టీడీపీలో సర్దుకోగలమా.. చిన్నశ్రీను అనుచరుల్లో మల్లాగుల్లాలు
విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరిన తర్వాత ఆ జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
By: Tupaki Political Desk | 16 Sept 2026 7:00 PM ISTవిజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరిన తర్వాత ఆ జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధానంగా వైసీపీలో కీలక నేతగా పనిచేసిన చిన్నశ్రీను ప్రభావం లేకుండా కేడర్ ను కాపాడుకునేలా వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారని చెబుతున్నారు. ఇదే సమయంలో చిన్న శ్రీను వెంట నడిచే విషయంలో ఆయన అనుచరులు కూడా తర్జనభర్జన పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో చిన్న శ్రీను ఒంటరిగా మిగిలిపోతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీలో ఉన్న చిన్న శ్రీను అనుచరులు ఆయన వెంట టీడీపీలో చేరే విషయంలో తర్జనభర్జనకు గురవుతున్నారని జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. వైసీపీలో పలు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు సరైన హామీ లేకుండా చిన్నశ్రీనును నమ్ముకుని టీడీపీలో చేరితో అందులో తమకు భవిష్యత్తు ఉంటుందా? అనే మీమాంసకు గురవుతున్నారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో జిల్లా రాజకీయాల్లో జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయమై చర్చలు కొలిక్కిరావడం లేదని అంటున్నారు. వైసీపీలో ఉత్తరాంధ్ర స్థాయి నేతగా చెలామణీ అయిన చిన్న శ్రీను అనూహ్యంగా టీడీపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. జడ్పీ చైర్మనుగా ఉన్న ఆయన వైసీపీ కీలక నేత బొత్సకు స్వయాన మేనల్లుడు కావడంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మామ అండదండలతో సుమారు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగిన చిన్నశ్రీను ఇప్పుడు సొంత రాజకీయ గుర్తింపు కోసం ప్రయత్నం మొదలుపెట్టి టీడీపీ గూటికి చేరారు. అయితే బొత్సను రాజకీయంగా దెబ్బతీసే అవకాశం చిక్కడంతో టీడీపీ కూడా చిన్న శ్రీనుకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు అంగీకరించి, ఆఘమేఘాలపై ఆయనను చేర్చుకుందని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో చిన్న శ్రీను అనుచరుల విషయంలోనే టీడీపీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల టీడీపీలో చేరికలపై సందిగ్ధత నెలకొందని అంటున్నారు.
విజయనగరం జడ్పీ చైర్మనుగా ఉన్న చిన్న శ్రీనుకు ఉమ్మడి జిల్లాతోపాటు అటు విశాఖ, ఇటు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా అనుచర వర్గం పెంచుకున్నారు. మామ బొత్స మంత్రిగా పనిచేసిన సమయంలో స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటూ చిన్న శ్రీను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా కేడర్ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో బొత్సను మించిన విధంగా ఆయన రాజకీయాలు సాగేవని పరిశీలకులు చెబుతున్నారు. మేనమామ నీడలో దాదాపు 25 ఏళ్లు రాజకీయాలు చేసిన చిన్నశ్రీను అనూహ్యంగా బొత్సతో విభేదించి తన దారి తాను చూసుకున్నారు. అయితే ఈ విషయంలో ఆయనను నమ్ముకున్న కేడర్ అయోమయానికి గురవుతున్నారని అంటున్నారు. తమకు అన్నివిధాలుగా అందుబాటులో ఉంటూ ఇన్నాళ్లు ఆదరించిన నేతతోపాటు టీడీపీలో చేరేందుకు చాలా మంది తర్జనభర్జనకు గురవుతున్నారని అంటున్నారు. టీడీపీలో తమకు తగిన గుర్తింపు, రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? అనే బెంగతో ఎక్కువ మంది తటపటాయిస్తున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో చిన్నశ్రీను సైతం కేడర్ సంగతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండటమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. వారం రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన చిన్నశ్రీను ఆ వెంటనే విజయవాడలో ప్రత్యక్షమై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఆ మరునాడు నుంచి జిల్లాకు చెందిన టీడీపీ నాయకులతో వరుస భేటీలకే పరిమితమవుతున్నారు. కానీ, వైసీపీలో ఉన్న తన అనుచరులతో ఈ విషయంలో ఇప్పటివరకు సంప్రదింపులు జరపలేదని అంటున్నారు. కానీ, కొందరు తమ రాజకీయ గురువు ఎక్కడ ఉంటే తాము అక్కడే అన్న ఆలోచనతో చిన్నశ్రీను వెంట తిరుగుతున్నారు.
ఇటువంటి వారిలో చీపురుపల్లి, ఎస్.కోట వంటి నియోజకవర్గాలకు చెందిన మండలస్థాయి నాయకులు ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో తమ పరిస్థితి ఏంటి అంటూ వైసీపీలో చిన్న శ్రీను అనుచరులు జుట్టు పీక్కుంటున్నారని చెబుతున్నారు. చిన్నశ్రీను అనుచరులుగా ముద్ర పడిన తమకు పార్టీలో ఇకపై ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందోనన్న ఆందోళన ఎక్కువ మందిని పీడిస్తోందని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడును చూపుతున్నారు. చిన్నశ్రీనుతో ఉన్న బంధుత్వం కారణంగా ఆయనను పార్టీ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. ఎమ్మెల్యే స్థాయి నేతకే పార్టీలో పక్కన పెట్టిన పరిస్థితుల్లో తమకు పార్టీ కష్టాలు తప్పవని టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. మరోవైపు తమను టీడీపీలోకి తీసుకువెళ్లే విషయంలో చిన్నశ్రీను కనీసం మాట్లాడకపోవడం, ఒకేవేళ ఆయన పిలుపుతో ఆ పార్టీలోకి వెళ్లినా, ఇప్పుడు అక్కడ ఉన్న నేతలను కాదని పదవులు దక్కే పరిస్థితి లేకపోవడంతో చిన్నశ్రీను అనుచరుల్లో రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు.
