థాంక్స్ టూ చిరు అంటున్న వైసీపీ క్యాడర్
ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతల మీద చర్చ సాగింది. ఆ తరువాత అది కాస్తా జగన్ మీద విమర్శలకు తావు తీసింది. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేవని సహజంగానే విమర్శలు వచ్చాయి.
By: Satya P | 26 Sept 2025 9:07 AM ISTఅవునా ఇది నిజమా అంటే అవును అనే అంటున్నారు. బాలయ్య వర్సెస్ చిరంజీవి కాస్తా వైసీపీ క్యాడర్ కి ఖుషీ అయ్యే మ్యాటర్ ని అందించింది అని అంటున్నారు. అసెంబ్లీలో బాలయ్య మాట్లాడుతూ చిరంజీవి మీద చేసిన కామెంట్స్ దాని మీద విదేశాలలో ఉంటూ కూడా చిరంజీవి ఒక సుదీర్ఘమైన పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగిపోయాయి. నిజానికి గురువారం ఏపీలో చాలా సాధారణంగా ప్రారంభం అయింది. కానీ రోజు ముగిసేనాటికి మాత్రం పొలిటికల్ రచ్చ పీక్స్ కి చేరింది. అసెంబ్లీలో జగన్ మీద విమర్శలు చేయడం విషయంలో టీడీపీతో కూటమి మిత్రులు పోటీ పడుతున్నారు. బీజేపీ కూడా ఇందులో ఏమీ తీసిపోలేదు అనిపించుకునే ప్రయత్నం చేయడమే విశేషం.
శాంతి భద్రతల మీద చర్చ :
ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతల మీద చర్చ సాగింది. ఆ తరువాత అది కాస్తా జగన్ మీద విమర్శలకు తావు తీసింది. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేవని సహజంగానే విమర్శలు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సినీ పెద్దలను జగన్ అవమానించారు అంటూ తన ప్రసంగంలో పాత విషయాలను ప్రస్తావించారు ఆ సమయంలో సభలో ఉన్న బాలయ్య అనూహ్యంగా లేచి కామినేనికి కౌంటర్ ఇవ్వడం విశేషం. ఇదే సందర్భంలో ఆయన జగన్ ని సైకో గాడు అనేశారు, చిరంజీవిని కూడా సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. ఇలా జగన్ మీద విమర్శలు అనుకుంటున్న నేపథ్యంలో అది కాస్తా చిరంజీవి మీద ట్విస్ట్ చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది అనే అంటున్నారు.
జగన్ గురించి చిరంజీవి :
ఇక ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘంగా రాసిన ఒక లేఖ లాంటి పత్రికా ప్రకటనలో జగన్ గురించి మంచి మాటలే చెప్పారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని గౌరవించారని లంచ్ కి సైతం పిలిచారని చెప్పారు. ఆయన కోరిక మేరకు తామంతా కలసి సినీ సమస్యలను చర్చించామని దాంతో జగన్ సైతం సినీ సమస్యలను పరిష్కరించారని సానుకూలంగా అంతా జరిగింది అని నాలుగేళ్ళ క్రితం నాటి విషయాలను బయటకు తెచ్చారు.
ఆ విమర్శలకు చెక్ పడిందా :
ఇక సినీ పెద్దలను జగన్ అవమానించారు అని పదే పదే గత నాలుగేళ్ళుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు అని వైసీపీ అంటోంది. జగన్ ఎవరినీ అవమానించలేదని కూడా గతంలో వైసీపీ చెప్పినా ఈ విమర్శలు ఆగలేదు. ఆఖరికి గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే విషయం మీద ఒక బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ ప్రస్తావించారు. మొత్తం మీద బాలయ్య కెలుకుడుతో అసలు విషయం బయటకు వచ్చింది అని అంటున్నారు. జగన్ సమాదరించారు అని టాలీవుడ్ పెద్ద చిరంజీవి చెప్పడమే కాకుండా తన సుదీర్ఘమైన లెటర్ లో ఎక్కడా గత ప్రభుత్వాన్ని విమర్శించలేదు సరికదా టికెట్ల రేట్ల పెంపు వంటివి ఆనాడు పరిష్కరించుకున్నామని చెప్పారు. దీంతో వైసీపీ క్యాడర్ థాంక్స్ టూ చిరంజీవి గారూ అంటోంది. మీరు అసలు విషయం చెప్పి ఇన్నాళ్ళుగా సాగుతున్న విమర్శలకు ఆరోపణలకు తెర దించారని కూడా సంతోషిస్తోంది. మొత్తానికి అటు నుంచి ఎటో తిరిగి వైసీపీ క్యాడర్ కి ఆనందం మిగిల్చింది అని అంటున్నారు. అఫ్ కోర్స్ సైకో గాడు అని బాలయ్య అన్న దానికి వైసీపీ నేతలు అంతా కౌంటర్లు ఇస్తున్నారు.
