మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..రీజనేంటి ?
వెండి తెర మెగా స్టార్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి.
By: Satya P | 12 Oct 2026 8:58 AM ISTవెండి తెర మెగా స్టార్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పుకున్నట్లుగానే చాలా కాలానికి ఏపీకి వచ్చారు. ఇక ఆయన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో పర్యటించి జీఎస్‌ఎల్ ఆస్పత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి మీద కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం విశేషం. అంతే కాదు ఆయన మరో మాట అన్నారు. గతంతో పోలిస్తే ప్రగతి అన్ని విధాలుగా కనిపిస్తోంది అని. దాంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజకీయ వ్యాఖ్యలు కావు :
నిజానికి చిరంజీవి రాజకీయాలకు చాలా ఏళ్ళుగా దూరంగా ఉంటున్నారు. అంతే కాదు ఆయన రాజకీయాలకు ఒక పెద్ద దండం కూడా పెట్టేశారు. తాను సినిమాలకే పరిమితం అని కూడా తేల్చి చెప్పేశారు. అయితే ఆయన ఏపీకి రావడం అందులోనూ రాజకీయంగా చైతన్యవంతమైన గోదావరి జిల్లాల్లో ఒక కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఏపీ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించడంతోనే కొత్త చర్చకు తెర లేచినట్లు అయింది. చిరంజీవి ఏపీకి చెందిన వారు, గోదావరికి చెందిన వారు కూడా. పైగా ఆయన సినీ నటుడుగా లబ్ద ప్రతిష్టుడు, రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా చేసిన వారు. అందువల్ల ఆయన లాంటి వారు ఏ ఒక్క మాట అన్నా అది జనాల్లోకి వేగంగా వెళ్తుంది. అంతే కాదు అది చర్చకు కూడా తావిస్తుంది. ఇపుడు కూడా అదే జరిగింది అని అంటున్నారు.
పంచాయతీ రాజ్ గురించి :
ఇక చిరంజీవి తన ప్రసంగంలో ఏపీలో పంచాయతీ రాజ్ శాఖ గురించి కూడా ప్రస్తావించారు. ఆ మంత్రిత్వ శాఖ పని తీరు బాగుంది అని అన్నారు. గతంలో 23 స్థానంలో ఉంటే ఇపుడు నంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చిందని పంచాయతీరాజ్ శాఖలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ శాఖను పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఆ విధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీ రాజ్ శాఖ పనితీరుపై ప్రశంసలు కలిగించాయని అంటున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన :
అంతే కాకుండా ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖను ఎంతగానో బలోపేతం చేశారని గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు నిరంతరాయంగా సాగుతున్నాయని చిరంజీవి పేర్కొన్నారు.
సానుకూలంగానే :
కూటమి ప్రభుత్వం పని తీరు పట్ల ఇంత బాహాటంగా మెగాస్టార్ ఎపుడూ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. అంతే కాదు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండడం ఏపీకి కూడా పెద్దగా రాకపోవడం వల్ల కూడా బహుశా స్పందించేందుకు అవకాశం లేదని అంటున్నారు. ఇపుడు సందర్భం వచ్చింది కాబట్టే ఓపెన్ అయి ఆయన తన మనసులోని మాటలను చెప్పారని అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఎంతగానో బూస్ట్ ఇచ్చిందని కూడా విశ్లేషిస్తున్నారు.
