మీ కృషి తరతరాలకు ప్రేరణ.. చిరంజీవి ట్వీట్ వైరల్
సినీచ క్రీడా రంగానికి చెందిన తన సన్నిహితులకు చిరంజీవి తన సందేశంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు.
By: A.N.Kumar | 26 Jan 2026 11:26 AM ISTభారత ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పద్మ పురస్కారాల గ్రహీతలపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. కళలు, క్రీడలు, వైద్యం, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రముఖులను ఆయన కొనియాడారు.2026 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల గ్రహీతలను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించడం దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
లెజెండరీ నటులకు ప్రత్యేక ప్రశంసలు
చిరంజీవి తన సందేశంలో ముఖ్యంగా తన సహచర నటులు.. ఆప్తమిత్రుల గురించి ప్రస్తావించారు. పద్మ విభూషణ్ గ్రహీత, మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టిని చిరంజీవి ఆత్మీయంగా అభినందించారు. దశాబ్దాల కాలంగా ఆయన చూపిస్తున్న అంకితభావానికి ఈ పురస్కారం తగిన గుర్తింపు అని పేర్కొన్నారు. వైద్య రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డా. దత్తాత్రేయుడు గారికి పద్మ భూషణ్ దక్కడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
పద్మశ్రీ గ్రహీతలకు అభినందనలు
సినీచ క్రీడా రంగానికి చెందిన తన సన్నిహితులకు చిరంజీవి తన సందేశంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. తన చిరకాల మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు పద్మశ్రీ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నటుడు మాధవన్‌ను తన 'సోదరుడు' అని సంబోధిస్తూ అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రపంచకప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్లకు పద్మశ్రీ దక్కడం క్రీడా రంగానికి గర్వకారణమని కొనియాడారు. "ఇంతటి విశిష్ట వ్యక్తులను గౌరవించడం ఎంతో గర్వకారణం. ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు.. మీరు దశాబ్దాలుగా చూపిన నిబద్ధతకు దక్కిన గౌరవం" అని చిరంజీవి పేర్కొన్నారు.
యువతకు దిశానిర్దేశం
2026 పద్మ అవార్డు గ్రహీతలందరినీ అభినందిస్తూ వారి కృషి, సాధించిన విజయాలు నేటి యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని చిరంజీవి ఆకాంక్షించారు. మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అభిమానులు, సినీ ప్రముఖులు సైతం అవార్డు విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
