Begin typing your search above and press return to search.

లోకేశ్ కు ఊహించని ప్రశంస.. చంద్రబాబు బద్ధ విరోధి వద్ద మార్కులు కొట్టేసిన యువనేత!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విపక్షం వైసీపీ కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తోంది.

By:  Tupaki Political Desk   |   9 Aug 2026 1:06 PM IST
లోకేశ్ కు ఊహించని ప్రశంస.. చంద్రబాబు బద్ధ విరోధి వద్ద మార్కులు కొట్టేసిన యువనేత!
X

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్న డీఎస్సీ అంశంపై మంత్రి లోకేశ్ కు ఊహించని ప్రశంస లభించింది. ఈ విషయంలో విపక్షం వైసీపీ అనవసర యాగీ చేస్తోందని చెప్పడమే కాకుండా, డీఎస్సీ పక్కాగా నిర్వహించారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కొనియాడటం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు అధికార టీడీపీకి బద్ద విరోధిగా భావించే సీనియర్ నేత చింతా మోహన్ నుంచి ఈ విధమైన ప్రకటన రావడం విపక్షం వైసీపీకి ఎదురుదెబ్బగానే వ్యాఖ్యానిస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలకు తావులేదని, పరీక్షలు ముగిసిన ఏడాది తర్వాత రాజకీయాల కోసమే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్న ప్రభుత్వాన్ని సమర్థించేలా సీనియర్ నేత చింతా మోహన్ తాజా ప్రకటన రాజకీయంగా ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోందని అంటున్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విపక్షం వైసీపీ కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే వైసీపీ ఆరోపణల్లో ఒక్క శాతం నిజం కూడా లేదని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో కోర్టులు కూడా వైసీపీ విమర్శలను తప్పుబడుతున్నా ఆ పార్టీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదని చెబుతున్నారు. కేవలం రాజకీయంగా ఈ వివాదాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతోనే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు అధికార టీడీపీకి నైతికంగా మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

డీఎస్సీపై విపక్షం చేస్తున్న విమర్శల్లో పసలేదని చెప్పడమే కాకుండా, తాను కూడా డీఎస్సీలో ఏమైనా తప్పులు చోటుచేసుకున్నాయా? అనే అనుమానంతో శోధించానని, దాదాపు నెల రోజుల పాటు అధ్యయనం చేస్తే ఒక్క తప్పు కూడా తన దృష్టికి రాలేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తాజాగా ప్రకటన చేశారు. అంతేకాకుండా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించారని ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో విపక్షం వైసీపీపై సీనియర్ నేత చింతా మోహన్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీయే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ మొత్తం పరిణామం ప్రభుత్వానికి సానుకూలంగా మారిందని చెబుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ టీడీపీపై విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా తీవ్రంగా విభేదించే చింతా మోహన్ సీఎం కుమారుడి పనితీరును మెచ్చుకోవడంపైనా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విపక్షాన్ని సమర్థించడానికి తగిన కారణాలు లేకపోతే మౌనంగా ఉండొచ్చని, కానీ ఎవరూ అడగకుండానే టీడీపీని వెనకేసుకు రావడానికి చింతా మోహన్ ఉత్సాహం చూపడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.