వైసీపీలో మొదలైన చిన్న శ్రీను ప్రకంపనలు
కాంగ్రెస్ వైసీపీలో దశాబ్దాల పాటు పనిచేసిన చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లాలో బలమైన అనుచర వర్గం ఉంది.
By: Satya P | 24 Sept 2026 7:00 AM ISTకాంగ్రెస్ వైసీపీలో దశాబ్దాల పాటు పనిచేసిన చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లాలో బలమైన అనుచర వర్గం ఉంది. అంతే కాదు జిల్లాలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే చిన్న శ్రీను తన కుమార్తెతో కలసి ఎలాంటి ఆడంబరం లేకుండా టీడీపీలో చేరిపోవడం పట్ల అంతా చర్చించుకున్నారు. చిన్న శ్రీను టీడీపీ తీర్థం పుచ్చుకుని రెండు వారాలు అయినా ఆయన వెంట వెళ్లేందుకు ఒక్కరు కూడా లేరా అని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే సరిగ్గా జిల్లా పరిషత్ పదవీకాలం ముగింపు వేళ చిన్న శ్రీను అసలైన బలం ఏంటో బయటపడింది. దీంతో విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
గుడ్ బై కొట్టేశారు :
విజయనగరం జిల్లాలో వైసీపీ జెడ్పీటీసీలు అయిదుగురు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం వారు బాహాటంగా ప్రకటించారు. ఈ అయిదుగురు జెడ్పీటీసీలలో చీపురుపల్లి కి చెందిన వాలిరెడ్డి శిరీష ఒకరు అయితే గజపతి నగరానికి చెందిన గార తవుడు అనే జెడ్పీటీసీ, గంట్యాడకు చెందిన మరో జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, విజయనగరానికి చెందిన కెల్ల శ్రీనివాసరావు, కొత్తవలస జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి ఉన్నారు. ఈ అయిదుగురు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వారు కావడం విశేషం. దాంతో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సొంత సీటు చీపురుపల్లి, అలాగే బొత్స తమ్ముడు అప్పలనరసయ్య సీటు గజపతినగరం, మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి సొంత సీటు విజయనగరం, ఎస్ కోట నుంచి మరో జెడ్పీటీసీ మరో అసెంబ్లీ సీటు ఇలా ఎంచుకుని మరీ తన అనుచరుల చేత రాజీనామా చిన్న శ్రీను ఇప్పించారు అని అంటున్నారు.
మరిన్ని చేరికలు :
ఇది ఆరంభం మాత్రమే అని చిన్న శ్రీను వర్గం అంటోంది. ఇంకా అనేక మంది వైసీపీని వీడి చిన్న శ్రీను వెంట ఉంటారు అని చెబుతోంది. రానున్న రోజులలో నాయకులు కాదని ఒక అతి పెద్ద వర్గమే వైసీపీని వీడి చిన్న శ్రీను సారధ్యంలో టీడీపీలో చేరుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జిల్లా వైసీపీలో భారీ రాజకీయ కుదుపు తొందరలో సంభవిస్తుంది అని అంటున్నారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చిన్న శ్రీను వర్గం అంతా వైసీపీని వీడి టీడీపీలోకి వస్తుందని చెబుతున్నారు.
బొత్సకే సవాల్ గా :
ఇక బొత్స సత్యనారాయణకే ఈ పరిణామాలు షాక్ గా మారుతాయని అంటున్నారు. ఆయన చాలా కాలంగా జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండడం చిన్న శ్రీను అందరితో సాన్నిహిత్యం నెరపడంతో జిల్లాలో వైసీపీ మీద చిన్న శ్రీను పట్టు పెరిగింది అని అంటున్నారు. ఇపుడు బొత్స తాను అందుబాటులో ఉంటాను అని ప్రతీ చోటా మీటింగులు పెట్టి చెప్పినా చిన్న శ్రీను వర్గం మాత్రం ఆయన వెంటే అని స్పష్టం చేస్తోంది అంటున్నారు. వైసీపీలో కీలక నాయకులు కూడా ఈ వైపుగా మారుతారని చెబుతున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తూంటే జిల్లాలో వైసీపీకి రాజకీయంగా బొత్సకు వ్యక్తిగతంగా చిన్న శ్రీను రూపంలో గట్టి దెబ్బ పడుతుందని అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీ పునరుత్తేజం పొందాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.
