Begin typing your search above and press return to search.

చిన్న శ్రీను...పెద్ద ప్లానేనా ?

టీడీపీలో మొదటి నుంచి ఉన్నవారు, మధ్యలో వచ్చిన వారు, కొత్తగా వచ్చిన వారి మధ్యన జెడ్పీ పీఠం ఎవరిని వరిస్తుంది అన్నది చెప్పడం అయితే కష్టంగానే ఉంది అని అంటున్నారు

By:  Satya P   |   24 Oct 2026 10:00 PM IST
చిన్న శ్రీను...పెద్ద ప్లానేనా ?
X

విజయనగరం జెడ్పీ పీఠం రేసులో ఇపుడు అనేక మంది కనిపిస్తున్నారు. టీడీపీలో మొదటి నుంచి ఉన్నవారు, మధ్యలో వచ్చిన వారు, కొత్తగా వచ్చిన వారి మధ్యన జెడ్పీ పీఠం ఎవరిని వరిస్తుంది అన్నది చెప్పడం అయితే కష్టంగానే ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా మాజీ మంత్రిగా ఇంకా చెప్పాలీ అంటే 1983లో టీడీపీ తరఫున గెలిచిన కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన సామాన్య నాయకుడు కాదు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన వారు. ఇక ఆయనకు 2024లో చీపురుపల్లి టికెట్ ని చివరి నిముషంలో కేటాయించారు. ఆయన అక్కడ గెలిచి చూపించారు. కచ్చితంగా మంత్రి అవుతారని అనుకున్నారు. కానీ దక్కలేదు, ఇక కుమారుడిని రాజకీయ వారసుడిగా తేవాలనుకున్నారు. జెడ్పీ చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ అయింది. దాంతో తన కోడలిని గరివిడి నుంచి పోటీలో ఉంచారు. ఆయన జెడ్పీ పీఠం తమ కోడలి కోసం ఆశిస్తున్నారు.

వీరంతా లైన్ లో :

అంతే కాదు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత కంది చంద్రశేఖర్‌ జెడ్పీ పీఠం కోసం తన భార్య రమాదేవిని డెంకాడ నుంచి జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేయించారు. నాడు ఎంపీ పీఠం చేజారింది కాబట్టి ఈసారి తన సతీమణి గెలిస్తే కచ్చితంగా జెడ్పీ చైర్మన్‌ పదవి దక్కుతునని ఆశిస్తున్నారు. అదే నెల్లిమర్లకు చెందిన మరో సీనియర్ నేత మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు కూడా తన కుమార్తె చంద్రకళను జెడ్పీటీసీ పదవికి పోటీకి పెట్టారు. ఆయన అయితే 2019 నుంచి నెల్లిమర్ల టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా రెండు సార్లూ ఆయనకు చాన్స్ తప్పిపోయింది. దాంతో జెడ్పీ చైర్మన్ పదవి అయినా తమ కుటుంబానికి ఆయన కోరుకుంటున్నారని అంటున్నారు.

రెండు సీట్ల నుంచి :

అయితే అనూహ్యంగా రెండు జెడ్పీటీసీ స్థానాల నుంచి చిన్న శ్రీను తన కుమార్తె సిరి సహస్ర చేత నామినేషన్లు వేయించారు. అందులో ఒకటి బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం తెర్లాం మండలం అయితే రెండవది ఎస్ కోట అసెంబ్లీ నియోజకవర్గం కొత్తవలస మండలంగా ఉంది. ఈ రెండు సీట్ల నుంచి ఒక నాయకురాలు జెడ్పీటీసీ పదవికి పోటీ చేయడం అంటే అది అరుదైన ఘటనగానే చూడాలి. పైగా హైకమాండ్ ఇచ్చిన ప్రాధాన్యతగా కూడా చెప్పుకోవాలి. ఇంత ప్రాముఖ్యత ఇచ్చి మరీ హైకమాండ్ చిన్న శ్రీను కుమార్తె విషయంలో చేసింది అంటే ఆమెకే జెడ్పీ చైర్మన్ పదవిని ఇస్తుందని టీడీపీలో పాత కాపులు ఆశావహులు అంతా కలవరపడుతున్నారని అంటున్నారు.

బలమైన హామీతోనే :

ఇదిలా ఉంటే చిన్న శ్రీను వైసీపీలో ఉంటూ జిల్లా రాజకీయాలను శాసించేవారు. ఆయన 2021 నుంచి 2026 దాకా అయిదేళ్ళ పాటు జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. అలాంటి నాయకుడి టీడీపీలో చేరినపుడు బలమైన హామీ ఆయనకు లభించింది అని అంటున్నారు. అందులో భాగమే ఆయన కుమార్తె చేత రెండు చోట్ల పోటీ చేయించారు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న శ్రీను తన కుమార్తెని జెడ్పీ పీఠం మీద కూర్చోబెట్టాలని భారీ ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. దాంతో విజయనగరంలో టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయని అంటున్నారు.