అశోక్ బంగ్లాకి చిన్న శ్రీను.. 25 ఏళ్లలో తొలిసారి!
టీడీపీ నాయకుడిగా విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లడంలో వింత లేకపోయినా, చిన్న శ్రీను సుదీర్ఘ రాజకీయ నేపథ్యం తెలిసిన వారు మాత్రం ఈ మార్పును ప్రత్యేకంగా చూస్తున్నారు.
By: Tupaki Political Desk | 11 Sept 2026 7:59 PM ISTవిజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరిన తర్వాత అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 30 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన చిన్న శ్రీను తొలిసారి విజయనగరం పట్టణంలోని అశోక్ బంగ్లాకు వెళ్లడం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఇన్నాళ్లు స్వతంత్రంగా, తన ఇంటినే కేంద్రంగా చేసుకుని జిల్లా రాజకీయాలను నడిపిన చిన్న శ్రీను తొలిసారి అశోక్ బంగ్లాలో అడుగు పెట్టారు. టీడీపీ నాయకుడిగా విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లడంలో వింత లేకపోయినా, చిన్న శ్రీను సుదీర్ఘ రాజకీయ నేపథ్యం తెలిసిన వారు మాత్రం ఈ మార్పును ప్రత్యేకంగా చూస్తున్నారు.
అశోక్ బంగ్లా స్పెషల్ ఇదే..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి విజయనగరంలోని అశోక్ బంగ్లాలోనే జిల్లా పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నారు. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా అధునాత భవనాల్లో కార్యాలయాలు ఉన్నప్పటికీ విజయనగరంలో మాత్రం వేరే కార్యాలయాన్ని ఇంతవరకు చూడలేదు. అందుకు కారణం విజయనగరం సంస్థానాదీశుడు, గోవా గవర్నర్ నివాసం అశోక్ బంగ్లాలోనే ఉంటుంది. జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన ఆయన తన బంగ్లా తప్ప వేరే చోట పార్టీ కార్యాలయం నిర్వహణకు ఇంతవరకు ఇష్టపడలేదని చెబుతున్నారు. ఈ కారణంగా జిల్లా పార్టీ కార్యాలయంతోపాటు విజయనగరం నియోజకవర్గ కార్యాలయంగా అశోక్ బంగ్లానే కొనసాగిస్తున్నారు. అయితే రాజుల ఆధిపత్యాన్ని ఇష్టపడిన వారు ఇతర పార్టీల్లో ఉంటూ అశోక్ బంగ్లా రాజకీయాలను ఆక్షేపించేవారు.
చిన్న శ్రీను ఎంట్రీపై చర్చకు ఎందుకంటే..
అశోక్ బంగ్లాకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా టీడీపీ వ్యతిరేక శిబిరంలో ఉంటూ దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన చిన్న శ్రీను ఎప్పుడూ ఇటువైపు రాలేదని చెబుతున్నారు. చిన్న శ్రీను సొంత ఇళ్లు కూడా విజయనగరంలోనే ఉంది. అయినప్పటికీ ఆయన ఎప్పుడు అశోక్ బంగ్లా వైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు. అశోక్ బంగ్లాతో పోటీగా చిన్న శ్రీను నివాసం కూడా ఎప్పుడూ రాజకీయ కార్యకలాపాలతో సందడిగా ఉండేది. దీంతో విజయనగరం జిల్లాలో రెండు పార్టీల కార్యాలయాలుగా అశోక్ బంగ్లా, చిన్న శ్రీను నివాసం కొనసాగేవి. ఇక సీనియర్ నేత బొత్స మేనల్లుడిగా ఆయన అడుగుజాడల్లో రాజకీయం చేసిన చిన్నశ్రీను కూడా టీడీపీ నేతలను వారి కార్యాలయాల్లో కలిసేందుకు కూడా వెళ్లేవారు కాదని చెబుతున్నారు. దీంతో చిన్న శ్రీను అశోక్ బంగ్లాకు తొలిసారి రావడం ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు.
ఇప్పుడు ఒకటే బంగ్లా?
విజయనగరంలో రెండు పార్టీలు రెండు బంగ్లాల నుంచి రాజకీయాలను నడిపేవి. అయితే ఇప్పుడు రెండు బంగ్లాలలో ఉన్నవారు చేతులు కలపడంతో ఒక పార్టీకి కేంద్ర స్థానం లేకపోయినట్లైందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, సొంతంగా పార్టీ కార్యాలయం నిర్మించినప్పటికీ చిన్నశ్రీను రాజీనామా చేసేవరకు ఆయన నివాసమే పార్టీ వ్యవహారాలకు వేదికగా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాత వైసీపీ కార్యకలాపాలు ఇకపై జిల్లా కార్యాలయానికి మారతాయా లేక సీనియర్ నేత బొత్స ఇంటికి చేరతాయా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.
ఇక ఇందులో కొసమెరుపు కూడా ఒకటి ఉందని అంటున్నారు. విజయనగరంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణంపై ఒక వివాదం ఉంది. ఆ వివాదానికి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, టీడీపీ నేత చిన్న శ్రీనుకు కూడా సంబంధం ఉందని అంటున్నారు. చిన్న శ్రీను వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన భూమిలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మించారని ఫిర్యాదులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ విధంగా విజయనగరం జిల్లాలో రాజకీయాలు అశోక్ గజపతిరాజు, చిన్న శ్రీను నివాసాలు కేంద్రంగా వారి ఆధ్వర్యంలోనే నడిచాయని ఇప్పుడు చిన్న శ్రీను గవర్నర్ అశోక్ నివాసంలో అడుగు పెట్టడంతో సుదీర్ఘంగా సాగిన పోరుకు విరామం ప్రకటించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.
