Begin typing your search above and press return to search.

బట్టతలపై వెంట్రుకలు.. చైనా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. చైనాలో వచ్చిన ఈ అధ్యయనం ఆశను నింపుతుందనే నిజం.. కానీ అది చాలా సులభంగా అందుబాటులోకి వస్తుంది

By:  Tupaki Political Desk   |   28 Oct 2025 9:00 PM IST
బట్టతలపై వెంట్రుకలు.. చైనా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..
X

ప్రతి జీవి వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని మార్పులు అనివార్యం. అందులో ఎక్కువగా కనిపించేది జుట్టు రాలడం, బట్టతల ఏర్పడడం. ఇవి చాలా మందికి మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. ముఖ్యంగా బట్టతల విషయంలో బయటకు చెప్పకపోయినా.. మనసులో ఒక బాధ. మార్కెట్ లో వేలాది ఆయిల్స్, షాంపూలు, చికిత్సలు, థెరపీలు ఉన్నా, నిజమైన ఫలితాల కోసం ఇంకా ఎంతో మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనాలో ఒక సరికొత్త శాస్త్రీయ అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా ఆశ నింపుతోంది. బట్టతలపై వెంట్రుకలు తిరిగి పెరగడం సాధ్యమే అన్న సంకేతాలు ఈ పరిశోధనలో రుజువయ్యాయి. బట్టతల బాధితులకు ఈ శుభవార్తను అందించింది ‘నేషనల్ తైవాన్ యూనివర్సిటీ’కి చెందిన శాస్త్రవేత్తల బృందం. వీరు తయారు చేసిన ఒక ప్రత్యేక సీరం, సాధారణ మార్కెట్ ఉత్పత్తుల్లా కాకుండా, సహజ కొవ్వు ఆమ్లాల ఆధారంగా తయారు చేయబడింది.

నిద్రాణ కణాలను మేల్కొపుతుంది..

జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషించే హెయిర్ ఫాలికల్స్‌లోని మూల కణాలు కొంత కాలానికి నిద్రాణ వస్తలోకి వెళ్లిపోతాయి. ఒకసారి అవి నిశ్చల స్థితిలోకి వెళ్తే.. మళ్లీ వాటిని మేల్కొల్పడం అన్నది ఇప్పటి వరకు శాస్త్రానికి సవాలుగానే మారిందనే చెప్పాలి. అయితే ఈ సీరం ఆ నిద్రాణ కణాలను మళ్లీ ఉద్దీపన చేసి పని చేసే స్థితిలోకి తీసుకువస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ పరిశోధన మొదటగా ఎలుకలపై నిర్వహించారు. జుట్టు రాలిపోయిన ప్రాంతాల్లో ఈ సీరమ్‌ను ఉపయోగించగా కేవలం 20 రోజులలోనే గణనీయమైన జుట్టు పెరుగుదల కనిపించింది. ఇది సాధారణ కాస్మెటిక్ ఫలితం కాదు.. కణ స్థాయిలో జరుగుతున్న మార్పు. శాస్త్రవేత్తల్లో ఒకరు తమ శరీరంపైనే (కాలు) ఈ ప్రయోగాన్ని కొనసాగించారు. ఫలితంగా, అక్కడ కూడా కొత్త వెంట్రుకలు మొలిచాయి. అంటే ప్రయోగశాల పరిమితులను దాటి.. నిజ జీవితంలో కూడా ఈ సీరం పనిచేసే అవకాశాలున్నాయని అర్థం అవుతోంది.

ఆశను నింపుతున్న అధ్యయనం..

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. చైనాలో వచ్చిన ఈ అధ్యయనం ఆశను నింపుతుందనే నిజం.. కానీ అది చాలా సులభంగా అందుబాటులోకి వస్తుంది, ఎవరైనా రాసుకుంటే వెంటనే పనిచేస్తుంది అన్న అతి ఆశలు పెంచుకోవద్దు. పరీక్షలు, సమీక్షలు, భద్రతా ప్రమాణాలు అవసరం. ఇవన్నీ పూర్తయిన తర్వాతనే ఈ సీరం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

ఈ వార్త మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. మన శరీరంలో కొన్ని నిద్రావస్థలోకి వెళ్లిన కణాలు తిరిగి మేల్కొనవచ్చని తెలిసింది. ఈ పరిశోధన మనిషి శరీరం మీదున్న శక్తిని, పునరుత్థాన సామర్థ్యాన్ని కొత్తగా చూపించింది. ఒకప్పుడు బట్టతల శాశ్వతమని భావించిన ప్రపంచం.. ఇప్పుడు ‘ఒక రోజు మళ్లీ వెంట్రుకలు వస్తాయి’ అనే ఆశను కలిగిస్తోంది.

ఈ పరిశోధన వెనుక ఒక పెద్ద శాస్త్రీయ యాత్ర ఉందని చెప్పవచ్చు. జుట్టు పెరుగుదల అంటే కేవలం రసాయనాలు రాసుకోవడమే కాదు.. హార్మోన్ల ప్రభావం.. రక్త ప్రసరణ.. కణాలకు ఆమ్లజనీయం సరఫరా.. పోషకాలు ఇవి అన్నీ కలిసి పని చేసే సంక్లిష్ట ప్రక్రియ. అందువల్ల నిద్రాణ కణాలను మేల్కొల్పడం అంటే శరీరం లోపల ఉండే సహజ శక్తిని వెలికి తీయడం లాంటిది. ఈ సీరం చేసేది అదే.

మరిన్ని సమస్యలకు చెక్ పెడుతుందా..?

అంతేకాదు.., ఈ పరిశోధన వైద్య రంగానికే దిశా నిర్ధేశం. ఇలాంటి సీరంలు కేవలం జుట్టుకే కాదు.. శరీరంలోని మరికొన్ని కణ పునరుత్పత్తి సమస్యలకూ భవిష్యత్‌లో ఆశగా నిలవచ్చు. అంటే ఇది కేవలం బట్టతల కథ మాత్రమే కాదు.. మన శరీరం నూతనంగా పునరుత్థానమవుతుందనే భావనకు శాస్త్రీయ ఆధారం. బట్టతలపై వెంట్రుకలు తిరిగి పెరగడం ఊహ కాదు.. అది ఇప్పుడు శాస్త్ర పరిశోధనల దశలో ఉన్న నిజమైన ప్రయోగ ఫలితం. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే.. అధికారిక ధృవీకరణలు, క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే వరకు సహనం పాటించడం. ఆశతో, నమ్మకంతో, శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి.