చిరంజీవికి రాజకీయం ఎంత దూరం ?
మెగాస్టార్ గా వెండి తెర వేలుపుగా చిరంజీవి కోట్లాది మంది అభిమాన జనం కలిగి ఉన్నారు . ఆయనది అర్ధ శతాబ్దం సినీ జీవితం.
By: Satya P | 7 Aug 2025 5:00 AM ISTమెగాస్టార్ గా వెండి తెర వేలుపుగా చిరంజీవి కోట్లాది మంది అభిమాన జనం కలిగి ఉన్నారు . ఆయనది అర్ధ శతాబ్దం సినీ జీవితం. విజయవంతంగా పండించుకున్న ప్రస్థానం అది. అయితే చిరంజీవి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆ పార్టీ 2009లో ఎన్నికల్లో తనదైన ప్రభావం చూపించినప్పటికీ అది కాస్తా విలీనం వైపుగా దారి తీసింది. కేవలం మూడేళ్ళ వ్యవధిలో కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఇక కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి 2014లో ఆ పార్టీ ఓటమి పాలు కావడంతో రాజ్యసభ సభ్యుడిగా 2018 దాకా కొనసాగారు. ఆ తరువాత ఆయన రాజకీయ ప్రయాణం ఆగింది.
కేవలం పదేళ్ళు మాత్రమే :
మొత్తంగా చూస్తే చిరంజీవి రాజకీయ ప్రయాణం పదేళ్ళు మాత్రమే అని చెప్పాలి. అందులో యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నది అయిదేళ్ళు మాత్రమే. ఇక చిరంజీవి 2017లో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. గడచిన ఎనిమిదేళ్ళుగా ఆయన సినిమాల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన నుంచి రాజకీయ ప్రకటనలు అయితే రావడం లేదు. కానీ చిరంజీవి గురించి మాత్రం తరచుగా రాజకీయాల్లో ప్రస్తావన వస్తూనే ఉంటోంది. దానికి కారణం ఏమిటి అన్నదే చర్చ.
ఆ ఫ్యాక్టర్ ఒక ఎగ్జాంపుల్ :
ఇక చిరంజీవి తాను స్వయంగా చెప్పినట్లుగా రాజకీయాలకు బహు దూరం పాటిస్తున్నారు. కానీ ఆయనను టార్గెట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అయితే రాజకీయాలలో చూస్తే ప్రజారాజ్యం ఒక ఫ్యాక్టర్ గా చెప్పుకోవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా ఉమ్మడి ఏపీలో ఆవిర్భవించింది. ఎన్నో ఆశలతో ఏర్పాటు అయిన పార్టీ ఆ తరువాత విలీనం అయిన తీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటోంది. రాజకీయ నేతలు అయినా విశ్లేషకులు అయినా ఏదైనా చెప్పాల్సి వచ్చినపుడు దానినే ఎగ్జాంపుల్ గా తీసుకుంటూంటారు. రాజకీయాల్లో ఒకసారి ప్రవేశించాక వెనక్కి వచ్చేసినా నాటి సంగతులు ప్రస్తావించినప్పుడు కచ్చితంగా ప్రజారాజ్యం అన్నది చరిత్రలో ఉంటుంది. అలా చిరంజీవి విజయాలు అపజయాలు కూడా రాజకీయంగా చర్చకు వస్తూనే ఉంటాయని అంటారు.
ఎవరికి వారుగా అలా :
ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా చేరారు. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా ఢిల్లీలో కప్పుకున్నారు. దాంతో కాంగ్రెస్ లో ఆయన ఉన్నట్లు అయింది. మూడేళ్ళ క్రితం ఏఐసీసీకి ఎన్నికలు జరిగితే చిరంజీవికి కూడా ఓటు వేయమని ఇచ్చారు. ఆయన సభ్యత్వం నంబర్ అన్నీ కూడా కాంగ్రెస్ వద్ద ఉన్నాయని చెబుతారు. చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసాక కాంగ్రెస్ కి అధికారికంగా రాజీనామా చేయలేదు అన్నది హస్తం పార్టీ వారు చెప్పేది. దాంతో ఆయన మావాడే అని క్లెయిం చేసుకుంటూ ఉంటారు. ఇక బీజేపీ పెద్దలతో వేదిక మీద కనిపించినపుడు వారు కూడా చిరుని మావాడే అంటారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను అడిగితే మెగాస్టార్ తమ పార్టీలో చేరుతారు అని కామెంట్స్ చేశారని ప్రచారంలో ఉంది. మరో వైపు వైఎస్ జగన్ సీఎం గా ఉన్నపుడు ఆయనను సినీ సమస్యల మీద చిరంజీవి కలిస్తే అది రాజకీయంగా అతి పెద్ద చర్చ అయింది.
ఇంట్లో రాజకీయం ఉంది :
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరం అంటున్నారు. కానీ రాజకీయం మాత్రం ఆయనను వదలడం లేదు. ఆయన ఇంట్లోనే అది ఉంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆయన ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. దాంతో తప్పనిసరిగా చిరంజీవి మీద ఆ ప్రభావం పడుతోంది. చిరంజీవి అయితే ఒక సందర్భంలో ప్రజారాజ్యానికి కొనసాగింపే జనసేన అని కూడా అన్నారు. ఈ విధంగా చూస్తే చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరం అంటునా రాజకీయం మాత్రం ఆయనను ఏ మాత్రం వదిలిపెట్టడం లేదు అని అంటున్నారు. ఇక చిరంజీవిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తప్పే కానీ ప్రజారాజ్యం విలీనం మీద ఎవరి అభ్యంతరాలు వారికి ఉన్నాయి. ఏపీ రాజకీయ చరిత్రను ప్రస్తావించే సందర్భంలో తప్పనిసరిగా ఆ పార్టీ గురించి మాట్లాడేవారు ఉంటూనే ఉంటారు. సో అలా రాజకీయం ఎంతో కొంత ఆయన్ని పరోక్షంగా వెంటాడుతూనే ఉంటుంది అన్నది ఒక కఠిన విశ్లేషణ.
