Begin typing your search above and press return to search.

బాలకృష్ణ పై 300 పోలీస్ స్టేషన్లలో చిరు అభిమానుల కేసులా?

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  A.N.Kumar   |   30 Sept 2025 9:00 AM IST
బాలకృష్ణ పై 300 పోలీస్ స్టేషన్లలో చిరు అభిమానుల కేసులా?
X

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులను తీవ్రంగా కుదిపేశాయి. బాలయ్య తన అభిమాన హీరోను అవమానపరిచారని భావించిన మెగా ఫ్యాన్స్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

* 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ప్లాన్

హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్‌లో ‘అఖిల భారత చిరంజీవి యువత’ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మెగా అభిమానులు పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో బాలకృష్ణపై రెండు రాష్ట్రాల్లోని 300 పైగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని తీర్మానం చేశారు. ముందుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తర్వాత దాన్ని విస్తరించేలా ప్లాన్ చేశారు.

అభిమానులకు మెగాస్టార్ వార్నింగ్

అయితే ఈ సమాచారం చిరంజీవి వరకు చేరడంతో, ఆయన వ్యక్తిగానే అభిమానులకు ఫోన్ చేసి వారించారు. “అలాంటి పనులు మన సంస్కృతికి విరుద్ధం. కోపం ఉన్నా కూడా కేసులు పెట్టడం సరైన మార్గం కాదు” అంటూ మెగాస్టార్ సున్నితంగా నచ్చజెప్పారు. ఫలితంగా మెగా అభిమానులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్

బాలయ్య వ్యాఖ్యల తరువాత సోషల్ మీడియాలో మెగా – నందమూరి అభిమానుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పరస్పరం ఆరోపణలు, విమర్శలు, కౌంటర్లు విరివిగా కనిపిస్తున్నాయి. అయితే అభిమానుల్లో కొంతమంది మాత్రం సోషల్ మీడియా వరకే పరిమితం కాకుండా చట్టపరమైన చర్యలకు దిగాలని కోరుకున్నారు.

“ఇక భవిష్యత్‌లో ఊరుకోం”

ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ, ‘అఖిల భారత చిరంజీవి యువత’ స్పష్టమైన సందేశం ఇచ్చింది. భవిష్యత్తులో ఎవరు తమ అభిమాన హీరోను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం నిశ్శబ్దంగా ఉండబోమని హెచ్చరించారు.

చిరంజీవి – బాలకృష్ణ వివాదం అనుకోని రీతిలో అభిమానులను కూడా విభజించేలా మారింది. కానీ చివరికి మెగాస్టార్ జోక్యంతో పెద్ద వివాదం నివారించబడింది. అభిమానుల భావోద్వేగాలను అదుపులో పెట్టి, తగిన మార్గంలో నడిపించడం ద్వారా చిరంజీవి మరోసారి తన పరిణితిని చూపించారు.