మెగాస్టార్ ఆనాడే నోరు విప్పి ఉంటే ?
చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో లేఖ రాశారో కానీ ఆ లేఖ తరువాత ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలే పుట్టుకొస్తున్నాయి.
By: Satya P | 27 Sept 2025 1:00 AM ISTచిరంజీవి ఏ ఉద్దేశ్యంతో లేఖ రాశారో కానీ ఆ లేఖ తరువాత ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలే పుట్టుకొస్తున్నాయి. బాలయ్య తనను నిండు అసెంబ్లీలో సెటైరికల్ గా విమర్శించడం మీద చిరంజీవి విదేశాలలో ఉండి కూడా ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఇచ్చిన క్లారిటీ ఇపుడు కూటమికి ఇరకాటంగా మారింది. వైసీపీకి మాత్రం ఫుల్ జోష్ ఇచ్చినట్లు అయింది. అంతే చిరంజీవి వైసీపీ వారు అయిపోయారు. ఆయన తాజాగా ఇచ్చిన స్పష్టతతో వైసీపీ నేతలు అంతా ఖుషీ అవుతూనే అయిదేళ్ళుగా తమ అధినాయకుడు జగన్ తామూ నిందలు మోస్తున్నామని వాపోయారు. అపుడే దీని మీద వివరణ ఇచ్చి ఉంటే చాలా మంది నోళ్ళు మూతలు పడేవని అంటున్నారు.
చిరంజీవిని సొంత అన్నయ్యగా :
వైఎస్ జగన్ తన ఇంటికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు అని సొంత అన్నయ్యగా చూసుకుని మర్యాద చేసారు అని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. ఆ తరువాత సినీ ప్రముఖులు అంతా కలసి వస్తే వారి సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేసారు అని పేర్ని నాని చెప్పారు. ఇన్ని చేసినా చిరంజీవిని జగన్ అవమానించారు అని తప్పుడు ప్రచారం పుట్టించారు అని పేర్ని నాని మండిపడ్డారు. ఎట్టకేలకు ఇపుడు చిరంజీవినే స్వయంగా ఆనాడు ఏమి జరిగింది అన్నది బయటపెట్టారని చెప్పారు. దాంతో జగన్ ఎలాంటి వారు అన్నది తెలిసింది అని చెప్పారు.
పవన్ విష ప్రచారం :
తన అన్నయ్యను జగన్ తక్కువ చేసి చూశారని అమర్యాదగా వ్యవహరించారు అని పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్ళుగా విమర్శలు చేస్తూ వచ్చారని అయితే ఈ తరహా విమర్శల మీద చిరంజీవి ఆనాడే చెక్ పెట్టేలా వివరణ ఇచ్చి ఉండాల్సి అని పేర్ని నాని అన్నారు. అపుడు పవన్ వంటి వారు నోళ్ళు కూడా మూతపడేవని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తమ మీద నిందలు ఎన్నో పడ్డాయని వాటిని ఇంతకాలం మోస్తూనే ఉన్నామని ఆయన చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది జగన్ మీద ఎంతో విషం చిమ్మారని చిరంజీవి లేఖ అపుడే రాసి ఉంటే అలాంటి పరిస్థితి రాకుండా ఉండేది కదా అన్నారు.
ఆ జీవో రద్దు చేయలేదు :
తెలుగు చలన చిత్ర పరిశ్రమ పట్ల తాము తప్పుగా వ్యవహరించి తప్పుడు నిర్ణయం కనుక తీసుకుని ఉంతే తాము తెచ్చిన జీవోనే ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది అని పేర్ని నాని ప్రశ్నించారు. తాము ఇచ్చిన సినిమా టికెట్ రేట్ల పెంపు జీవోను రద్దు చేయగలరా అని ఆయన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కి సవాల్ చేశారు. తాము మేలు చేశామే తప్ప ఎవరికీ ఇబ్బంది పెట్టలేదు అని ఆయన అన్నారు.
కూటమికి ఇరకాటమేనా :
ఒక వైపు వైసీపీకి ఈ ఇష్యూ కలసివచ్చినట్లుగా ఉంది. మెగాస్టార్ జగన్ మీద మంచి మాటలు చెప్పడంతో కూటమి నోట మాట రావడం లేదు. అదే సమయంలో వైసీపీ అయితే ఇదంతా జగన్ మీద కోపంతో విషం చిమ్మారని అంటోంది. దీనికి వారే జవాబు చెప్పాలన్ నిలదీస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ ఏమీ అనలేని విధంగా కూటమి పరిస్థితి ఉంటే నాటి సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పేర్ని నాని మాత్రం ఒకే దెబ్బకు అటు టీడీపీని ఇటు జనసేనను గట్టిగానే విమర్శిస్తున్నారు. దీంతో ఈ ఇష్యూని ఎలా కౌంటర్ చేయాలన్నది మాత్రం టీడీపీకి కానీ జనసేనకు కానీ పాలుపోవడం లేదు అని అంటున్నారు.
