Begin typing your search above and press return to search.

చిన్న శ్రీనుకు చిన్న పదవినా ?

ఎమ్మెల్సీగా ముందు చాన్స్ ఇచ్చి ఆనక మంత్రిగా చేస్తారు అన్నది పుకార్లుగానూ షికారు చేశాయి. నిజానికి చిన్న శ్రీనుకు ఆ పదవులను చేపట్టే అనుభవం సామర్థ్యం ఉందని కూడా చెప్పాలి.

By:  Satya P   |   11 Oct 2026 7:20 AM IST
చిన్న శ్రీనుకు చిన్న పదవినా ?
X

ఆయనను అంతా చిన్న శ్రీను అని పిలుస్తారు కానీ రాజకీయంగా చూస్తే పెద్ద శ్రీను కిందనే లెక్క. దశాబ్దాల పాటు కాంగ్రెస్ వైసీపీలో పనిచేసి సీనియర్ నేతలలో ఒకరిగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా పట్టు ఉంది. ఆయన వ్యూహాలను ఎవరూ తేలికగా తీసుకోలేరు. అలాంటి చిన్న శ్రీను వైసీపీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్యాక్ బోన్ గా ఉండేవారు. ఆయన గత నెలలో అనూహ్యంగా ఫ్యాన్ నీడ నుంచి బయటపడి సైకిలెక్కేశారు. ఆనాడు ఆయన గురించి చాలా చర్చనే సాగింది. చిన్న శ్రీనుకు టీడీపీలో భారీ ఆఫర్ ఉందని కూడా చెప్పుకున్నారు. ఆయనే కాబోయే మంత్రి అని కూడా ప్రచారం చేసేశారు.

కట్ చేస్తే మరి :

ఎమ్మెల్సీగా ముందు చాన్స్ ఇచ్చి ఆనక మంత్రిగా చేస్తారు అన్నది పుకార్లుగానూ షికారు చేశాయి. నిజానికి చిన్న శ్రీనుకు ఆ పదవులను చేపట్టే అనుభవం సామర్థ్యం ఉందని కూడా చెప్పాలి. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా అయిదేళ్ళు పనిచేశారు. విజయనగరం జిల్లా వైసీపీలో ముఖ్య పాత్ర పోషించి అనేక మంది ఎమ్మెల్యేల విజయం వెనక ఉన్నారు. కాబట్టి మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చినా అర్హుడే అని అనుకున్నారు కానీ కట్ చేస్తే ఆయనకు చిన్న పదవి దక్కింది అన్న అసంతృప్తి అయితే ఆయన అనుచరులలో ఉంది అరకు పార్లమెంట్ నియోజకవరం అబ్జర్వర్ గా చిన్న శ్రీనుని పార్టీ నియమించింది. నిజానికి ఇది చిన్న శ్రీను స్థాయికి చిన్న పదవి అని ఆయన అభిమానులు మధనపడుతున్నారని అంటున్నారు.

వైసీపీతో పోల్చుకుంటూ :

ఇక చిన్న శ్రీను వైసీపీని వీడేటపుడు అక్షరాలా అయిదు పదవులలో ఉన్నారని లిస్ట్ చదువుతున్నారు. ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, భీమిలీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా, రాష్ట్ర వైసీపీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరాంధ్రా నాయకుడిగా వ్యవహరించేవారు అని గుర్తు చేస్తున్నారు. అలాంటి ఆయన టీడీపీలో చేరితే ఉత్తరాంధ్రా కన్వీనర్ పోస్టు ఇస్తారని లేదా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెడతారు అని అనుచరులు భావించారని అంటున్నారు. ఎన్నో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయని వాటిలో ఒకటి ఆయనకు ఇచ్చి ఆ మీదట మంత్రిని కూడా చేయవచ్చు అని ఊహించారని అంటున్నారు. మరి వైసీపీలో అన్ని పదవులు వదులుకుని వచ్చిన చిన్న శ్రీనుకు తగిన హోదా దక్కలేదని అనుచరులు మధన పడుతున్నారని టాక్ నడుస్తోంది.

వెయిట్ చేస్తేనే :

అయితే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేశాక ఎంతటి సీనియర్ నేత అయినా అక్కడ కొత్త వారి కిందనే లెక్క అని అంటున్నారు. పైగా వలస వచ్చిన నేతలను అంతవరకూ ఉన్న వారు కూడా వేరేగానే చూస్తారు. దాంతో అందరితో కలిసి పోవాల్సి ఉంటుంది. అలాగే పార్టీని మరింతగా పటిష్టం చేయడం ద్వారా అధినాయకత్వంతో పాటు స్థానిక నేతల మన్ననలు అందుకుంటే ఆటోమేటిక్ గా పదవులు దక్కుతాయని అంటున్నారు. వేచి ఉండకపోతే ఎక్కడైనా పదవులు రావనే చెబుతున్నారు. అయితే చిన్న శ్రీను మనసులో ఏముందో ఆయన బయటపడడం లేదు, పైగా అనుభవం కలిగిన నేత కాబట్టి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఆయనకు నేరుగా టీడీపీ అధినాయకత్వంతోనే కలిసి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు టీడీపీలో మంచి అవకాశాలే దక్కుతాయని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.