Begin typing your search above and press return to search.

దువ్వాడను మించిన జగన్ భక్తుడు ఉన్నాడా ?

ఆయన కుటుంబంలో వచ్చిన సమస్యలు వ్యక్తిగతం అని అలాంటి వివాదాలను కారణంగా చూపించి ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపేశారు అని అంటున్నారు.

By:  Satya P   |   14 Sept 2026 9:10 AM IST
దువ్వాడను మించిన జగన్ భక్తుడు ఉన్నాడా ?
X

ఈ మాట అంటున్నది ఎవరో కాదు వైసీపీకి చెందిన వారే. తాజాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల మీద వైసీపీ అభిమానులు సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అందులో అనేక అంశాలను వారు చర్చిస్తున్నారు. వైసీపీలో జగన్ ఎవరిని నమ్ముతున్నారు ఎవరిని నమ్మడం లేదు అన్నది కూడా కరడు కట్టిన వైసీపీ ఫ్యాన్స్ చర్చకు తేవడం విశేషం. జగన్ ఎవరిని అయితే అందలాలు ఎక్కించారో వారే ఆయన్ని కాదని కాడె వదిలేసి పోతున్నారు అని గుర్తు చేస్తున్నారు. దాంతో వారంతా పదవుల కోసమే ఉంటున్నారని అవే పదవుల కోసం గడప దాటేస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ అధినేత ఈ విషయంలో ఆలోచిస్తున్నారా అని అభిమానులు పోస్టులు పెడుతూ కొత్త చర్చకు తెర లేపుతున్నారు.

చిన్న శ్రీను ఎపిసోడ్ తో :

విజయనగరం జిల్లాలో చిన్న శ్రీనుకు జగన్ ఏమి అన్యాయం చేశారు అని ఆ పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం చేతిలో అయిదు పదవులు ఉన్నాయని వారు చెబుతున్నారు వాటిని అన్నీ జగన్ ఇచ్చినా కూడా ఫ్యాన్ పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళారని అంటున్నారు. నిజానికి ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు మారాలని ఎవరు తమ వారు ఎవరు పరవారు అన్నది సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే పార్టీ నుంచి సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీను ప్రస్తావనను కూడా తెస్తున్నారు. ఆయన ఏమి తప్పు చేశారు అని సస్పెండ్ చేశారు అని ప్రశ్నిస్తున్నారు.

వ్యక్తిగత వివాదంతోనే :

ఆయన కుటుంబంలో వచ్చిన సమస్యలు వ్యక్తిగతం అని అలాంటి వివాదాలను కారణంగా చూపించి ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపేశారు అని అంటున్నారు. ఇంత చేసినా ఆయన వైసీపీ అధినేత జగన్ ని పల్లెత్తు మాట అనలేదని ఈ రోజుకీ ఆయన పార్టీ గురించి జగన్ గురించి మంచిగానే మాట్లాడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఆయన వైఎస్సార్ కాలం నుంచి వైఎస్సార్ ఫ్యామిలీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని నిఖార్సు అయిన అభిమానిగా ఉన్నారని అంటున్నారు. అలాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపేశారని కానీ పార్టీ పదవులు అన్నీ ఇచ్చినా ఉండకుండా కొందరు నేతలు గుండెల మీద తన్నేసి మరీ పోతున్నారని వైసీపీ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా పోస్టుల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

తప్పు జరుగుతోందా :

వైసీపీలో తప్పు జరుగుతోంది అన్నది క్యాడర్ మాటగా ఉంది. వారి నుంచే చాలా మంది సోషల్ మీడియాలో తమ భావనను వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ముందూ వెనకా చూసుకోకుండా కొందరిని అందలం ఎక్కించడం తీరా వారు ఏరు దాటేసి తెప్ప తగలేసాక మధన పడడం పార్టీకి అలవాటుగా మారుతోందని అంటున్నారు. ఎవరు ఏమిటి అన్నది అధినాయకత్వం విచారించాలని ఆ మీదటనే పదవులు అప్పగించాలని సూచిస్తున్నారు. లేకపోతే ఇలాగే జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి చిన్న శ్రీను ఎపిసోడ్ ఏమో కానీ దువ్వాడ శ్రీనును జగన్ భక్తుడిగా వైసీపీ ఫ్యాన్స్ తేల్చారు. మరి ఇదే అభిప్రాయం ఏమైనా హైకమాండ్ కి ఉంటుందా లేదా అలా కలగాలనే ఈ పోస్టులు పెడుతున్నారా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది.