చిట్యాల వద్ద దగ్ధమైన బస్సు.. ప్రయాణికుల పరిస్థితి ఏంటంటే?
బస్సు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురి చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం, యాక్సిడెంట్ లాంటివి తరుచూ జరుగుతుండడంతో ప్రయాణికులు బంభేలెత్తిపోతున్నారు.
By: Tupaki Political Desk | 11 Nov 2025 1:04 PM ISTబస్సు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురి చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం, యాక్సిడెంట్ లాంటివి తరుచూ జరుగుతుండడంతో ప్రయాణికులు బంభేలెత్తిపోతున్నారు. కర్నూల్ లో ప్రైవేట్ బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ప్రమాదంలో కంకర లోడ్ టిప్పర్ బస్సుపై పడడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. చిట్యాల వద్ద కూడా బస్సు అగ్నికి ఆహుతైంది. కానీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చౌటుప్పల్ వద్ద టీ బ్రేక్ కోసం ఆగి మళ్లీ బయల్దేరిన బస్సు, కేవలం పది నిమిషాల వ్యవధిలోనే చిట్యాల వద్ద అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ ఇంజిన్ నుంచి మంటలు వస్తున్నట్టు గమనించి వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దింపడంతో 29 మంది ప్రాణాలు కాపాడాడు.
ప్రయాణికులు బయటకు దిగిన క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా తగలబడింది. ఇది కేవలం డ్రైవర్ అప్రమత్తత వల్ల తప్పిన పెను ప్రమాదం లేకుంటే.. నలుగురు కుటుంబాలు నలుగురి బిడ్డలతో నాశనం అయ్యేవి. కానీ ఈ ఘటన మనకు ఒక పెద్ద ప్రశ్నను మళ్లీ గుర్తు చేసింది, మన రోడ్లపై నడుస్తున్న బస్సులు ఎంత భద్రంగా ఉన్నాయని.
ప్రాణాలను అదృష్టానికి వదిలేస్తున్న రవాణా వ్యవస్థ
ప్రతి సారి బస్సులో కూర్చునే ప్రయాణికుడు తన గమ్యం చేరుకోవడమే కోరుకుంటాడు. కానీ ఆ ప్రయాణం సురక్షితమా అన్నది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎందుకంటే మన రవాణా వ్యవస్థను నడిపే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ ఆ ప్రశ్నను అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ ప్రమాదం మరోసారి వెల్లడించింది ‘ప్రాణాల విలువ కాగితం మీదే ఉంది.’ కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదని పలువురు మండిపడుతున్నారు.
క్రమం తప్పిన మెయింటెనెన్స్, స్క్రాప్ కు తరలించే వాహనాలు తాత్కాలిక ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందిన వాహనాలు రోడ్లపై నిత్యం పరుగులు పెడుతున్నాయి. ఇంజిన్‌లో మంటలు రావడం వంటి ప్రమాదాలు కేవలం మెకానికల్ లోపం వల్లే కాదు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న నిర్లక్ష్యం వల్ల కూడా జరుగుతాయి.
డ్రైవర్ అప్రమత్తత
చిట్యాలలో బ్రేక్ తర్వాత బయల్దేరిన బస్సు ఇంజిన్ నుంచి మంటలు రావడం కనిపించింది. డ్రైవర్ మంటలను గమనించి వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ఇది ఒక వ్యక్తి చాకచక్యానికి, సమయస్ఫూర్తికి గొప్ప ఉదాహరణ. ఈ ఒక్క నిర్ణయం 29 మంది ప్రాణాలను కాపాడింది. కానీ ఈ ఘటనలో మరో కోణం కూడా ఉంది. ఇలాంటి అప్రమత్త డ్రైవర్లకు తగిన గౌరవం, రక్షణ, బీమా లేదా ప్రోత్సాహం ఉందా? మన దేశంలో ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌కు ఒక అభినందన పత్రం కూడా అందకపోవడం దురదృష్టం. కానీ, ప్రాణాలు పోయిన తర్వాతే అధికారుల సందర్శన, విచారణలు, మద్దతు ప్రకటనలు మొదలవుతాయి.
సామాజిక బాధ్యత..
బస్సు అగ్నిప్రమాదం కేవలం ఒక సాంకేతిక లోపం కాదు.. ఇది ఒక సామాజిక అవగాహన లోపం. ప్రయాణికులు కూడా తమ భద్రతపై కొంత అప్రమత్తంగా ఉండాలి. బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నాయా లేదా? డ్రైవర్, కండక్టర్ సురక్షా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్నది కనీసం చూసే అలవాటు రావాలి. సమాజం మొత్తం నిర్లక్ష్యాన్ని సాధారణం చేసుకున్నప్పుడు అగ్నిప్రమాదాలు కూడా సాధారణమవుతాయి. ప్రజా రవాణా కేవలం ప్రయాణ సాధనం కాదు. అది ప్రజల ప్రాణాలతో నడిచే వ్యవస్థ. ఇది సక్రమంగా పనిచేయకపోతే, ప్రతీ ప్రమాదం తర్వాత ‘అదృష్టం బాగుంది’ అని చెప్పుకోవడం తప్ప మిగిలేది ఏమీ ఉండదు.
ప్రతి రాష్ట్రంలో మోటారు వాహన శాఖలు, రవాణా అధికారులున్నా,
ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం తప్ప పర్యవేక్షణ చేయడం మరుస్తున్నారు. బస్సుల ఇంజిన్, ఇంధన లీకేజీలు, ఎలక్ట్రికల్ వైర్ల స్థితి ఇవన్నీ క్రమంగా పరీక్షించే పద్ధతి లేదు. ప్రైవేట్ ఆపరేటర్లు ‘సర్వీస్‌లో ఉంది’ అని చెప్పి ఏ వాహన్నానైనా రోడ్డెక్కిస్తారు. ఇది కేవలం పరిపాలనా లోపం కాదు. ప్రజా భద్రతపై నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రతి ప్రమాదం తర్వాత విచారణ కమిటీలు వస్తాయి, నివేదికలు సమర్పిస్తాయి, కానీ ఆ నివేదికలు కూడా మంటల్లో కాలిపోతున్నాయి.
మనం మేల్కొనకపోతే...
చిట్యాల ఘటనలో అదృష్టం సహకరించింది. కానీ మన భవిష్యత్ రవాణా వ్యవస్థను అదృష్టం మీద నడపలేం. బస్సుల భద్రతపై తక్షణ ఆడిట్ చేయాలి. ప్రతి వాహనంలో సెన్సార్ ఆధారిత ఫైర్ అలారమ్, ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థలు తప్పనిసరి చేయాలి. డ్రైవర్లకు క్రమం తప్పని శిక్షణ, ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలు కూడా అత్యవసరం.
