Begin typing your search above and press return to search.

వెక్కివెక్కి ఏడ్చేసిన బొత్స.. ధైర్యం సడలిపోయిందా?

చిన్న శ్రీను లేకపోయినా తామంతా మీతోనే ఉంటామని బొత్సకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   10 Sept 2026 2:11 PM IST
వెక్కివెక్కి ఏడ్చేసిన బొత్స.. ధైర్యం సడలిపోయిందా?
X

విజయనగరం జడ్పీ చైర్మన్, తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడాన్ని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తట్టుకోలేకపోతురు. రెండు రోజుల క్రితం చిన్న శ్రీను వైసీపీలో అన్ని పదవులకు రాజీనామా చేసి ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బుధవారం మీడియాతో మాట్లాడిన సీనియర్ నేత బొత్స రాజకీయాల్లో పార్టీ మార్పు అత్యంత సహజమని ప్రకటించారు. దీంతో మేనల్లుడు పార్టీ మారడాన్ని బొత్స తేలికగా తీసుకున్నారని భావించారు. అయితే ఇదే విషయమై కేడర్ తో చర్చించేందుకు గురువారం సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చీపురుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు మాట్లాడుతుండగా, ఒక్కసారిగా బొత్స కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిన్న శ్రీను లేకపోయినా తామంతా మీతోనే ఉంటామని బొత్సకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి పట్టణంలో వైసీపీ కార్యకర్తలతో బొత్స అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో తన మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మారడాన్ని తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చేశారు. ఇదే విషయమై ముందు రోజు అత్యంత సహజంగా మాట్లాడిన బొత్స.. సొంత నియోజకవర్గం వెళ్లే సరికి తన ఆవేదన, బాధ దాచుకోలేక బయటపడిపోయారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేనల్లుడు, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను పార్టీ మారడం ద్వారా తనకు తీవ్రనష్టమని బొత్స భావిస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఎవరైనా నాయకుడు బయటకు వెళితే స్వార్థంతో పార్టీ మారారని నేతలు చెబుతుంటారు. కానీ, బొత్స మాత్రం చిన్న శ్రీను విషయంలో అలా చెప్పలేక ఏడ్చేశారా? అన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

ఆ అనుబంధం చిన్నది కాదు!

రాజకీయాల్లో పార్టీల మార్పు అనేది అతి సాధారణమే. జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరడాన్ని కూడా అంతా ఇదేవిధంగా భావించారు. కానీ, బొత్స మాత్రం అంత తేలికగా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఇద్దరి అనుబంధం వేరు అనేది బొత్స కుటుంబ సన్నిహితుల మాట. బొత్స, చిన్న శ్రీను వేర్వేరు మనుషులు.. కానీ వారి మనసులు ఒకటే అనే అభిప్రాయం ఉంది. బొత్స మనసులో ఏముందో గ్రహించి అందుకు తగినట్లు నడుచుకోవడమే ఇన్నాళ్లు చిన్న శ్రీను చేసింది. మేనమామ మాట జవదాటని వ్యక్తిగా ఆయన దాదాపు 20 ఏళ్లు రాజకీయాలు చేశారని చెబుతున్నారు. బొత్స రాజకీయంగా తెరముందు కనిపిస్తే, తెరవెనుక చక్రం తిప్పి కుటుంబాన్ని రాజకీయంగా ఎదురులేని శక్తిగా నిలిపింది చిన్న శ్రీను అనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు కృష్ణార్జునులుగా మెలిగిన మామా అళ్లుడు మధ్య త్వరలో యుద్ధం మొదలు అవుతుండటమే బొత్స అనుచరులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

చిన్న శ్రీను స్థానం పూడ్చేదెలా?

మేనల్లుడు చిన్న శ్రీను తనను వీడి వెళ్లిపోవడం రాజకీయంగా వ్యక్తిగతంగా నష్టమని బొత్స భావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన తన ఆవేదన దాచుకోలేకపోయారని అంటున్నారు. దాదాపు 20 ఏళ్లుగా తనతో తిరిగిన చిన్న శ్రీను ఆకస్మాత్తుగా ప్రత్యర్థిగా మారడంతో బొత్స ఉలికిపాటుకు గురవుతున్నారని అంటున్నారు. మొత్తం తన వ్యూహాలు, ఆలోచనలు తెలిసిన వ్యక్తిని ఎదుర్కోవడం ఎలా అన్న సందిగ్ధత బొత్సను వెంటాడుతోందని భావిస్తున్నారు. రాజకీయంగా తన బలం, బలహీనతలు తెలిసిన చిన్న శ్రీను బయటికి వెళ్లిపోవడం, ఆ స్థానంలో ఎవరిని ముందుకు తీసుకురావాలో తేల్చుకోలేక సీనియర్ నేత సతమతమవుతున్నారని, ఆ ఆవేదన కంటతడిగా మారి బయటికి వచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.