అశోక్ ఆశీస్సులు అందుకున్న చిన్న శ్రీను
విజయనగరం జిల్లా రాజకీయాలు అంటే పెద్దాయన పూసపాటి అశోక్ గజపతి రాజు అందరికీ గుర్తుకు వస్తారు. అశోక్ గజపతి రాజు 1982లో టీడీపీలో చేరారు.
By: Satya P | 13 Sept 2026 10:28 PM ISTవిజయనగరం జిల్లా రాజకీయాలు అంటే పెద్దాయన పూసపాటి అశోక్ గజపతి రాజు అందరికీ గుర్తుకు వస్తారు. అశోక్ గజపతి రాజు 1982లో టీడీపీలో చేరారు. 2025 లో ఆయన పార్టీని వీడి గోవా గవర్నర్ గా రాజ్యాంగ బద్ధ పదవిలోకి వెళ్లారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు విజయనగరం జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. ఈ రోజు కూడా ఆయన కనుసన్నలలోనే సాగుతుందని చెప్పుకుంటారు. వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఏకంగా పెద్దాయన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఆశీస్సులను తీసుకున్నారు. పార్టీలో చేరిన ఆయన ముందుగా కోట రాజకీయాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చూడడం ఆయన వ్యూహానికి నిదర్శనం అని అంటున్నారు. జిల్లాలో టీడీపీ రాజకీయాల్లో రాణించాలి అంటే పెద్దాయన అండదండలు ఉండాలి అన్నది చిన్న శ్రీను గ్రహించి ఈ విధంగా చేశారు అని అంటున్నారు.
మర్యాదపూర్వకంగానే :
తమ కుమార్తె సిరి సహస్ర తో కలసి చిన్న శ్రీను గోవా వెళ్ళి మరీ పెద్దాయన అశోక్ గజపతిరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు విజయనగరం శాసనసభ్యురాలు అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు కూడా ఉండడం విశేషం. గోవాలోని గవర్నర్ బంగ్లాలో జరిగిన ఈ సమావేశంలో అశోక్ చిన్న శ్రీనుని ఆయన కుమార్తెను ప్రత్యేకంగా అభినందించి వారిద్దరికీ ఆతిధ్యం ఇవ్వడం జరిగింది. ఇందంతా ఆహ్లాద పూర్వకమైన వాతావరణంలో జరిగింది అని అంటున్నారు.
అశోక్ దీవెనల కోసమే :
ఇదిలా ఉంటే చిన్న శ్రీను ఈ భేటీ మీద మాట్లాడుతూ పెద్దాయన అశోక్ దీవెనల కోసమే గోవా వచ్చినట్లుగా చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశాలతో పాటు సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా పెద్ద అయిన అశోక్ గజపతిరాజు సూచనలను మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తాను అని చెప్పారు. ఆయన మార్గదర్శకత్వం తమకు ఆచరణీయం అని అన్నారు. అందుకే ప్రత్యేకంగా వచ్చినట్లుగా చెప్పారు.
రాజకీయంగా ప్రాధాన్యత :
ఇదిలా ఉంటే దాదాపుగా రెండున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ వైసీపీలో బొత్స సత్యనారాయణ వెంట ఉంటూ టీడీపీకి ప్రత్యర్ధిగా పనిచేసిన చిన్న శ్రీను సైకిలెక్కడం ఒక విశేష పరిణానంగా చెప్పుకుంటే పెద్దాయన అశోక్ తో ఆయన భేటీ మరింత ఆసక్తికరం అని అంటున్నారు. అశోక్ పట్టు ఈ రోజుకీ జిల్లా రాజకీయాల మీద బలంగా ఉంది. ఆయన గవర్నర్ అయినా కూడా విజయనగరం వస్తే టీడీపీకి చెందిన వారు అంతా వచ్చి కలుస్తారు. ఆయన నుంచి సలహా సూచనలు తీసుకుంటారు. అదే విధంగా జిల్లాలో ఎవరు టీడీపీలో ఉన్నా అశోక్ బంగ్లా నుంచే రాజకీయం సాగడం విశేషం. టీడీపీకి అదే కేంద్ర బిందువుగా ఉంటోంది. ఇక తన రాజకీయ వారసత్వాన్ని కుమార్తె అదితి గజపతిరాజుకు అప్పగించిన అశోక్ రాజ్యాంగ పదవిలో ఉన్నారు. కానీ ఆయనను అభిమానులు అనుచరులు మాత్రం ఎపుడూ తలచుకుంటారు. ఈ క్రమంలోనే చిన్న శ్రీను రాజకీయ తెలివిడితోనే పెద్దాయన ఆశీస్సులు అందుకున్నారు అని అంటున్నారు. ఇక మీదట చిన్న శ్రీను అడుగులు ఏ విధంగా ముందుకు వేస్తారు అన్నది చూడాల్సి ఉంది.
