Begin typing your search above and press return to search.

అసలైన పసుపు తమ్ముడిగా చిన్న శ్రీను !

విజయనగరం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అతి పెద్ద ప్రకంపనలు రేపడం ద్వారా చిన్న శ్రీను తొలి విజయం సాధించారు.

By:  Satya P   |   15 Sept 2026 9:48 AM IST
అసలైన పసుపు తమ్ముడిగా చిన్న శ్రీను  !
X

విజయనగరం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అతి పెద్ద ప్రకంపనలు రేపడం ద్వారా చిన్న శ్రీను తొలి విజయం సాధించారు. నిజానికి ఆయన ఎమ్మెల్యే కాదు, మంత్రిగా పనిచేయలేదు, కానీ ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ సౌండ్ చేసింది. ఏకంగా చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోవడం ద్వారా చిన్న శ్రీను తన స్థాయి ఏమిటో చెప్పకనే చెప్పారు. ఇక ఆయన ఒక జెడ్పీ చైర్మన్. అది కూడా పదవీ కాలం తొందరలో ముగిసిపోతుంది. అలాంటి నాయకుడు పార్టీ మారితే ఇంతలా హైరానా పడాలా అన్న వారికి మాత్రం ఉత్తరాంధ్రా రాజకీయాల మీద అవగాహన లేదనే అంటున్నారు. చిన్న శ్రీను విజయనగరం జిల్లా నుంచి మొదలెట్టిన రాజకీయాన్ని మెల్లగా ఉత్తరాంధ్రా అంతటా విస్తరించారు అని అంటున్నారు.ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో అత్యంత బలమైన ఒక సామాజిక వర్గానికి ఆయన ఐకాన్ గా మారడం కూడా ఆయన పార్టీ మార్పుతో ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేయడానికి కారణం అని అంటున్నారు.

బొత్స కదిలిపోయారంటేనే :

ఇక చిన్న శ్రీను పార్టీ మారారు అంటే పెద్ద నాయకుడిగా ఉంటూ ఉత్తరాంధ్రను శాసించిన బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కదిలిపోయారు. ఆయన రెండు మూడు సందర్భాలలో కన్నీటి పర్యంతం అయ్యారు. అంతే కాదు ఆయనకు చిన్న శ్రీను వెళ్లిపోవడం వల్ల కలిగే అసలు నష్టం తెలుసు అని అంతా అంటున్నారు. ఇక బొత్స చూస్తే ఏడు పదులకు చేరువ అవుతున్నారు. చిన్న శ్రీను రాజకీయంగా ఇంకా కీలక దశలో ఉన్నారు. దాంతో పాటు బొత్స వ్యూహాలు పట్లూ అన్నీ తెలిసిన వారిగా చిన్న శ్రీను ఉన్నారు. ఇక భవిష్యత్తు పాలిటిక్స్ అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది అన్నది అయితే విశ్లేషించే వారికి కూడా అర్ధం అవుతోంది. ఈ విషయాలను అన్నీ తెలిసే టీడీపీ అధినాయకత్వం చిన్న శ్రీనుకు అంత ప్రయారిటీ ఇచ్చింది అని చెబుతున్నారు.

వ్యూహాత్మకంగానే :

ఇక చిన్న శ్రీను తన రాజకీయ పరిణతి అనుభవం ఏమిటో మెల్లగా చూపిస్తున్నారు. ఆయన సైలెంట్ గా ఉండవల్లి వెళ్ళి పసుపు కండువా కప్పుకున్నారు. ఆ తరువాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అనంతరం ఆయన పద్ధతి ప్రకారం టీడీపీలో వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. కోట రాజకీయం మీద పూర్తి అవగాహన ఉన్న ఆయన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుని కలుసుకున్నారు. ఆ తర్వాత గోవా వెళ్ళి పెద్దాయన అశోక్ గజపతిరాజుని మర్యాదపూర్వకంగా కలసి వచ్చారు. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే విశాఖలో ఉన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ తో భేటీ కావడం. ఈ ఇద్దరూ కూడా చాలా సేపు అనేక అంశాలు చర్చించుకున్నారు. ఇలా చాలా జాగ్రత్తగా టీడీపీలో తన అడుగులను చిన్న శ్రీను వేస్తున్నారు అని అంటున్నారు.

స్కోప్ ఉంది కాబట్టే :

విజయనగరం జిల్లా టీడీపీ రాజకీయాల్లో స్కోప్ ఉంది. పొలిటికల్ గా అది అడ్వాంటేజ్ అనుకున్న వారికి ఎంతో చాన్స్ ఇస్తుంది. దానిని అవగాహన చేసుకున్న మీదటనే చిన్న శ్రీను పసుపు కండువా కప్పుకున్నారు అని అంటున్నారు. పెద్దలు ఎవరూ తన రాక పట్ల ఇబ్బంది పడకుండా ఆయన వరుసగా భేటీలు వేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన తీరులోనే తాను ఉంటానను హామీ ఇస్తున్నారు. ఇక తాను ఒక్కసారిగా టీడీపీలో చేరిన తరువాత అచ్చమైన పసుపు తమ్ముడిగానే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలన భేష్ అంటున్నారు. లోకేష్ యువ నాయకత్వం శభాష్ అంటున్నారు మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.

విమర్శలకు చేతలతోనే :

అదే సమయంలో తన మీద వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన చేతలతోనే జవాబు చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక టీడీపీలో పదవులు ఆశించి ఆయన చేరారు అని అంటున్నారు. ఒక వేళ పదవులు దక్కకపోయినా ఓపికగా వేచి ఉండేందుకు కూడా సిద్ధపడే అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. దాని కంటే ముందు స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఆయన అనుకుంటున్నారు. ఇక చిన్న శ్రీనుకు ఎంత మంది వైసీపీ నుంచి మద్దతుగా వస్తారు అన్నది ఎవరికీ తెలియడం లేదు, చిన్న శ్రీను కూడా దాన్ని సస్పెన్స్ లో పెట్టేశారు. అది కూడా ఆయన వ్యూహమే అని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో చేరుతూనే తన వ్యూహాలకు చిన్న శ్రీను పదును పెడుతున్నారని అంటున్నారు.