది రూ.500 ఖర్చుచేసి లక్ ను టెస్టు చేసుకుందామన్న ఆలోచన కలిగేలా చేయటం చూస్తే.. చౌటుప్పుల్ పెద్ద మనిషి సక్సెస్ అయినట్లుగా చెప్పక తప్పదు. ఇంతకూ అసలేం జిరగిందన్న విషయంలోకి వెళితే..

సాధారణంగా విలువైన వస్తువులకు లక్కీ డీప్ డ్రా పెట్టి.. టికెట్లు అమ్మి.. చివర్లో డ్రా తీయటం.. విజేతకు సదరు వస్తువును అందజేయటం లాంటివి చేస్తుంటారు.అయితే.. ఇలాంటివన్నీ దాదాపు ముప్ఫై నలభై ఏళ్ల క్రితం ఉండేది. మారిన కాలంలో ఇలాంటి ఐడియాలు ఎప్పుడో అవుట్ డేటెడ్ అయ్యాయి. అయితే.. విలువైనవస్తువులకు భిన్నంగా తన ఇంటిని అమ్మదలిచిన ఒక వ్యక్తి లక్కీ డ్రా ద్వారా విజేతకు అందజేద్దామని డిసైడ్ అయిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

చౌటుప్పల్ కు చెందిన తన 66గజాల ఇంటి స్థలాన్ని (ఇందులో రేకుల గది కూడా ఉంది) అమ్మకానికి లక్కీ డ్రా పద్దతిని ఎంచుకున్నాడు. దీనికి కారణం.. అతను కట్టుకున్న మరో ఇంటికి నవంబరులో డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే.. ఆయనకున్న స్థలాన్ని ఏడాదిన్నర క్రితం అమ్మకానికి పెట్టినా మంచి ధర రాలేదు. దీంతో.. ఏం చేయాలో పాలుపోని అతను లక్కీ డ్రా పద్దతిని ఎంపిక చేసుకున్నాడు.

నిబంధనల ప్రకారం ఇలా చేయటం తప్పే అవుతుంది.కానీ.. తనకున్న అవసరం నేపథ్యంలో రూల్ ను వదిలేసి.. ఆయన అందరికి ఒక బంఫర్ ఆఫర్ పెట్టారు. తన 66 గజాల స్థలం..అందులో ఏర్పాటు చేసిన గది విలువ రూ.16 లక్షలు ఉంటుందని.. అంత ధర పలకపోవటంతో.. 3000 కూపన్లు ప్రింట్ చేయించానని.. ఒక్కొక్క కూపన్ రూ.500చొప్పున పెట్టానని.. వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాల్ని రాసి ఇంటి వద్ద ఏర్పాటుచేసిన స్టీల్ డ్రమ్ లో వేయాలని.. నవంబరు 2న లక్కీ డ్రా తీసి విజేతను డిసైడ్ చేస్తానని చెబుతున్నారు.

ఏడాదిన్నరగా తన ఇంటిని అమ్మాలని భావిస్తున్నా.. సరైన ధర రాకపోవటం.. డబ్బుల అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సదరు వ్యక్తం చెబుతున్నారు. రూ.16 లక్షల స్థలం రూ.500లకే వస్తున్న వేళ.. జనం నుంచి స్పందన కూడా బాగానే ఉందన్న మాట వినిపిస్తోంది.