Begin typing your search above and press return to search.

ఆ గోల్డ్ ఉండడం వల్లే అతను టార్గెట్.. గ్యాంగ్ స్టర్లు ఏం చేశారంటే?

రాజస్థాన్ లోని చిత్తోర్‌గఢ్ లో ఇతను చాలా ఫేమస్. ఎందుకంటే ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి లాగా ఎప్పుడూ భారీగా నగలు వేసుకొని కనిపిస్తాడు.

By:  Tupaki Political Desk   |   29 Nov 2025 5:00 PM IST
ఆ గోల్డ్ ఉండడం వల్లే అతను టార్గెట్.. గ్యాంగ్ స్టర్లు ఏం చేశారంటే?
X

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ ఆ ఇష్టమే కొందరికి పిచ్చిగా మారుతుంది. ఒంటి నిండా కిలోల కొద్ది బంగారం వేసుకొని తిరిగితే చూసేవాళ్లకు ముచ్చటగా ఉండొచ్చు కానీ, దొంగలకు, గ్యాంగ్‌స్టర్లకు మాత్రం అది ఒక టార్గెట్‌లా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక ‘గోల్డ్ మ్యాన్’ ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. తన మెడలోని బంగారమే తన మెడకు చుట్టుకునేలా మరణంలా మారింది.

చిత్తోర్ గఢ్ వ్యాపారికి బెదిరింపులు..

రాజస్థాన్ లోని చిత్తోర్‌గఢ్ లో ఇతను చాలా ఫేమస్. ఎందుకంటే ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి లాగా ఎప్పుడూ భారీగా నగలు వేసుకొని కనిపిస్తాడు. స్థానికులు ఆయన్ను ‘చిత్తోర్‌గఢ్ బప్పీలహరి’ అని పిలుచుకుంటారు. అయితే రెండు రోజుల క్రితం వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్, ఆడియో మెసేజ్ అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అడిగినంత ఇవ్వకపోతే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరికలు వచ్చాయి. ఇతని పేరు కన్హయ్యలాల్ ఖటిక్. పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. తాజాగా ఇతనికి అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మొదట మిస్డ్ కాల్స్, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్ వచ్చాయి. లిఫ్ట్ చేయకపోవడంతో ఒక ఆడియో రికార్డింగ్ పంపించారు. అందులో ఏకంగా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆ ఆడియో మెసేజ్ లో ఉన్న కంటెంట్ వింటే షాక్ అవ్వాల్సిందే. ‘డబ్బులు ఇవ్వకపోతే.. నువ్వు ఇకపై బంగారం వేసుకునే స్థితిలో ఉండవు’ అంటూ గ్యాంగ్‌స్టర్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా సైలెంట్ గా సెటిల్ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో భయపడిపోయిన కన్హయ్యలాల్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

వేగంగా ఎదిగిన కన్హయ్యలాల్..

ఒకప్పుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్మిన కన్హయ్యలాల్, ఆ తర్వాత పండ్ల వ్యాపారంలో స్థిరపడి సంపన్నుడయ్యాడు. బప్పీలహరి ఇన్‌స్పిరేషన్ తో దాదాపు 3.5 కిలోల బంగారాన్ని ఒంటిపై ధరించి ‘గోల్డ్ మ్యాన్’ గా మారాడు. ఇక బెదిరించిన రోహిత్ గోదారా సామాన్యుడు కాదు. సిద్దు మూసేవాలా హత్య కేసులో ఇతను కూడా నిందితుడు. కెనడాలో తలదాచుకొని ఇలాంటి దందాలు నడిపిస్తున్నాడు. పోలీసులు గోదారా గ్యాంగ్ లింకులపై ఆరా తీస్తున్నారు. 5 కోట్ల డిమాండ్ అనేది చిన్న విషయం కాదు కాబట్టి, అధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు.

ఇది మొదటి సారి కాదు..

ఇలాంటి బెదిరింపులు రావడం మొదటిసారి కాదు. గోదారా గ్యాంగ్ రాష్ట్రం అంతటా ధనికులు, వ్యాపారులు, రియల్టర్లను టార్గెట్ చేస్తూ డబ్బు వసూలుకు ప్రయత్నిస్తోందని పోలీసుల దర్యాప్తు చెబుతోంది. సోషల్ మీడియా, వార్తలు, లోకల్ గాసిప్‌ వీటి ద్వారా టార్గెట్లను గుర్తించి, వారి గురించి సమాచారం సేకరించి, అప్పుడు బెదిరింపు కాల్స్ చేస్తారట. కన్హయ్యలాల్ వంటి వ్యక్తులు ఎక్కువగా పబ్లిక్‌లో కనిపించడం, బహిరంగంగా బంగారం ప్రదర్శించడం వల్ల గ్యాంగ్‌కి సులభమైన టార్గెట్‌ అవుతున్నారు. ఒకవైపు సంపాదన పెరిగిన వారి వ్యక్తిగత భద్రతపై అవగాహన లేకపోవడం, మరోవైపు గ్యాంగ్‌స్టర్ల ధైర్యం పెరుగుతున్న తీరు ఈ రెండూ కలిసి ఇటువంటి ఘటనలను పెంచుతున్నాయి.

ఇక స్థానికుల మధ్య మాత్రం భయం పెరిగుతోంది. ‘ఈరోజు ఇతను.. రేపు మేమా?’ అనే ఆందోళన అక్కడి వ్యాపారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తోర్‌గఢ్‌లో ఇప్పటి వరకు బంగారం అంటే గర్వం, ధనం, ప్రతిష్ట. కానీ ఇప్పుడు అదే బంగారం ప్రజలకు భయానికి మరో పేరుగా మారుతోంది. పోలీసులు గోదారా గ్యాంగ్‌పై చర్యలు కఠినంగా తీసుకోవాలని, ఇలాంటి బెదిరింపులకు గురయ్యే వారికి ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కన్హయ్యలాల్ కేసు రోజురోజుకూ పెద్దదవుతుండడంతో ఈ ప్రకంపనలు ఒక చిన్న పట్టణం నుంచి దేశవ్యాప్త చర్చకు దారి తీస్తున్నాయి.