పవన్ సీఎం...జాతీయ పార్టీ ఆఫర్ ఏంటి ?
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. టెక్నికల్ గా చూస్తే రాజ్యాంగంలో ఆ పదవి అన్నది లేదు, ఆయన మంత్రిగానే పరిగణించబడతారు.
By: Satya P | 10 July 2026 9:14 AM ISTపవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. టెక్నికల్ గా చూస్తే రాజ్యాంగంలో ఆ పదవి అన్నది లేదు, ఆయన మంత్రిగానే పరిగణించబడతారు. అయితే రాజకీయంగా హోదా మాత్రం చెప్పుకునేందుకు ఉంటుంది. ఇక పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అయితే ఆయన అభిమానులు కానీ జనసైనికులు కానీ ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి ఒక అడుగు దూరమే అని సంబరపడ్డారు. నిజానికి ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి అడుగు దూరం కాదు యోజనాల దూరం ఉందని రాజకీయ చరిత్ర నిరూపించిన నేపథ్యం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కానీ దేశంలో చాలా చోట్ల కానీ ఉప ముఖ్యమంత్రి అయిన వారు ముఖ్యమంత్రి సీటుని పట్టిన దాఖలాలు బహు తక్కువగా ఉన్నాయి. దాంతో ఉప ముఖ్యమంత్రి అన్నది పొలిటికల్ గా చూస్తే ఒక అలంకార పదవి అన్నది కూడా స్థిరపడిపోయింది.
విజయ్ కి లక్కీ చాన్స్ తోనే :
ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న తమిళనాడులో సినీ స్టార్ విజయ్ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. అనూహ్యంగా ఆయన మెడలో గజమాల పడిపోయింది. రెండు బలమైన ద్రవిడ పార్టీలు ఉండగా మధ్యలో లేగ దూడలా నలిగిపోతాడు విజయ్ అనుకుంటే కాదని ఆ రెండు పార్టీలకు చెరో వైపునకు నెట్టేసి మరీ ముఖ్యమంత్రి సీటుని విజయ్ పట్టేశారు. దాంతో ఏపీలో కూడా నాటి నుంచే పవన్ మీద ఒత్తిడి పెరిగిపోతోంది అని అంటున్నారు. ఇక జనసేన నేతలు అభిమానుల మనసులో కూడా మన నాయకుడు సీఎం అయితే బాగుండు అన్నది ఉంది. అయితే పవన్ మదిలో ఏముందో అన్నది కూడా అందరి ఆలోచనగా ఉంది. పవన్ విషయమే తీసుకుంటే ఆయన తనకంటూ వ్యూహం ఉంది అన్నారు కాబట్టి ఆయన వైపు ఆశగా చూస్తున్నారు.
కాంగ్రెస్ ఏమంటోంది :
ఇదిలా ఉంటే పవన్ కి ఊహించని వైపు నుంచి సీఎం నీవే అంటూ ఒక పిలుపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే పవన్ మా సీఎం అభ్యర్థి అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గట్టిగానే ప్రకటించారు. పవన్ ని సీఎం చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని ఆయన అంటున్నారు. ఇది నిజంగా విచిత్రమైన ప్రతిపాదనగానే చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గురించి ఎపుడూ పవన్ ఆలోచించలేదు. ఆయన జనసేన పెట్టిన దగ్గర నుంచి కూడా కాంగ్రెసేతర రాజకీయాలనే చేస్తూ వచ్చారు. ఇక బీజేపీకి ఆయన ప్రస్తుతం బహు దగ్గరగా ఉన్నారు. బీజేపీ పెద్దలు మోడీ అమిత్ షాలంటే కూడా ఎంతో గురి పవన్ కి అని చెబుతారు. అలాంటిది కాంగ్రెస్ నుంచి ఈ ప్రతిపాదన వస్తే జనసేన సీరియస్ గా తీసుకుంటుందా అన్నదే చర్చ.
ఏమి బలం ఉందని అంటూ :
ఇక ఏపీలో చూస్తే వరసగా జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు తెచ్చుకోలేక చతికిలపడింది. 2029 ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందని ఎవరూ అనుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీ టీడీపీతో ఉన్న కూటమిని వీడి కాంగ్రెస్ తో ఎలా చేతులు కలుపుతుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే రాజకీయాల్లో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరిగాయని చరిత్ర చెబుతోంది. ఈ రోజున హాస్యాస్పదంగా కనిపించినవి రేపటి రోజుల అహా అన్నట్లుగా అద్భుతాలుగా మారినవి కూడా ఉన్నాయి. మరి చింతా మోహన్ మాటలను లైట్ తీసుకున్నా రేపటి రోజున ఏమి జరుగుతుంది అన్నది అయితే తెలియదు అని అంటున్నారు. మొత్తానికి ఒక జాతీయ పార్టీ అయితే పవన్ ని సీఎం గా చేస్తామని చూస్తామని అంటోంది. ఇది రాజకీయంగా ఇప్పటికి అయితే సరదాగా చెప్పుకునే మాటగానే చూడాలని అంటున్నారు.
