చిరంజీవి పవన్ మధ్యలో వైసీపీ !
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద మనిషిగా పేరుంది. ఆయన రాజకీయాల్లో కొంతకాలమే ఉన్నారు. తన మనస్తత్వానికి సరిపడవని ఒక పెద్ద దండం పెట్టేశారు.
By: Satya P | 26 Sept 2025 5:00 PM ISTమెగాస్టార్ చిరంజీవికి పెద్ద మనిషిగా పేరుంది. ఆయన రాజకీయాల్లో కొంతకాలమే ఉన్నారు. తన మనస్తత్వానికి సరిపడవని ఒక పెద్ద దండం పెట్టేశారు. అయితే అదేదో సినిమాలో ఆయన పాత్ర చెప్పినట్లుగా రాజకీయం ఆయన దూరమైనా రాజకీయం మాత్రం ఆయనకు దగ్గరగానే ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేశారు. ఆయన కూటమితో కట్టి ఉపముఖ్యమంత్రిగా ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. అయితే జనసేన కారణంగా చిరంజీవికి ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ రాజకీయ వేడి అయితే తగులుతూనే ఉంది. ఆయన తాను ఏ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రతీసారీ చెబుతూనే ఉన్నారు. అంతే కాదు ఆయన తన సినిమాల్లో తాను బిజీగానే ఉన్నారు.
జనసేన టార్గెట్ :
అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ చిరంజీవి మీద వేసిన సెటైర్ల విషయంలో మెగాస్టార్ తానుగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక సుదీర్ఘమైన లేఖని కూడా మీడియాకు రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు. అక్కడితో ఇష్యూ క్లోజ్ అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. అక్కడ నుంచే ఇష్యూని పీక్స్ చేర్చడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. చిరంజీవికి మద్దతుగా ఇపుడు వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మెగాస్టార్ ని బాలయ్య అంత మాట అంటారా వారు ఆగ్రహిస్తున్నారు. నిండు అసెంబ్లీలో బాలయ్య మెగాస్టార్ మీద సెటైర్లు వేస్తూంటే జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నిలదీస్తోంది. ఆ విధంగా జనసేనను మధ్యలోకి లాగి టార్గెట్ చేస్తోంది.
మండిపడిన దేవినేని :
ఇదిలా ఉంటే తమ నాయకుడు వైఎస్ జగన్ మీద బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ మండిపడుతోంది. దాంతో విజయవాడలో బాడవపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద దేవినేని అవినాష్ నాయకత్వంలో వైస్సీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బాలయ్య సభా మర్యాద సభ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలకు గానూ జగన్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న బసవతారకం ఆసుపత్రికి ఎంతో సహకరించారని నిధులను కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారని అన్నారు. అంతే కాదు బాలయ్య నటించిన సినిమాలకు కూడా అండగా నిలిచారుని ఆయన గుర్తు చేశారు. జగన్ బాలయ్యకు ఇంతలా మేలు చేసినా ఆయన మీద నోరు పారేసుకోవడం బాలకృష్ణ దిగజారుడుతనానికి నిదర్శనమని దేవినేని అవినాష్ నిప్పులు చెరిగారు.
ఎందుకు మౌనం అంటూ :
చిరంజీవి వంటి మహా నటుడి విషయంలో బాలయ్య నోరు చేసుకుని మాట్లాడుతున్నా జనసేన నుంచి రియాక్షన్ లేకపోవడమేంటి అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. కనీసంగా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించలేరా అని ఆయన ప్రశ్నించారు. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తుంటే కూడా మౌనంగా ఉండడమేంటి అని రెట్టించారు. మొత్తం మీద చూస్తే చిరంజీవిని వెనకేసుకుని వస్తూ జనసేన మీద వైసీపీ బాణాలు వేస్తోంది. కూటమిలో ఉన్న జనసేనకు ఇది ఇబ్బందికరం ఇరకాటం అని తెలుసు. అందుకే వైసీపీ ఆ పార్టీని లాగుతోంది. చిరంజీవి మీద వైసీపీకి మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది అని అంటున్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వం హయాంలో మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడారు. జగన్ వద్దకు రెండు సార్లు వెళ్లి కలసి వచ్చారు. సహజంగా చిరంజీవి అందరివాడుగా ఉంటారు. ఆయనకు రాజకీయాలు అన్నవి లేవు అని చెబుతారు. అంతే కాదు ఆయన ఇపుడు కూడా తన సినిమాలు తానేంటో అన్నట్లుగానే ఉన్నారు. కానీ తాజాగా బాలయ్య ఇష్యూతో జగన్ తనకు ఎంతో మర్యాద గౌరవం ఇచ్చారని చెప్పడంతో మరోసారి వైసీపీకి ఆయన ఎంతో ఇష్టుడై పోయారు. దాంతో జనసేన మీద వైసీపీ విమర్శలు చేస్తోంది. ఇది ఎందాకా వెళ్తుందో చూడాల్సి ఉంది.
