చిరంజీవి క్లారిటీ వెనక ఒక ధర్మ సందేహం ?
మెగాస్టార్ చిరంజీవి అజాత శత్రువుగా ఉంటారు. ఎవరితోనూ ఆయన ఏ రకమైన వివాదాలూ కోరి తెచ్చుకోరు అని అంటారు.
By: Satya P | 29 Sept 2025 9:48 AM ISTమెగాస్టార్ చిరంజీవి అజాత శత్రువుగా ఉంటారు. ఎవరితోనూ ఆయన ఏ రకమైన వివాదాలూ కోరి తెచ్చుకోరు అని అంటారు. ఆయన హుందాగా వ్యవహరిస్తారు, ఎదుటి వారి నుంచి అదే కోరుకుంటారు. ఇక ఆయన విషయంతో ముడి పెట్టి ఎవరైనా దాన్ని వివాదం చేయాలకుంటే ఆయన ఊరుకోరు. ఎక్కడో అక్కడ లాజికల్ ఎండ్ కి తెస్తారు. అలాంటిది తమ పేరుతో ఏకంగా మూడేళ్ల పాటు అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పక్షం అదే పనిగా చేసిన ఒక ప్రచారం విషయంలో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేందుకు చాలా లేట్ చేశారా అన్నది చర్చకు వస్తున్న విషయం.
మెగాస్టార్ ని మధ్యన పెట్టి :
ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2022 ఫిబ్రవరి 10న ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖుల భేటీ జరిగింది. దానికి మెగాస్టార్ నాయకత్వం వహించారు. అందరూ కలసి సినీ సమస్యలను చెప్పుకున్నారు. ఆ సమావేశం తరువాత బయటకు వచ్చి మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ చాలా సవ్యంగా సాఫీగా మీటింగ్ సాగిందని కూడా చెప్పారు. కానీ ఆ మీదటనే ఒక వివాదం దాని చుట్టూ అల్లుకుంది. జగన్ చిరంజీవిని ఇతర సినీ ప్రముఖులను అవమానించారు అని. అది అలా ఏకంగా మూడేళ్ల పాటు ఒక బలమైన ప్రచారంగా సాగింది. ఏకంగా మెగాస్టార్ తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తన సభలలో ఇదే విషయం ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉండేవారు. జగన్ గురించి ఆయన ఇగో గురించి చెబుతూ తన అన్నను కోట్లాది మంది అభిమానించే మెగాస్టార్ ని జగన్ అవమానించారు అని పవన్ చెబుతూ వచ్చారు.
రెండో వైపు మరచి :
ఇక్కడ అసలు మ్యాటర్ ఏమిటి అంటే వీరంతా నాణేనికి ఒక వైపే చూశారు. జగన్ ని విమర్శించే క్రమంలో మెగాస్టార్ ని తాము కూడా అవమానిస్తున్నామని గ్రహించలేకపోయారు. పైగా ఎవరికి తోచిన విధంగా ప్రతిపక్షంలోని పలువురు నాయకులు వారు ఈ విషయం మీద మాట్లాడుతూ చిరంజీవి ఇమేజ్ ని కూడా ఇబ్బందులలోకి నెట్టారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే మెగాస్టార్ భుజం మీద నుంచి జగన్ ని తుపాకీలో కాల్చారు. ఆ విధమైన రాజకీయం వల్ల జగన్ నష్టపోవచ్చు కానీ మెగా ఇమేజ్ కూడా చూసుకోవాలి కదా అన్న చర్చ నాడే వచ్చింది.
నాడు మౌనం వహించి :
అయితే ఇంతలా ఊరూ వాడా పవన్ కళ్యాణ్ కానీ కూటమి పెద్దలు కానీ ఇదే విషయం మీద మాట్లాడినపుడు మౌనం వహించిన మెగాస్టార్ బాలయ్య కేవలం రెండు మూడు నిముషాలు మాత్రమే అసెంబ్లీలో దీని మీద మాట్లాడితే ఎందుకు వెంటనే రెస్పాండ్ అయ్యారు అన్నదే అందరికీ ఇపుడు కలిగే ధర్మ సందేహం. నిజానికి ఈ ఇష్యూలో బాలయ్య అన్నది మెగాస్టార్ గట్టిగా పిలిస్తే జగన్ వచ్చారు అన్నది అన్నది అవాస్తవం అని. అదే సమయంలో ఆయన జగన్ మీద దారుణమైన పదమే వాడారు. ఇక అందరూ అన్నట్లుగానే సినీ ప్రముఖులకు అందరికీ అవమానం జరిగింది అన్నారు. మరి ఇందులో ఏది మెగాస్టార్ ని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది అన్నదే అంతా ఇపుడు చర్చించుకుంటున్నారు.
లీడ్ పాయింట్ అక్కడే కదా :
అసలు 2022 ఫిబ్రవరి 10న జరిగిన ఒక సంఘటన మీద 2025 సెప్టెంబర్ 25న కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారు అంటే దీనికి కారణం ఎవరు అన్నది కూడా చూడాల్సి ఉంది కదా అన్నది ఉంది. అంతే కాదు వీలైనప్పుడల్లా జగన్ యాటిట్యూడ్ ని చెప్పాలని ఎవరికైనా బుద్ధి పుట్టినప్పుడల్లా ఇదే ఇష్యూని ముందుకు తెచ్చి మరీ మాట్లాడుకునేలా ఇంతగా పాపులర్ గా ఈ ఇష్యూని చేసి లైం లైట్ లో ఉంచింది ఎవరు అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. మూడున్నర ఏళ్ళ క్రితమే ఈ ఇష్యూ మీద వివాదం రేగినపుడే అలా జరగలేదు ఒక చిన్నపాటి వివరణ కానీ ప్రకటన కానీ ఇచ్చి ఉంటే అసలు ఇది ఇంత పెద్దగా ఇన్నేళ్ళ పాటు లైం లైట్ లో ఉండే చాన్స్ లేకుండా పోయేది కదా అన్నది కూడా మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న.
బాలయ్య అనకపోతే :
ఇది ఊహాతీతమైన ఆలోచన కానీ ఇలా కూడా అంటున్న వారు ఉన్నారు. ఒకవేళ బాలయ్య ఈ ఇష్యూని లేవనెత్తకపోయి ఉంటే ఎప్పటికీ ఈ విషయం మీద ఇదీ వాస్తవం అని ఒక క్లారిటీ వచ్చి ఉండేదా అన్న ధర్మ సందేహాన్ని వ్యక్తం చేసే వారు ఉన్నారు. ఏది ఏమైనా బాగా ఆలస్యం అయినా ఒక వివాదాస్పదమైన ఇష్యూ మీద ఒక లాజికల్ ఎండ్ అయితే వచ్చింది అని అంటున్నారు. అయితే ఈ మీదట కూడా మళ్ళీ ఎవరైనా దీని ప్రస్తావిస్తే మాత్రం ఈ క్లారిటీకి మెగాస్టార్ ఇచ్చిన ప్రకటనను పూర్వపక్షం చేసినట్లే అన్నది గుర్తుంచుకోవాలి. ఇక ఈ ఇష్యూని శాశ్వతంగా పక్కన పెట్టేయాలని అంటున్నారు.
